Chandrayaan-3: చంద్రయాన్-3 కథ ముగిసిందా? ల్యాండర్, రోవర్ చనిపోయాయా? ఆ సంకేతాలు ఏం చెప్తున్నాయి?
ABN , First Publish Date - 2023-09-25T14:54:38+05:30 IST
చంద్రునిపై సూర్యోదయం అయినప్పటి నుంచి.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కమ్యూనికేట్ అయ్యేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నిస్తోంది. నిద్రావస్థలో ఉన్న ఆ రెండింటిని తిరిగి మేల్కొలిపేందుకు..
చంద్రునిపై సూర్యోదయం అయినప్పటి నుంచి.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కమ్యూనికేట్ అయ్యేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నిస్తోంది. నిద్రావస్థలో ఉన్న ఆ రెండింటిని తిరిగి మేల్కొలిపేందుకు ట్రై చేస్తోంది. కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ రెండింటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. చంద్రుని దక్షిణ ధ్రువంలో ఉన్న ల్యాండర్, రోవర్‌లు.. నిద్రావస్థ నుంచి ఇంకా బయటకు రాలేదు. దీంతో.. అవి రెండు చనిపోయాయా? ఇక్కడితోనే ఈ ప్రాజెక్ట్ కథ ముగిసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. ఇస్రో మాత్రం తదుపరి చంద్ర సూర్యాస్తమయం వరకు ల్యాండర్, రోవర్‌లతో కాంటాక్ట్ అయ్యేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. శివశక్తి పాయింట్ వద్ద నిద్రావస్థలో ఉన్న ఆ రెండూ తిరిగి మేల్కొంటాయని శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం వాటితో తిరిగి కాంటాక్ట్ ఎప్పుడు ఏర్పడుతుందనేది అనిశ్చితంగానే ఉంది. ‘‘ల్యాండర్, రోవర్‌లతో కమ్యూనికేట్ అయ్యేందుకు మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాం. కానీ.. ఇప్పటికైతే ఎలాంటి కమ్యూనికేషన్ లేదు’’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. చంద్రునిపై రాత్రివేళ వాతావరణం చాలా చలిగా, ఎంతో కఠినంగా ఉంటుంది కాబట్టి.. ల్యాండర్, రోవర్‌ల పునరుద్ధరణ అవకాశాలు చాలా తక్కువేనని తెలుస్తోంది.
ఇంతకుముందు.. ల్యాండర్, రోవర్‌ల పునరుద్ధరణ ఆటోమెటిక్‌గా ఉంటుందని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ తెలిపారు. సెప్టెంబరు 22న చంద్రుడి ఉపరితలంపై సూర్యోదయం అయ్యాక.. సౌరశక్తితో నడిచే ల్యాండర్, రోవర్‌లు తిరిగి ఛార్జ్ అవుతాయని.. తద్వారా సిగ్నల్స్ వస్తాయని గతంలో ఆయన వివరించారు. కానీ.. ఆయన చెప్పినట్లు ఆ రెండింటి నుంచి ఎలాంటి సంకేతాలూ అందలేదు. అక్కడ చల్లని వాతావరణాన్ని అవి తట్టుకుంటే.. పునరుద్ధరణ అవకాశం 50-50 ఉంటుందని ఆయన అన్నారు. అయితే.. అవి తిరిగి మేల్కోకపోయినా ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని, ఆ రెండు ఇప్పటికే తమ లక్ష్యాలు సాధించాయని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా.. ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కుంటాయా? అనే విషయాన్ని పక్కనపెడితే.. చంద్రయాన్-3 మిషన్ ఇప్పటికే విజయవంతం అయ్యింది. శివశక్తి పాయింట్ నుంచి రోవర్ 100 మీటర్లకు పైగా ప్రయాణం చేసి.. చంద్రునిపై సల్ఫర్, ఇనుము, ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించింది. అక్కడి ఉష్ణోగ్రత వివరాలను కూడా భూమికి పంపింది. ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొంటే.. అవి అక్కడ పరిశోధనలు చేసి భూమికి పంపే సమాచారం ‘బోనస్’ అవుతుంది. ముఖ్యంగా.. అక్కడ హైడ్రోజన్ ఉందా? లేదా? అని కనుగొనడం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.