Earthquake: కుదిపేసిన భూకంపం... వందల్లో మృతులు
ABN , First Publish Date - 2023-02-06T14:31:25+05:30 IST
ఇప్పటివరకూ 7 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఇస్తాంబుల్: 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ( Major Earthquake ) టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాలను కుదిపేసింది. సైప్రస్(Cyprus), లెబనాన్( Lebanon)లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకూ13 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు భూకంపం వచ్చాక ఇప్పటివరకూ మొత్తం 40 సార్లు భూమి కంపించింది.
దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో నరుద్గీకి 23 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూజి జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్‌మెంట్లు కూలిపోయాయని, భారీ ఆస్తినష్టం జరిగింది. ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ భూకంపం తర్వాత హైఅలర్ట్ ప్రకటించినట్టు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
సిప్రస్, టర్కీ, గ్రీస్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యూకే, ఐరాక్, జార్జియాలోనూ ప్రకంపనలు సంభవించాయి. సిరియాలోని అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. బీరూట్, డమాస్కస్‌లలో అపార్ట్‌మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
టర్కీ లోని 10 నగరాలపై భూకంప ప్రభావం ఉన్నట్టు టర్కీ దేశీయాంగ మంత్రి సులేమాన్ సోయిల్ తెలిపారు. గజియాన్‌టెప్, కహ్రమాన్‌మరస్, హటాయ్, ఒస్మానియె, అడియమన్, మలట్య, అడన, కిలిస్ తదితర నగరాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.
టర్కీ, సిరియా ఆసుపత్రుల్లో ఎటు చూసినా భూకంప బాధితులే కనపడుతున్నారు. గాయపడ్డవారిలో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరణాల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. ఆసుపత్రులు మరుభూములను తలపిస్తున్నాయి.