Chandrayaan-3: చంద్రయాన్-3పై ఎలాంటి ఆశల్లేవు, కథ పూర్తిగా ముగిసినట్లే.. బాంబ్ పేల్చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్
ABN , First Publish Date - 2023-10-07T19:32:53+05:30 IST
చంద్రునిపై తిరిగి సూర్యోదయం అయినప్పటి నుంచి.. దక్షిణ ధ్రువంలో నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరిగి మేల్కొలిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తోంది. కానీ..
చంద్రునిపై తిరిగి సూర్యోదయం అయినప్పటి నుంచి.. దక్షిణ ధ్రువంలో నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరిగి మేల్కొలిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తోంది. కానీ.. ఇంతవరకు వాటి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే.. ఇకపై అవి తిరిగి మేల్కొంటాయన్న ఆశలు ఏమాత్రం లేవని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కుండబద్దలు కొట్టారు. ‘ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొంటాయన్న ఆశలు ఇప్పుడేం లేవు. ఒకవేళ అవి నిద్రావస్థ నుంచి బయటకు రావాల్సి ఉంటే, ఈపాటికే వచ్చి ఉండేవి. కానీ.. ఇంతవరకూ వాటి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి.. ఇకపై అవి మేల్కొంటాయన్న అవకాశం లేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఇక ముగిసినట్టేనని కన్ఫమ్ చేశారు.
అయితే.. విశాల దృక్కోణంలో చూస్తే మాత్రం చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయ్యిందని ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మిషన్ అనుకున్న ఫలితాన్ని అందించిందని అన్నారు. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువంపై ఇది కాలుమోపిందని.. ఆ ప్రాంతం నుంచి ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి అందజేసిందని చెప్పారు. చంద్రయాన్-3 పంపిన సమాచారం.. భవిష్యత్తులో చేపబట్టబోయే ప్రాజెక్టుల్లో విజ్ఞానపరంగా, ప్లానింగ్ పరంగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాంకేతిక సామర్థ్యాలు పెరగడం వల్లే చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగిందన్నారు. భవిష్యత్తులో చంద్రుని నుంచి నమూనాలను సేకరించి, భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు కూడా కచ్ఛితంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో నమూనాల్ని తీసుకొచ్చి మిషన్‌లు చేపట్టేందుకు అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ఆగస్టు 23వ తేదీన చంద్రుని దక్షిణ ధ్రువంలో కాలుమోపింది. దీంతో.. చంద్రుడ్ని చేరిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అలాగే.. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలిదేశంగా చరిత్ర సృష్టించింది. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ల్యాండర్, రోవర్‌లు తమ పనిని మొదలుపెట్టారు. 14 రోజులపాలు చంద్రునిపై పరిశోధనలు జరిపి.. అక్కడి ఉష్ణోగ్రత వివరాలతో పాటు సల్ఫర్, ఆక్సిజన్ వంటి మూలకాల ఉనికిని కనిపెట్టాయి. 14 రోజుల అనంతరం చంద్రునిపై సూర్యాస్తమయం కావడంతో.. ల్యాండర్, రోవర్‌లను నిద్రలోకి పంపారు. ఇక అప్పటి నుంచి అవి తిరిగి మేల్కొనలేదు. బహుశా రాత్రి సమయంలో చంద్రునిపై అతిశీతల వాతావరణం కారణంగా అవి చనిపోయి ఉండొచ్చని, అందుకే తిరిగి మేల్కోవడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.