Layoffs at Google : భారత్‌లోనూ గూగుల్‌ కోత మొదలు

ABN , First Publish Date - 2023-02-18T00:52:04+05:30 IST

టెక్‌ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 ఉద్యోగులను

Layoffs at Google : భారత్‌లోనూ గూగుల్‌ కోత మొదలు

453 మందిని ఇంటికి పంపుతూ ఈమెయిల్స్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 ఉద్యోగులను గూగుల్‌ ఇంటికి సాగనంపినట్టు తెలిసింది. గురువారం అర్ధరాత్రి ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా తొలగింపు సమాచారం అందినట్టు తెలిసింది. గూగుల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా.. ఉద్యోగులకు మెయిల్‌ పంపారని ‘హిందూ బిజినెస్‌ లైన్‌’ తన కథనంలో పేర్కొంది. మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గత నెలలో ప్రకటించింది. అయితే.. ఈ భారీ లేఫ్‌ ప్రక్రియలో భాగంగానే భారత్‌లోనూ 453 మందిని తొలగించారా లేదంటే 12 వేలకు ఇది అదనమా..? అనేది తెలియాల్సి ఉంది. గూగుల్‌ తొలగించిన వారిలో కొందరు.. తాము తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొంటూ లింక్డ్‌ఇన్‌ వేదికగా పోస్టులు పెట్టారు. గురువారం రాత్రి కంపెనీ నుంచి ఈమెయిల్స్‌ అందినట్టు పేర్కొన్నారు.

భారత్‌లో రెండు ట్విటర్‌ ఆఫీసులు మూత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ చేతికి వచ్చినప్పటి నుంచి ట్విటర్‌ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ఇప్పటికే వేలమంది ఉద్యోగులను తొలగించి, అనేక సంస్కరణలు చేపట్టిన ఆ సంస్థ తాజాగా, భారత్‌లో ఉన్న తన మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేసింది. న్యూఢిల్లీ, ముంబైలోని కార్యాలయాలను ట్విటర్‌ మూసివేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు కార్యాలయాల్లోని సిబ్బందిని ఇంటి నుంచే పని చేయమని కోరినట్టు పేర్కొన్నాయి. కాగా, ఎక్కువ మంది ఇంజనీర్లు పనిచేస్తున్న బెంగళూరు కార్యాలయాన్ని మాత్రం కొనసాగించనున్నట్టు తెలిపాయి. ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ సంస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య ప్రకటనలు భారీగా తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సిబ్బందిని తొలగిస్తోంది. అనేక కార్యాలయాలను మూసివేసింది. అందులో భాగంగానే గతేడాది నవంబరులో భారత్‌లో ఉన్న సిబ్బందిలో దాదాపు 90 శాతం మందిని తొలగించిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఈ సంస్థకు సుమారు 200 మందికిపైగా ఉద్యోగులు ఉండేవారు.

Updated Date - 2023-02-18T00:52:22+05:30 IST