Israel-Hamas War: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి తీర్మానం.. ఓటింగ్‌కు భారత్ దూరం.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-10-28T17:01:33+05:30 IST
హమాస్ చేసిన మెరుపుదాడుల కారణంగా ఇజ్రాయెల్ ప్రతీకార చర్యకు దిగింది. హమాస్‌ని అంతమొందించడమే లక్ష్యంగా.. గాజా స్ట్రిప్‌లో బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాలో ఎన్నో ఆంక్షలు విధించడంతో పాటు..
హమాస్ చేసిన మెరుపుదాడుల కారణంగా ఇజ్రాయెల్ ప్రతీకార చర్యకు దిగింది. హమాస్‌ని అంతమొందించడమే లక్ష్యంగా.. గాజా స్ట్రిప్‌లో బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాలో ఎన్నో ఆంక్షలు విధించడంతో పాటు.. రకరకాల ఆపరేషన్స్ చేపడుతోంది. దీంతో.. గాజా మొత్తం శవాలదిబ్బగా మారుతోంది. వేలాది సంఖ్యలో పౌరులు మరణించారు. చాలామంది తీవ్ర గాయాలపాలవ్వడంతో, నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలోనే.. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ బలగాలు జరుపుతున్న భీకర దాడుల్ని తాత్కాలికంగా ఆపాలని (సీజ్‌ఫైర్) ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రత్యేక సెషన్‌లో భాగంగా శుక్రవారం దీనిపై ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్‌కి మన భారతదేశం దూరంగా ఉంది.
అయితే ఈ ప్రతిపాదనకు మూడింట రెండు వంతుల మెజారిటీ రావడంతో ఇది ఆమోదం పొందింది. ఈ ప్రతిపాదనలో భాగంగా.. ఇజ్రాయెల్ సైనిక దళాలు, గాజాలో హమాస్ తీవ్రవాదుల మధ్య కొనసాగుతున్న సంఘర్షణను తాత్కలికంగా ముగించాలి. అలాగే సాధారణ ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా రక్షణ కల్పించాలి. వారికి మానవతా సహాయాన్ని అందించాలి. జోర్డాన్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో పాటు 40కి పైగా దేశాలు మద్దతు ఇచ్చాయి. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 120 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 14 ఓట్లు పడ్డాయి. ఈ ఓటింగ్‌కి మొత్తం 45 మంది గైర్హాజరు అవ్వగా.. అందులో మన భారతదేశం కూడా ఉంది.
ఈ ప్రతిపాదనలో హమాస్ దాడి గురించి ప్రస్తావించకపోవడం వల్లే భారత్ దూరం పాటించింది. ‘‘పౌరులను రక్షించడం, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ అనే ఈ తీర్మానంలో.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అందుకే.. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదని తెలిసింది. కాగా.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి తొలిసారి స్పందించిన అధికారిక స్పందన ఇది. ఈ ప్రతిపాదన చట్టబద్ధంగా కట్టుబడి ఉండదు కానీ.. మెజారిటీ UN సభ్య దేశాల అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది.
ఇదే సమయంలో.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్ని ఉగ్రవాద దాడిగా అభివర్ణించిన కెనడా ప్రతిపాదనని భారత్ సమర్థించింది. హమాస్ దాడుల్ని ముక్తకంఠంతో ఖండించాల్సిందేనని, ఏమాత్రం అంగీకరించదగినది కాదని ఆ ప్రతిపాదనలో కెనడా తెలిపింది. ఇందుకు భారత్ కూడా మద్దతు తెలిపింది. అంతేకాదు.. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ప్రజలను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే.. భారత్‌తోపాటు పలు దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చినా, తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఆమోదం పొందలేకపోయింది.