ISRO: మరో ప్రతిష్టాత్మక మిషన్‌కు ఇస్రో సర్వం సిద్ధం.. దాని విశేషాలు ఇవే!

ABN , First Publish Date - 2023-09-02T22:02:08+05:30 IST

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మూన్ మిషన్ విజయవంతమైంది. శనివారం లాంచ్ చేసిన ఆదిత్య ఎల్1 సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉత్సాహంలోనే ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్...

ISRO: మరో ప్రతిష్టాత్మక మిషన్‌కు ఇస్రో సర్వం సిద్ధం.. దాని విశేషాలు ఇవే!

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మూన్ మిషన్ విజయవంతమైంది. శనివారం లాంచ్ చేసిన ఆదిత్య ఎల్1 సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉత్సాహంలోనే ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మిషన్ పేరు ఎక్స్‌పోశాట్ (XPoSat - ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్). ఖగోళ శాస్త్రంలో అత్యాధునిక శాస్త్రీయ అవగాహనను పెంపొందించే లక్ష్యంతో.. ఈ కొత్త మిషన్‌ని ఇస్రో చేపడుతోంది. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రకాశవంతమైన ఖగోళ X-కిరణాల మూలాల డైనమిక్‌లను అధ్యయనం చేయడానికి.. భారతదేశం చేపడుతోన్న మొట్టమొదటి పోలారిమెట్రీ మిషన్ ఇది.


ఈ మిషన్‌లో భాగంగా.. అంతరిక్ష నౌక రెండు పేలోడ్స్‌ని తక్కువ భూమి కక్ష్యలోకి తీసుకెళ్తుంది. అవి.. 1. POLIX (పొలారిమీటర్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్‌రే), 2. XSPECT (ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోపీ & టైమింగ్). మొదటి పేలోడ్ 8-30 keV ఫోటాన్‌ల మధ్యస్థ X-రే శక్తి శ్రేణిలో పోలారిమెట్రీ పారామితులను.. అంటే డిగ్రీ, ధ్రువణ కోణాన్ని కొలుస్తుంది. ఇక రెండు పేలోడ్ 0.8–1.5 keV శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఎక్స్-రే పల్సర్‌లు, బ్లాక్‌హోల్స్, బైనరీస్, LMXB, AGN, మాగ్నెటార్‌లలోని తక్కువ అయస్కాంత క్షేత్రాలు, న్యూట్రాన్ నక్షత్రాలు వంటి వివిధ వనరులను తనిఖీ చేస్తుంది.

ఈ ఎక్స్‌పోశాట్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని.. బెంగళూరులోని ఇస్రో అధికారి ఒకరు శనివారం తెలిపారు. బ్లాక్‌హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ మూలాలు సంక్లిష్ట భౌతిక ప్రక్రియల నుండి ఉత్పన్నమవుతాయని, అవి అర్థం చేసుకోవడం సవాలుగా ఉన్నాయని ఆయన వివరించారు. మరోవైపు.. ఈ మిషన్ ఐదేళ్లపాటు కొనసాగుతుందని ఇస్రో తెలిపింది. అయితే.. ఈ మిషన్‌ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-09-02T22:02:08+05:30 IST