Chandrayaan-3 Super Success : మువ్వెన్నెల పతాకం
ABN , First Publish Date - 2023-08-24T03:40:15+05:30 IST
భూమిపై చంద్రోదయం అయ్యే వేళలో చంద్రుడిపై ఓ నవోదయం! భారత కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం నిలిచే మహాద్భుత ఘట్టం! మానవుడే మహనీయుడై గ్రహరాశులనధిగమించి.. మన ‘ప్రజ్ఞాన్’ పాటవాలను విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక సన్నివేశం!
చందమామ అందిన రోజు..
విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్
ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన రోవర్
14 రోజులపాటు జాబిల్లిపై పరిశోధన
జాబిల్లి ఫొటోలు పంపిన విక్రమ్
గంటల్లోనే తొలి చిత్రం విడుదల
సాకారమైన పాతికేళ్ల చంద్రయాన్ కల
అగ్ర రాజ్యాలను
తోసి రాజని అద్భుత విజయం
దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన
నాలుగో దేశంగా రికార్డు
దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు
దక్షిణాఫ్రికా నుంచి ప్రధాని సందేశం
ఇస్రోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
అంతరిక్ష మార్కెట్లో భారత్‌కు బూస్ట్
ఈసీఐఎల్ కీలక పాత్ర
32 మీటర్ల యాంటెన్నా తయారీ
భూమితో అనుసంధానానికి అవసరం
పేలోడ్స్ కోసం ఉండవల్లి యువకుడి సాఫ్ట్‌వేర్
భూమిపై చంద్రోదయం అయ్యే వేళలో చంద్రుడిపై ఓ నవోదయం!
భారత కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం నిలిచే మహాద్భుత ఘట్టం!
మానవుడే మహనీయుడై గ్రహరాశులనధిగమించి..
మన ‘ప్రజ్ఞాన్’ పాటవాలను విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక సన్నివేశం!
తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చన్న కవి వాక్కును నిజం చేస్తూ..
పట్టుదలతో చంద్రుడిలోని కుందేలునూ అందుకోవచ్చని నిరూపించిన విక్రమార్క విజయం!
ఔను.. మన శాస్త్రవేత్తలు సాధించారు! 40 రోజుల చంద్ర ‘మండల’ దీక్షతో..
దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలోని చందమామను ముద్దాడారు. అగ్ర రాజ్యాలు సహా ప్రపంచంలోని మరే దేశమూ ఇప్పటిదాకా సాధించని ఘనతను సాధించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు! అంతరిక్ష విజ్ఞానంలో అగ్ర రాజ్యాల సరసన నిలిచారు! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మునివేళ్లపై నిలబడి ఉత్సుకతతో టీవీ తెరలకు అతుక్కుపోయి చూస్తుండగా.. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగింది. ‘మామ’ ఫొటోలను మనకు పంపింది! ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ మరో 14 రోజులపాటు అక్కడ పరిశోధనలు చేయనుంది. ‘చందమామ రావె.. జాబిల్లి రావె..’ అంటూ పాట రూపంలో కలగనడం కాదు.. ‘వచ్చేశా.. మామా’ అంటూ చంద్రుడిపై మన వ్యోమగాములు కాలుమోపే రోజు ఇక ఎంతో దూరంలో లేనట్టే!!
జయహో భారత్.. జయ జయహో ఇస్రో శాస్త్రవేత్తలు!
ఇది నిరంతర ప్రస్థానం..
చంద్రయాన్-3 సక్సెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆయన ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. ఈ విజయంలో వందలమంది ఇంజనీర్లు, పదులకొద్దీ సంస్థల భాగస్వామ్యం ఉంది. ఇది ఇప్పుడు మొదలైన ప్రయాణం కాదు. తరతరాలుగా ఇస్రో శాస్త్రవేత్తలు వేసిన బాట ఇది! ఇప్పుడు ఒక పెద్ద ముందడుగు వేశాం. చంద్రయాన్-3 విజయవంతం సందర్భంగా చంద్రయాన్-1, 2లనూ మనం గుర్తుచేసుకోవాలి. చంద్రయాన్-3 విజయవంతం కావాలని ఆకాంక్షించి, ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు.
- సోమనాథ్, ఇస్రో చైర్మన్
విక్రమ్ ల్యాండర్ పంపిన మొట్టమొదటి చంద్రుడి ఫొటో