India: ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానానికి భారత్ ఓటు
ABN , First Publish Date - 2023-11-12T15:47:26+05:30 IST
పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ కు వ్యతిరేకంగా ఐక్యారాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. అమెరికా, కెనడా సహా 8 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
న్యూఢిల్లీ: పాలస్తీనా (Palestine) భూభాగంలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ (Israeli Settlements)కు వ్యతిరేకంగా ఐక్యారాజ్య సమితి (United Nations)లో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ (India) ఓటు వేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగం ఈస్ట్ జెరూసలేం, ఆక్రమిత సిరియన్ గోలాన్ హైట్స్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. అమెరికా, కెనడా సహా ఏడు దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. 18 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలంటూ ఇటీవల జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైన నేపథ్యంలో పాలస్తీనాలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ అనాగరిక చర్యల ప్రస్తావన లేకపోవడంతో భారత్ అప్పట్లో వ్యతిరేకించింది. భారత్ సహా 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. పాలస్తీనా సౌర్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఇదే సమయంలో అంతర్జాతీయ చట్టాలను అనుసరించి తీవ్రవాదంపై పోరాటం చేయాలని భారత్ పదేపదే చెబుతోంది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.