Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 మిషన్ లాంచ్‌కి సర్వం సిద్ధం.. ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో
ABN , First Publish Date - 2023-08-28T16:15:54+05:30 IST
సూర్యుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం ఇస్రో సంస్థ ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో సంస్థ ఇదివరకే ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఉత్సాహంలో..
సూర్యుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో సంస్థ ఇదివరకే ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఉత్సాహంలో.. ఈ సోలార్ మిషన్‌ను సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభించనున్నట్టు ఇస్రో తెలిపింది. ఇప్పుడు ఈ మిషన్కి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ఇస్రో తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11:50 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ‘ఆదిత్య ఎల్1’ను లాంచ్ చేయనున్నట్టు అధికారిక ట్విటర్ (X) ఖాతా ద్వారా వెల్లడించింది. సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని కనుగొనడం కోసమే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది.
కాగా.. ఈ ఆదిత్య ఎల్1ను భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 (L1) దగ్గర ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. భూమి నుంచి చంద్రునికి ఎంత దూరం ఉందో.. అందుకు నాలుగు రెట్ల దూరం ఈ కక్ష్య ఉంది. ఆదిత్య ఎల్1 177 రోజుల పాటు ప్రయాణించి.. ఆ కక్ష్యలోకి చేరుకుంటుంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిపైకి ఉపగ్రహాల్ని పంపించాయి. ఇప్పుడు ఈ ఆదిత్య ఎల్1 మిషన్‌తో.. సూర్యుడిపైకి ఉపగ్రహం పంపే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. పీఎల్ఎల్వీ-సీ57 అనే వాహననౌక ఈ ఆదిత్య-ఎల్1ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈ ఆదిత్య ఎల్1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉంటాయి. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ పేలోడ్స్‌ని రూపొందించారు. నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. నిజానికి.. సూర్యగోళంలో 6వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటే.. ఆ సూర్యునికి వేల కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉండే కరోనాలో మాత్రం ఉష్ణోగ్రత 10 లక్షల కెల్విన్ డిగ్రీలు ఉంది. ఇలా కరోనాలో వేడి పెరగడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు.. ఆదిత్య-ఎల్1తో పరిశోధనలు చేయనున్నారు.