Share News

Chandrayaan 3: డేంజర్ జోన్‌లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్.. ల్యాండర్, రోవర్‌లకు వాటి నుంచి ముప్పు?

ABN , First Publish Date - 2023-10-20T15:57:14+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. 14 రోజుల పాటు చంద్రునిపై సమర్థవంతంగా ప్రయోగాలు..

Chandrayaan 3: డేంజర్ జోన్‌లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్.. ల్యాండర్, రోవర్‌లకు వాటి నుంచి ముప్పు?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. 14 రోజుల పాటు చంద్రునిపై సమర్థవంతంగా ప్రయోగాలు చేపట్టిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను ఇస్రో శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్‌లోకి పంపించారు. అయితే.. ఒక ‘లూనార్ డే’ (భూమిపై 14 రోజులతో సమానం) తర్వాత ఆ రెండింటినీ తిరిగి మేల్కొలిపేందుకు ఇస్రో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మేల్కోలేదు. ఇక తిరిగి మేల్కొంటాయని నమ్మకాలు కూడా లేకపోవడంతో.. ఇస్రో తన ప్రయత్నాలను విరమించుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు ఇస్త్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుని వెలుపల నుంచి దీనికి ప్రమాదం పొంచి ఉందని తెలిసింది.


ఆ ప్రమాదం ఏమిటి?

ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుని ఉపరితలంపై ‘మైక్రోమీటోరాయిడ్స్’ (సూక్ష్మ ఉల్కలు) తరచూ దాడి చేస్తుంటాయి. ఇప్పుడు అదే ప్రమాదం ల్యాండర్, రోవర్‌లకు పొంచి ఉందని ఇస్రో చెప్తోంది. ఈ సూక్ష్మ ఉల్కల దాడికి ఆ రెండూ దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలాంటి సమస్యనే అపోలో అంతరిక్ష నౌకతో పాటు ఇతర మిషన్లు కూడా ఎదుర్కున్నాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలకు ఈ ప్రమాదం గురించి తెలిసింది. అయితే.. శాస్త్రవేత్తలు ఇంతకుమించి మరే ఇతర వివరాలు వెల్లడించలేదు.

మరోవైపు.. మణిపాల్ సెంటర్ ఫర్ నేచురల్ సైన్సెస్ ప్రొఫెసర్, డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీకుమార్ చంద్రునిపై పరిస్థితుల గురించి మాట్లాడారు. చంద్రుని ఉపరితలంపై వాతావరణం లేదు కాబట్టి.. చంద్రయాన్-3కి చెందిన అంతరిక్ష నౌక తుప్పు పట్టే ప్రమాదం లేదన్నారు. ఏదిఏమైనా.. అక్కడ రాత్రి సమయం దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి, ఆ శీతల ఉష్ణోగ్రతలు ఈ ప్రాజెక్ట్ దెబ్బతినే ఛాన్స్ ఉందన్నారు. అలాగే.. సూక్ష్మ ఉల్కల దాడి కూడా తీవ్ర ప్రభావం చూపించవచ్చని పేర్కొన్నారు. సూర్యుడి నుండి నిరంతరం రేడియేషన్ బాంబులు విజృంభిస్తుంటాయని, ఇది కూడా కొంత నష్టం కలిగించవచ్చని చెప్పారు.

అయితే.. ఈ ప్రాజెక్ట్ నిద్రాణ స్థితిలో ఉండటం, దాని చుట్టూ ఇతర డేటా అందుబాటులో లేకపోవడంతో.. అక్కడ ఏం జరుగుతుందన్నది తమకు స్పష్టంగా తెలియడం లేదని తెలిపారు. చంద్రుని ధూళి కూడా ల్యాండర్, రోవర్ ఉపరితలంపైకి చేరుకుంటుందని.. ఈ ధూళి పదార్థాలు ఫెవికాల్ తరహాలో అతుక్కుంటున్నాయని చెప్పారు. అపోలో మిషన్ల సమయంలో ఇలా జరిగిందని, అందుకే దీనిపై అవగాహన ఉందన్నారు. అపోలో వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై వదిలివేసిన చంద్రుని రిఫ్లెక్టోమీటర్‌లను కప్పి ఉంచే ధూళి పొరలు కనిపించాయని పేర్కొన్నారు.


అసలు చంద్రయాన్-3 సాధించిన లక్ష్యాలేంటి?

ఆగస్టు 23వ తేదీన చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ చేసిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్.. దక్షిణ ధ్రువంపై 14 రోజుల పాటు అన్వేషణలు చేపట్టింది. ల్యాండర్, రోవర్‌లు అక్కడ సల్ఫర్ ఉనికిని ధృవీకరించడంతో పాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ వంటి ఇతర మూలకాలను కనుగొన్నాయి. అలాగే.. భూకంప కార్యకలాపాలను కూడా రోవర్ గుర్తించింది. ఈ మిషన్ ద్వారా సేకరించిన డేటా.. చంద్రునిపై మన అవగాహనను విస్తరించడంతో పాటు భవిష్యత్తులో చంద్ర, అంతర్ గ్రహ మిషన్లకు మార్గం సుగమం చేసింది.

Updated Date - 2023-10-20T15:57:14+05:30 IST