Chandrayaan-3 : ఇస్రో మరో ఘనత.. చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం విజయవంతం..
ABN , First Publish Date - 2023-08-17T14:41:27+05:30 IST
చల్లని వెన్నెలను కురిపించే చంద్రుని గురించి లోతుగా తెలుసుకోవాలన్న బలమైన ఆకాంక్ష ప్రపంచమంతటికీ ఉంది. ఈ కలలను సాకారం చేయాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నిర్వహిస్తున్న చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం విజయవంతం అయింది.
న్యూఢిల్లీ : చల్లని వెన్నెలను కురిపించే చంద్రుని గురించి లోతుగా తెలుసుకోవాలన్న బలమైన ఆకాంక్ష ప్రపంచమంతటికీ ఉంది. ఈ కలలను సాకారం చేయాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నిర్వహిస్తున్న చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం విజయవంతం అయింది. ఈ అంతరిక్ష నౌకలోని విక్రమ్ లాండర్ మాడ్యూల్ విజయవంతంగా ప్రొపల్షన్ మాడ్యూల్ (ముందుకు తోసే మాడ్యూల్) నుంచి గురువారం విడిపోయింది. దీంతో భారత దేశం చంద్రునికి మరింత చేరువ అయింది.
ఈ సందర్భంగా ఇస్రో ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నేస్తమా! సవారీకి ధన్యవాదాలు’’ అని విక్రమ్ లాండర్ మాడ్యూల్ చెప్పిందని తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ లాండర్ విజయవంతంగా విడిపోయిందని తెలిపింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు నెమ్మదిగా కాస్త దిగువ కక్ష్యపైకి విక్రమ్ లాండర్ దిగే విధంగా సన్నాహాలు చేసినట్లు తెలిపింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష్యలో దాదాపు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ప్రయాణిస్తుందని ఇస్రో తెలిపింది. దీనిపైనున్న Spectro-polarimetry of Habitable Planet Earth (SHAPE) payload భూమి వాతావరణం యొక్క స్పెక్ట్రోస్కోపిక్ అధ్యయనం చేస్తుందని వివరించింది. అంటే కాంతి, ఇతర రేడియోధార్మిక కిరణాలను బయటకు పంపడం, వాటిని లోపలికి తీసుకోవడం గురించి అధ్యయనం చేస్తుంది. గాజు పట్టకంలోపలికి కాంతి వెళ్లడం, మళ్లీ దాని నుంచి బయటకు రావడాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. భూమిపై మేఘాల నుంచి పోలరైజేషన్‌లో వైవిద్ధ్యాలను కూడా పరిశీలిస్తుందని ఇస్రో తెలిపింది. ప్రజలు నివసించడానికి అనువైన పరిస్థితులు సౌర మండలానికి వెలుపల ఉన్న నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహంలో ఉన్నాయేమో కూడా పరిశీలిస్తుందని తెలిపింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ లాండర్ ఇక చంద్రునిపై తుది దశ ప్రయాణాన్ని ప్రారంభించిందని ఇస్రో వెల్లడించింది. ఇక దీనికి ప్రొపల్షన్ మాడ్యూల్ అవసరం ఉండదని చెప్పింది. తదుపరి లాండర్ మాడ్యూల్ (డీఆర్బిట్1)ను శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..
Fact Check : ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలివ్వడం లేదా?