ISRO Chairman Somanath: ఆ సత్తా భారత్‌కి ఉంది కానీ.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-27T18:52:25+05:30 IST
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అవ్వడంతో.. ఆ ఉత్సాహంలో ఇస్రో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం..
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అవ్వడంతో.. ఆ ఉత్సాహంలో ఇస్రో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం ఆదిత్య ఎల్-1ను పంపేందుకు ఇస్రో రెడీ అవుతోంది. దీని తర్వాత చంద్రయాన్-4 మిషన్‌ని సైతం చేపడతామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఇదివరకే వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఆయన ఇస్రో ప్రణాళికల గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
భారత్‌కు చంద్రుడితో పాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ పరిశోధనల కోసం మాత్రం మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘చంద్రుడితో పాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లి పరిశోధనలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. అందుకు మన ఆత్మవిశ్వాసం మరింత పెంచుకోవడంతో పాటు మరిన్ని పెట్టుబడుల అవసరం కూడా ఉంది. అంతరిక్ష రంగం మరింత అభివృద్ధి చెందాలి. ఈ స్పేస్ ప్రోగ్రామ్‌ల ద్వారా భారత్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే మా లక్ష్యం. ప్రధాని మోదీ తమకు నిర్దేశించిన భవిష్యత్ లక్ష్యాలను పూర్తి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు పెట్టడాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సమర్థించారు. కేరళలోని తిరువనంతపురంలో భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. శివశక్తి, తిరంగా (చంద్రయాన్ 2 క్రాష్‌ల్యాండ్ అయిన ప్రదేశానికి పెట్టిన పేరు) పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందని.. వాటి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో వివిధ మోడల్‌లలో ల్యాండర్, రోవర్ పనితీరును పరీక్షించాల్సి ఉందని.. అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలమని సోమనాథ్ పేర్కొన్నారు.