India Economic Depression : ఆశల పల్లకిలో వేతన జీవులు
ABN , First Publish Date - 2023-01-23T03:08:45+05:30 IST
వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు! మోదీ సర్కారుకు ఈ విడతలో ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్! అంటే, సంక్షేమ మంత్రం జపించాలి! ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి! కానీ, అందుకు సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు! ఓవైపు, ఆర్థిక మాంద్యం భయాలు తరుముకొస్తున్నాయి! అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం
కత్తి మీద సాము కేంద్ర బడ్జెట్!.. నీడలా మాంద్యం ముప్పు
ఆశల పల్లకిలో వేతన జీవులు
నిధుల సమీకరణే పెద్ద సమస్య
తాయిలాలిస్తే ఆర్థిక ఇబ్బందులు
కఠినమైతే ఎన్నికలపై ప్రతికూలత
ఇప్పటికే పాక్, లంకలో మాంద్యం
రియల్టీ, వాహన రంగాలను కేంద్రమంత్రి నిర్మల కరుణిస్తారా?
స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఈల్లో ఉత్కంఠ
ఎన్నికల సంవత్సరం కావడంపైనే అన్నివర్గాల వారి ఆశలు
వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు! మోదీ సర్కారుకు ఈ విడతలో ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్! అంటే, సంక్షేమ మంత్రం జపించాలి! ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి! కానీ, అందుకు సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు! ఓవైపు, ఆర్థిక మాంద్యం భయాలు తరుముకొస్తున్నాయి! అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి! ఇప్పటికే పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఈ తరుణంలో సంక్షేమ మంత్రం జపిస్తే ద్రవ్యలోటు అదుపు తప్పి.. భారత్ కూడా అదే పరిస్థితికి చేరుకునే ప్రమాదముందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి! అదే సమయంలో.. వేతన జీవులతోపాటు వివిధ వర్గాలు మోదీ సర్కారు చివరి బడ్జెట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నాయి. ఈసారైనా తమను కరుణిస్తారని, వరాల జల్లులు కురిపిస్తారని ఆశల పల్లకిలో ఊరేగుతున్నాయి! ఇటు.. ఎన్నికల ఏడాదిలో ప్రజాకాంక్షలను గుర్తించి, రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం! సంక్షేమ మంత్రం జపించడం! ఇదే చేస్తే.. ఇప్పటి వరకూ మన దరికి రాని ఆర్థిక భూతం ఉరిమిచూస్తుందనే ఆందోళన! ఆర్థిక వ్యవస్థ పట్టుతప్పుతుంది! అప్పుడు ఎన్నికల, రాజకీయ ప్రయోజనాలకూ విఘాతమే! ‘ఉచితాలు అనుచితం’ అంటూ పదేపదే చెబుతున్న కేంద్రం.. ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచాలన్న ఉద్దేశంతో కఠిన చర్యలకు దిగితే.. ఎన్నికల ఏడాదిలో ఓట్లపై ప్రభావం పడే సూచనలు! మొదటికే మోసం వచ్చినా రావచ్చు! ఈ నేపథ్యంలో, ఇటు జనాలను మెప్పిస్తూ.. అటు ఆర్థిక వ్యవస్థను అదుపులో పెడుతూ బడ్జెట్‌ను రూపొందించడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కత్తి మీద సామే..! ఆవకాయలో ఉప్పు తక్కువైతే నిల్వ ఉండదు! పాడైపోతుంది! అదే ఎక్కువైతే అసలు ఆవకాయను తినలేం! తగినంత ఉంటేనే జిహ్వ ‘జివ్..’మంటుంది! బడ్జెట్‌లో సంక్షేమమూ అంతే! తక్కువైతే ఓట్లకు దెబ్బ! ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థకు ముప్పు! ఈ నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ ఆవకాయను నిర్మల ఎలా కలుపుతారు!? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న!!
ఆదాయ పన్ను
బడ్జెట్ వస్తుందంటే మధ్య తరగతి.. ముఖ్యంగా వేతన జీవుల ఆశలన్నీ ఆదాయపన్ను (ఐటీ) మినహాయింపు మరింత పెరుగుతుందా? పన్నుపోటు తగ్గుతుందా? లేదా? అనే చూస్తారు. ఈ సారి బడ్జెట్‌పైనా వీరివి అవే ఆశలు..! ధరల సెగతో ‘నిజ’ ఆదాయాలు గత ఏడాది కాలంలో బాగా తగ్గిపోయాయి. వచ్చేది ఎన్నికల సీజన్. కాబట్టి, వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఆర్థిక మంత్రి ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. నిజానికి ఆదాయపన్ను కొత్త విధానంలో రూ. 5 లక్షల దాకా ఎలాంటి పన్ను లేదు. అదే పద్ధతిని ఆదాయపన్ను పాత విధానానికీ అమలు చేయాలని అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాదిరిగా వెసులుబాట్లు కల్పించాలని కోరుతున్నారు. ఆ బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు ఆదాయపన్ను మినహాయింపు స్లాబ్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. అందుబాటు ధరల్లో (రూ.45 లక్షల్లోపు) ఇళ్లను కొనేవారికి 80ఈఈఏ కింద కలిగే పన్ను ప్రయోజనాలను రూ.1.5లక్షలుగా ప్రకటించారు. 80సీ కింద ఉన్న పన్ను ప్రయోజనాలను రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసేవారికి ఆదాయపన్నులో వెసులుబాట్లు కల్పించారు. సెక్షన్ 80సీ కింద పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం రూ.1.5 లక్షలుగా ఉంది. దాన్ని కనీసం రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. కొవిడ్ తర్వాత వైద్య ఖర్చులు, ధరలు, రవాణా చార్జీలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)పై రూ.24 వేల దాకా మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. దాన్ని 2016 బడ్జెట్‌లో రూ.60 వేలకు పెంచారు. నగరాలు, పట్టణాలు, చివరకు మెట్రోపాలిటన్ సిటీల శివార్లలో ఉన్న గ్రామాల్లోనూ ఇంటి అద్దెలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో.. హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును రూ.లక్షకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి.
వాహన రంగం
ప్రపంచంలో ఎక్కడా లేనంత పన్నుల భారం తాము మోస్తున్నట్టు దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ గగ్గోలు పెడుతోంది. జీఎ్‌సటీ, ప్రత్యేక సెస్సులను కూడా కలుపుకొంటే వాహనం వేరియంట్ బట్టి 48 నుంచి 60ు వరకు పన్నుల భారం పడుతోంది. కనీసం ఈ బడ్జెట్‌లో అయినా ఆర్థిక మంత్రి తమ గోడు వినాలని పరిశ్రమ వర్గాలు ఇప్పటికే విన్నవించాయి. వచ్చేదంతా విద్యుత్తు వాహనాల(ఈవీ) కాలం..! ఇప్పుడు ఈ వాహనాలపై ఉన్న 5ు జీఎ్‌సటీని రద్దుచేసి, మరింత సహకరించాలని కోరుతున్నాయి.
ఎంఎస్‌ఎంఈల గోడు
దేశ పారిశ్రామిక రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎ్‌సఎంఈ) కంపెనీలదే హవా..! ఎగుమతులు, ఉపాధి రంగంలోనూ ఈ కంపెనీలదే పెద్ద వాటా. అయితే బ్యాంక్ రుణాలకు వచ్చేసరికి ఈ కంపెనీలకు నిరాశే ఎదురవుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెట్టే షరతులు తట్టుకోలేక ఆస్తులు తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. పెద్ద కంపెనీల్లా తమకూ క్రెడిట్ రేటింగ్ ఇచ్చి, దాని ఆధారంగా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేలా ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
రియల్టీ రంగం
కొవిడ్ ప్రభావం నుంచి రియల్టీ రంగం పూర్తిగా కోలుకుంది. అమ్మకాలూ పదేళ్ల రికార్డు స్థాయికి చేరాయి. అయితే ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య ప్రజలు సొంతిల్లు కొనే స్థితిలో లేరు. అసలు చెల్లింపుల పద్దు కింద ఇస్తున్న రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు ఏ మాత్రం చాలడం లేదు. కనీసం వచ్చే బడ్జెట్‌లో అయినా దీన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. పీఎంఏవై కింద కేంద్రం ఇస్తున్న వాటాను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా రియల్టీ రంగాన్ని పరిశ్రమగా గుర్తించడంతో పాటు అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
స్టాక్ మార్కెట్
గతంలో రిటైల్ మదుపరులకు బ్యాంక్ డిపాజిట్లు, రియల్టీ పెట్టుబడులు లేదా నగానట్రా కొనడమే తెలుసు. కొవిడ్ సమయం నుంచి రిటైల్ మదుపరులు స్టాక్ మార్కెట్లోకి పెద్దఎత్తున ప్రవేశించారు. గత ఏడాది విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు(ఎ్‌ఫపీఐ) పొలోమంటూ అమ్మకాలకు దిగినా, వీరి పెట్టుబడులే మన మార్కెట్లు కుప్పకూలకుండా నిలబెట్టగలిగాయి. అయితే లిస్టెడ్ కంపెనీల షేర్ల అమ్మకంపై ఏటా రూ.లక్ష కంటే ఎక్కువగా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10ు పన్ను విధించడాన్ని వీరు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ పన్ను పోటుని పూర్తిగా ఎత్తివేయాలని కోరుతున్నారు. లేదంటే మినహాయింపు పరిమితిని కనీసం రూ.5 లక్షలకు పెంచాలంటున్నారు. దీనికి తోడు తమ వరకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్(ఎ్‌సటీటీ)ను కూడా ఎత్తివేయాలని రిటైల్ మదుపరులు కోరుతున్నారు.
మరిన్ని రంగాలకు పీఎల్‌ఐ
కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయ వాణిజ్య స్వరూపం మారిపోయింది. నిన్నమొన్నటి వరకు అమెరికా, ఐరోపా, జపాన్ కంపెనీలు భారీ పెట్టుబడులతో చైనాలో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. చైనానే నమ్ముకంటే అక్కడేమి జరిగినా ‘సరఫరా’ సమస్యలు తప్పవనే నిర్ణయానికి వచ్చాయి. దీన్నుంచి తప్పించుకునేందుకు భారత్‌వైపు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ప్రభుత్వం మరిన్ని రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకాన్ని విస్తరించాలని సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థలు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశాయి.
స్టార్ట్‌పలు
మన దేశంలోనూ వ్యాపారాల స్వరూపాలు మారిపోతున్నాయి. అనేక మంది ఔత్సాహికులు వినూత్న ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలతో ముందుకొస్తున్నారు. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిన్న మొన్నటి వరకు ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థలు ఎగబడేవి. గత ఏడాది నుంచి ట్రెండ్ మారింది. లాభాల్లో ఉన్న స్టార్ట ప్స్‌లో తప్ప.. నష్టాల్లో ఉన్న వాటిలో విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మంచి వ్యాపార ఆలోచనలతో ప్రారంభ దశలో ఉన్న స్టార్ట్‌ప్సకు ప్రభుత్వం ప్రత్యేక నిధి లేదా బ్యాంకుల ద్వారా నిధులు సమకూర్చాలని స్టార్టప్‌లు కోరుతున్నాయి.
గడిచిన పదేళ్లలో తాయిలాలు-వడ్డింపులు ఇలా
2013: అప్పటి వరకు ఏటా రూ. 2 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఉండేది. ఆ స్లాబ్‌ను రూ. 2.5 లక్షలకు పెంచారు.
2015: 80సీసీడీలో అదనపు వెసులుబాట్లు కల్పిస్తూ 80సీసీడీ(1బీ)ని పరిచయం చేశారు. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాల కోసం అధిక సేవింగ్స్‌కు అవకాశం ఏర్పడింది. దీని ప్రకారం జాతీయ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎ్‌స)లో పన్ను మినహాయింపుతో రూ. 50 వేల దాకా దాచుకోవచ్చు. 80సీ కింద రూ. 1.5 లక్షల మినహాయింపునకు 80సీసీడీ(1బీ) అదనం.
2016: రూ. 24 వేలుగా ఉన్న ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ)ను రూ. 60 వేలకు పెంచారు.
2017: ఆదాయపన్ను రేటును తగ్గించారు. రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య వార్షికాదాయం ఉన్నవారికి విధించే 10ు పన్నును 5 శాతానికి కుదించారు. దీనివల్ల వేతన జీవులపై గరిష్ఠంగా రూ. 12,500 దాకా భారం తగ్గింది. అదే సమయంలో.. 80సీసీజీ కింద రూ. 50 వేల దాకా మినహాయింపు ఉండే రాజీవ్‌గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్(ఆర్‌జీఈఎ్‌సఎ్‌స)ను రద్దు చేశారు.
2018: స్టాండర్డ్ డిడక్షన్‌ను పరిచయం చేశారు. సీనియర్ సిటిజన్ల బ్యాంకు సేవింగ్స్‌పై రూ. 50 వేల దాకా వడ్డీని పన్ను మినహాయింపు పరిధిలోకి తెచ్చారు.
2019 (ఎన్నికల సంవత్సరం): సీనియర్ సిటిజన్ల వయసును 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పెంచి, ఆదాయపన్ను మినహాయింపు స్లాబ్‌ను రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. 80ఈఈఏ కింద రూ.1.5లక్షలు, 80సీ కింద ఉన్న పన్ను ప్రయోజనాలను రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు.
2020: స్టాక్‌మార్కెట్ డివిడెంట్స్‌ను ఆదాయంగా పరిగణనలోకి తీసుకుని, దానిపై పన్ను విధింపు ప్రారంభమైంది.
2021: ఏటా రూ. 2.5 లక్షలను మించే ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్) కాంట్రిబ్యూషన్‌ను ఆదాయంగా పరిగణించి, పన్ను విధించడం ప్రారంభించారు.