Himanta Biswa Sarma: ఇరకాటంలో పడేసిన వివాదాస్పద పోస్టు.. సారీ చెప్పిన సీఎం హిమంత
ABN , Publish Date - Dec 29 , 2023 | 06:06 PM
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ద్వారా జరిగిన ఒక పొరపాటు ఆయన్ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించే స్థాయిలో పెద్ద దుమారానికే తెరలేపింది. దీంతో.. హిమంత తన తప్పుని సరిదిద్దుకొని, క్షమాపణలు చెప్పాల్సి...
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ద్వారా జరిగిన ఒక పొరపాటు ఆయన్ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించే స్థాయిలో పెద్ద దుమారానికే తెరలేపింది. దీంతో.. హిమంత తన తప్పుని సరిదిద్దుకొని, క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తన దినచర్యలో భాగంగా హిమంత ప్రతిరోజు తన అధికారిక ఎక్స్ ఖాతాలో భగవద్గీత శ్లోకాలను పోస్టు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా ఒక శ్లోకాన్ని షేక్ చేశారు. ‘‘గీత ప్రకారం.. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడం శూద్రుల విధి’’ అని ఆయన ట్వీటారు.
నిజానికి.. హిమంత షేర్ చేసిన ఈ శ్లోకం ఎక్స్ ఖాతాలో తప్పుగా అనువించబడింది. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ప్రతిపక్షాలు వెంటనే విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఏఐఎంఐఎం అధినేత సైతం ఈ పోస్టుపై తారాస్థాయిలో మండిపడ్డారు. ఇది హిందుత్వ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. అంతేకాదు.. ప్రతి భారతీయుడిని సమానంగా చూస్తాననే ప్రమాణానికి వ్యతిరేకంగా ఆయన పోస్టు ఉందని ఇతర విపక్ష నేతలు సైతం ఈ పోస్టుపై తూర్పారపట్టారు. ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో.. హిమంత వెంటనే తన తప్పుని సరిదిద్దుకున్నారు. ఆ పోస్టును తన ఎక్స్ ఖాతా నుంచి తొలగించేశారు. అనంతరం తాను చేసిన ఈ తప్పుకి గాను క్షమాపణలు ఆయన చెప్పారు.
‘‘నా దినచర్యలో భాగంగా నా సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రతిరోజూ ఒక భగవద్గీత శ్లోకాన్ని షేర్ చేస్తుంటాను. ఇప్పటివరకు 668 శ్లోకాలను పోస్టు చేశాను. అయితే.. ఇటీవల నా టీమ్‌లోని సభ్యుడు ఒక శ్లోకాన్ని తప్పుగా అనువదించారు. ఆ పొరపాటును గుర్తించిన వెంటనే నేను ఆ పోస్టును తొలగించాను. దీనివల్ల ఎవరైనా బాధపడితే మన్నించండి’’ అని తన ఎక్స్ ఖాతాలో హిమంత రాసుకొచ్చారు. అలాగే.. తనపై వచ్చిన విమర్శలపై కూడా ఆయన స్పందించారు. తాము అన్ని కులాలను సమానంగా చూస్తానని.. అస్సాం రాష్ట్రం కులరహిత సమాజాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. సదరు అనువాదం తమ పొరపాటేనని హిమంత అంగీకరించారు.