Earthquake: అసోంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ABN , First Publish Date - 2023-02-12T19:04:23+05:30 IST
అసోంలోని నాగావ్(Nagaon)లో ఆదివారం సాయంత్రం 4.18 గంటల సమయం
నాగావ్: అసోంలోని నాగావ్(Nagaon)లో ఆదివారం సాయంత్రం 4.18 గంటల సమయంలో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప నమోదు కేంద్రం ట్విట్టర్ ద్వారా తెలిపింది. భూ ప్రకంపనల వార్తలతో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు.
గుజరాత్(Gujarat)లోని సూరత్(Surat)లో శనివారం 3.8 తీవ్రతతో ప్రకంపనలు కనిపించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.52 గంటల సమయంలో ప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. భూమికి 5.2 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
కాగా, ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. గతవారం తుర్కియే(Turkey), సిరియా(Syria)లలో సంభవించిన భారీ భూకంపం వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది. ఇళ్లు, భవనాలు కూలిపోయి నగరాలు, పట్టణాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ ప్రళయంలో ఇప్పటి వరకు 26 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు ఇప్పటికీ బయటపడుతున్నారు. వారిని సురక్షితంగా బయటికి తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు.