Share News

Sanatana Dharma: సనాతన ధర్మాన్ని కాపాడాలంటే.. బీజేపీ ఎంపీ తేజస్వి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-26T21:30:30+05:30 IST

అప్పట్లో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో కొన్ని రోజుల పాటు అదే హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఆ వివాదం తగ్గుముఖం...

Sanatana Dharma: సనాతన ధర్మాన్ని కాపాడాలంటే.. బీజేపీ ఎంపీ తేజస్వి కీలక వ్యాఖ్యలు

BJP MP Tejasvi Surya: అప్పట్లో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో కొన్ని రోజుల పాటు అదే హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఆ వివాదం తగ్గుముఖం పట్టింది కానీ, సందర్భం దొరికినప్పుడల్లా ఎవరో ఒకరు ఈ వివాదం కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఈ వివాదంపై తనదైన అభిప్రాయాల్ని పంచుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే.. సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, కంబాల పరిరక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.


బెంగళూరులో జరుగుతున్న కంబాల ఆటల చివరి రోజు కార్యక్రమంలో ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. జల్లికట్టు, కంబాల వంటి సంప్రదాయ క్రీడలను ఆపేందుకు వివిధ ఎజెండాలతో కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కోర్టులకు వెళ్లడంతో పాటు మరెన్నో మార్గాల్లో ఈ క్రీడల్ని ఆపడానికి ట్రై చేస్తూనే ఉన్నారన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సంప్రదాయ క్రీడలు అవసరమని.. రాజకీయ విభేదాలకు అతీతంగా పార్టీలు ఎదగాలని కోరారు. జల్లికట్టు, కంబాల వంటి సంబరాలను పరిరక్షించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రీడలను కాపాడినప్పుడే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోగలమని ఆయన వెల్లడించారు.

అటు.. తన ఎక్స్ ఖాతాలోనూ తేజస్వి సూర్య ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మానవులు, జంతువుల మధ్య సమన్వయాన్ని చూడటం అద్భుతమైన అనుభవమని తన పోస్టులో రాసుకొచ్చారు. జల్లికట్టు, కంబాల వంటి క్రీడా కార్యక్రమాలు, పండుగలు.. మన సనాతన ధర్మం, సంస్కృతిలో భాగమని తెలిపారు. అవి యువతను ధైర్యంగా, శారీరకంగా దృఢంగా ఉండమని ప్రోత్సహించడమే కాకుండా.. మానవులు, అన్ని ఇతర జీవుల మధ్య బంధాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని చెప్పుకొచ్చారు. ఈ జంతువుల యజమానులు వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని, భవిష్యత్తులో బెంగళూరులో మరిన్ని కంబాల ఈవెంట్‌లని చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

Updated Date - 2023-11-26T21:30:31+05:30 IST