Covid Update: 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:29 PM
దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.
దేశంలో(India) కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 841 కోవిడ్ 19 కేసులు(covid 19 cases) నమోదయ్యాయి. అయితే ఇవి గత 227 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది. అంతకుముందు మే 19న 865 కరోనా కేసులు రికార్డయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో కేరళ, కర్ణాటక, బీహార్‌లలో ఒక్కొక్కటి చొప్పున మూడు మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత 10 రోజుల కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ క్రమంలో రోజురోజుకు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుత ఇన్‌ఫెక్షన్ కేసులకు ప్రధాన కారణం కరోనా కొత్త వేరియంట్ JN.1 అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటివల కరోనా సోకిన వారిలో చాలా మంది సులభంగా కోలుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు అన్నారు. దీంతోపాటు అనేక మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిన సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. 2019లో ఇదే సమయంలో కరోనా మహమ్మారి మొదలు కాగా నాలుగేళ్లు దాటినా కూడా ఇప్పటికీ దీని ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ఈ నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా కరోనా వ్యాధి బారిన పడ్డారు. అంతేకాదు 5.3 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకి మృత్యువాత చెందారు.