Civils: సివిల్స్ పరీక్షలో మహిళ అభ్యర్థిత్వం రద్దు.. యూపీఎస్‌సీ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
ABN , First Publish Date - 2023-09-18T22:35:16+05:30 IST
సివిల్స్ పరీక్ష దరఖాస్తులో తప్పులు దొర్లిన ఘటనలో మహిళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్‌సీ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారం సమయర్థించింది.
ఇంటర్నెట్ డెస్క్: సివిల్స్ పరీక్ష దరఖాస్తులో తప్పులు దొర్లిన ఘటనలో మహిళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్‌సీ(UPSC) నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు(Delhi HC) సోమవారం సమర్థించింది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు యూపీఎస్సీ వారం రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది(UPSC woman disqualified from appearing in mains).
ఇటీవల సివిల్స్‌లో ఉత్తీర్ణురాలైన ఓ మహిళ తన దరఖాస్తు ఫారాన్ని నింపడంలో పొరపాటు చేసింది. తన ఫొటోకు బదులుగా తన అన్న ఫొటో, సంతకం అప్‌లోడ్ చేసింది. చివరకు ఆమెపై అనర్హత వేటు పడింది.
ఈ నేపథ్యంలో ఆమె సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. తన అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. కానీ క్యాట్ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. తనపై అనర్హత వేటు పడిన 15 రోజుల తరువాత ఆలస్యంగా క్యాట్‌ను ఆశ్రయించిన ఆమె అక్కడ కూడా తిరస్కరణ ఎదురుకోవడంతో చివరకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా ఆమెకు చుక్కెదురైంది.
మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు.. మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర్లో ఉందని తెలిసీ 15 రోజుల తరువాత క్యాట్‌ను ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించింది. మహిళ పిటిషన్‌ను అంగీకరిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్టేనని వ్యాఖ్యానించింది. యూపీఎస్సీ నిబంధనలకు చట్టంతో సమానమైన స్థాయి ఉన్న విషయాన్ని పేర్కొంది. పరీక్షల నిబంధనల ప్రకారం, తప్పుడు ఫొటో లేదా సంతకం అప్‌లోడ్ చేసే విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు అనర్హులవుతారు.