Share News

Dimple Yadav: అందులో తప్పేముంది.. నితీశ్ కుమార్ వ్యాఖ్యల్ని సమర్థించిన డింపుల్ యాదవ్

ABN , First Publish Date - 2023-11-09T22:29:05+05:30 IST

Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనాభా నియంత్రణ’ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. చదువుకున్న మహిళలకు గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Dimple Yadav: అందులో తప్పేముంది.. నితీశ్ కుమార్ వ్యాఖ్యల్ని సమర్థించిన డింపుల్ యాదవ్

బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనాభా నియంత్రణ’ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. చదువుకున్న మహిళలకు గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళా సంఘాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం తీవ్రంగా మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శలొచ్చాయి. కానీ.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ మాత్రం నితీశ్ వ్యాఖ్యల్ని సమర్థించారు. అందులో తప్పేముందంటూ ఆయనకు తన మద్దతు తెలిపారు.

గురువారం ఝాన్సీలో విలేకరుల సమావేశంలో డింపుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘నితీష్ కుమార్ ప్రకటనలో తప్పు లేదు. ఆయన సెక్స్ ఎడ్యుకేషన్‌పై మాట్లాడారు. సాధారణంగా ప్రజలు దీనిపై బహిరంగంగా మాట్లాడరు. నితీష్ కుమార్ తనదైన శైలిలో మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే.. మా పార్టీ (సమాజ్‌వాదీ పార్టీ) మద్దతు తప్పకుండా ఉంటుంది’’ అని అన్నారు. బహుశా నితీశ్ కుమార్ చెప్పిన విధానం తప్పై ఉండొచ్చేమో గానీ.. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో జనాభా పెరుగుతున్నందున సెక్స్ ఎడ్యుకేషన్‌పై బహిరంగ చర్చ జరగాలన్నారు. నితీశ్ కుమార్‌కు తన పూర్తి మద్దతు ఉందని తేల్చి చెప్పారు.


నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలేంటి?

బిహార్ అసెంబ్లీలో మంగళవారం సీఎం నితీశ్ కుమార్ జనాభా నియంత్రణపై మాట్లాడారు. ఆడపిల్లలు చదువుకుంటేనే జనాభా నియంత్రణలోకి వస్తుందన్నారు. అయితే.. దీనిని మహిళలు మనోభావాలు దెబ్బతీసేలా ఆయన అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు చదువుకున్న వారైతే గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందన్నారు. చదువుకున్న మహిళలకు తమ భర్తల్ని ఎలా నియంత్రించాలో తెలుసని పేర్కొన్నారు. దీంతో.. ఆయనపై ఎదురుదాడి ప్రారంభమైంది. ఆయన మానసిక స్థితి బాగోలేదంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు చేసింది. నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు కూడా వచ్చాయి. తనపై వస్తున్న ఈ వ్యతిరేకత చూసి.. ఆయన క్షమాపణలు చెప్పారు.

Updated Date - 2023-11-09T22:29:06+05:30 IST