G20 Summit : తరలిరానున్న దేశాధినేతలు
ABN , First Publish Date - 2023-09-06T04:29:00+05:30 IST
భారతదేశం అధ్యక్షతన ఈనెల 8 నుంచి ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు వివిధ దేశాధినేతలు హాజరుకానుండగా, తాము రావడం లేదని కొందరు సందేశాలు పంపారు. ఆహార భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, వాతావరణ మార్పులు తదితర కీలకమైన ప్రపంచవ్యాప్త సమస్యలపై
జీ20 సదస్సుకు బైడెన్, అల్బనీస్, ట్రూడో, ఒలాఫ్
సునాక్‌కు భారత్‌లో ఇదే తొలి అధికారిక పర్యటన
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కొవిడ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: భారతదేశం అధ్యక్షతన ఈనెల 8 నుంచి ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు వివిధ దేశాధినేతలు హాజరుకానుండగా, తాము రావడం లేదని కొందరు సందేశాలు పంపారు. ఆహార భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, వాతావరణ మార్పులు తదితర కీలకమైన ప్రపంచవ్యాప్త సమస్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. వీరిలో పలువురు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు.
సదస్సుకు వచ్చేది వీరే..
అమరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈనెల 7నే అమెరికా నుంచి బయలుదేరనున్నారు. సదస్సుకు ముందు ప్రధాని మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వైట్‌హౌస్ ప్రకటించింది. 9, 10 తేదీల్లో ఆయన సదస్సులో పాల్గొంటారని తెలిపింది. కాగా, ప్రయాణానికి ముందు నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో జో బైడెన్‌కు నెగెటివ్ రాగా, ఆయన భార్య జిల్ బైడెన్‌కు పాజిటివ్ వచ్చింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా సదస్సుకు హాజరుకానున్నారు. భారత సంతతికి చెందిన ఆయన బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో చేపట్టనున్న తొలి అధికారిక పర్యటన ఇది. ఆస్ర్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని ట్రూడో ఇండోనేసియాలో జరగనున్న ఆసియాన్ సదస్సులో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా భారత్‌కు చేరుకొని, జీ20 సదస్సులో పాల్గొంటారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యెవో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా జీ20 సదస్సుకు హాజరుకానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి సదస్సులో జరిపే చర్చను కిషిద ప్రారంభించే అవకాశం ఉంది. మేక్రాన్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపే అవకాశం ఉంది. దక్షిణాఫ్రియా అధ్యక్షుడు సిరిల్ రమఫొస జీ20 గ్రూప్‌లో భారత అధ్యక్షతకు పూర్తి మద్దతు ప్రకటించారు. వీరితో పాటు పలు దేశాల అఽధినేతలు సదస్సులో పాల్గొంటారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశ ఆహ్వానం మేరకు పరిశీలకుల హోదాలో సదస్సులో పాల్గొంటారు.
వీరు రావట్లేదు..
ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీ చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. ఆయన స్థానంలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను జీ20 సదస్సుకు పంపుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా సదస్సుకు హాజరుకావడం లేదు. చైనా నుంచి ఈ సదస్సుకు హాజరయ్యే బృందానికి ప్రధాని లీ ఖియాంగ్ నేతృత్వం వహిస్తారని చైనా ప్రకటించింది. 2008 సంవత్సరం నుంచి జీ20 సదస్సులు నిర్వహిస్తుండగా, చైనా అధ్యక్షుడు గైర్హాజరవడం ఇదే తొలిసారి.
వీరి రాక ఇంకా నిర్ధారణ కాలేదు..
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల వాన్ డెర్ లియెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ సదస్సుకు హాజరయ్యేదీ లేనిదీ ఇంకా నిర్ధారించలేదు. మెక్సికో అధ్యక్షుడు మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ ఈ ఏడాది జీ20 సదస్సుకు హాజరుకాకపోవచ్చని భావిస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మలోనీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో కూడా జీ20 సదస్సుకు హాజరయ్యే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు.