కోట్లాది భారతీయుల ‘మన్‌ కీ బాత్‌’తో జనంతో మమేకం

ABN , First Publish Date - 2023-05-01T03:18:50+05:30 IST

ప్రజలతో మమేకం కావడానికి ‘మన్‌ కీ బాత్‌’ తనకు ఉపకరించిందని ..

కోట్లాది భారతీయుల ‘మన్‌ కీ బాత్‌’తో జనంతో మమేకం

ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణం : మోదీ

వందో ప్రసంగం దేశవిదేశాల్లో ప్రసారం

ఐరాస హెడ్‌క్వార్టర్స్‌లో కూడా..

న్యూఢిల్లీ: ప్రజలతో మమేకం కావడానికి ‘మన్‌ కీ బాత్‌’ తనకు ఉపకరించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది తన ఆధ్యాత్మిక ప్రయాణమే కాదని..ఓ విశ్వాసం..పూజ..వ్రతమని పేర్కొన్నారు. జనంతో బంధం తెగకుండా చేసిందంటూ..దీన్ని కోట్లాది భారతీయుల హృదయ స్పందనగా అభివర్ణించారు.

2014 అక్టోబరు 3న ప్రారంభమైన ‘మన్‌ కీ బాత్‌’ ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ప్రసారమవుతోంది. ఈ ఆదివారం నాటికి వంద సంచికలు పూర్తయ్యాయి. ఈ ఎపిసోడ్‌ దేశంలోనేగాక అమెరికా, యూకే, చైనా, రష్యా సహా ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో కూడా దీనిని తిలకించారు..ఆలకించారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, బీజేపీ సీనియర్‌ నేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు 4 లక్షల వేదికలపై పలువురు ప్రముఖులు, ప్రజలతో కలిసి కూర్చుని ఆయన ప్రసంగాన్ని ఆలకించారు.

2014లో ప్రధానిగా ఢిల్లీకి వచ్చిన కొత్తలో మనసులో ఏదో శూన్యం ఉన్నట్లు అనిపించేదని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ‘మన్‌ కీ బాత్‌’ దాన్ని పోగొట్టిందని చెప్పారు. ‘భారత్‌, భారతీయుల సానుకూల దృక్పథాన్ని చాటే వేడుక ఈ కార్యక్రమం. వందో ఎపిసోడ్‌ కోసం దేశం నలుమూలలా శ్రోతల నుంచి వేల కొద్దీ లేఖలు అందాయి. వాటిని చదివాక నా మనసు భావో ద్వేగంతో నిండిపోయింది.

ప్రతి ఎపిసోడ్‌ దేనికదే ప్రత్యేకం. బేటీ పఢావో-బేటీ బచావో, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, ఖాదీపై ప్రేమ, ప్రకృతి సంబంధ సమస్యలు, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, అమృత్‌ సరోవర్‌.. ఇలా మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించిన అంశాలన్నీ ప్రజా ఉద్యమ రూపం సంతరించుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమం.. ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఉపకరించే ముఖ్య కార్యక్రమంగా మారింది. 2014 అక్టోబరు 3న విజయదశమి నాడు దేశ ప్రజల మంచితనం-సానుకూలత అనే ఈ పండుగ ప్రారంభమైంది. ఇతరులు, ప్రత్యర్థుల్లో ఉన్న మంచి లక్షణాలను పూజించాలని నా గురువు, గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ తొలి కార్యకర్తల్లో ఒకరైన లక్ష్మణ్‌రావు ఇనామ్‌దార్‌ ఎప్పుడూ చెబుతుండేవారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలను తరచూ కలిసి సంభాషించేవాడిని అని వివరించారు. ‘దేశ ప్రజలే నా సర్వస్వం. వారికి దూరమై బతకలేను.సామాన్యుడితో మమేకం కావాలన్న సవాల్‌కు ‘మన్‌ కీ బాత్‌’ పరిష్కారం చూపింది. ప్రజలు దేవుడిని పూజించడానికి వెళ్లి.. వచ్చేటప్పుడు ప్రసాదం వెంట తెచ్చుకుంటారు. ‘మన్‌ కీ బాత్‌’ కూడా దేవుడి పాదాల చెంత ప్రజల రూపంలో నాకిచ్చిన ప్రసాదంగానే భావిస్తున్నాను.

ఇందులో నేను ప్రస్తావించిన వారంతా హీరోలు’ అని మోదీ తెలిపారు. కాగా ‘మన్‌ కీ బాత్‌’ వందో ఎపిసోడ్‌ ప్రసారాన్ని ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రీ అజౌలే ప్రశంసించారు. కార్యక్రమం మధ్యలో ఆమె ప్రధానితో ఫోన్లో సంభాషించారు. ప్రతి నెలా చివరి ఆదివారం అరగంట నడిచే ‘మన్‌ కీ బాత్‌’..ఆకాశవాణికి చెందిన 500కిపైగా ప్రసార కేంద్రాల్లో..22 దేశీయ భాషలు, 29 మాండలికాల్లోగానేగాక..11 విదేశీ భాషలు.. ఫ్రెంచ్‌, చైనీస్‌, ఇండోనేసియన్‌, టిబెటన్‌, బర్మీస్‌, బలూచీ, అరబిక్‌, పస్తు, పర్షియన్‌,దారీ, స్వాహిలీల్లో కూడా ప్రసారమవుతోంది.

కీలక అంశాలపై మౌన్‌ కీ బాత్‌

మన్‌ కీ బాత్‌ వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. చైనా, అదానీ, రెజ్లర్ల ఆందోళనలు వంటి కీలక అంశాల్లో అది ‘మౌన్‌ కీ బాత్‌’లా మిగిలిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఎద్దేవా చేశారు. ‘ఈరోజు ఫేకు మాస్టర్‌ స్పెషల్‌. మన్‌కీ బాత్‌ వందో రోజంటూ హడావుడి చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిత్యావసర ధరల పెరుగుదల వంటి కీలకాంశాలపై మాత్రం ఇది మౌన సందేశమే’అని జైరామ్‌ ట్వీట్‌ చేశారు.

ఆ నలుగురూ సమాజోద్ధారకులు మన్‌కీ బాత్‌ వందో ఎపిసోడ్‌లో మోదీ ప్రశంసలు

ప్రధాని మోదీ ఆదివారం వందో మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో నలుగురి స్ఫూర్తిదాయక గాథలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని సమాజోద్ధారకులని ప్రశంసించారు. వారి వివరాలివీ..

విజయశాంతి దేవి:మణిపూర్‌కు చెందిన ఈ 30 ఏళ్ల మహిళ తామర నార ద్వారా దుస్తులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 30 మంది మహిళలకు ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఏడాది మరో 70 మందికి ఉపాధి కల్పించాలనేది ఆమె లక్ష్యం. త్వరలో తన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయనున్నట్టు విజయశాంతి దేవి తెలిపారు.

సునీల్‌ జగ్లాన్‌: ‘కుమార్తెతో సెల్ఫీ’ ఉద్యమం వెనుక ఉన్నది ఈయనే. 2015లో తన గ్రామం నుంచే ఆయన ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ కుమార్తెలతో తీసుకున్న సెల్ఫీలను షేర్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను సునీల్‌ ప్రారంభించారు.

ప్రదీప్‌ సంగ్వాన్‌: హిమాలయ పర్వతాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఈయన ‘హీలింగ్‌ హిమాలయాస్‌’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన బృందం హిమాలయాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో నిత్యం 5 టన్నుల చెత్తను సేకరిస్తోంది.

మంజూర్‌ అహ్మద్‌: ఈయన జమ్మూకశ్మీర్‌లో పెన్సిళ్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఈయన వల్లే పుల్వామా జిల్లాలోని ఊఖూ గ్రామాన్ని ఇప్పుడు ‘భారత పెన్సిళ్ల గ్రామం’ అని పిలుస్తున్నారు.

Updated Date - 2023-05-01T03:18:50+05:30 IST