Chandrayaan 3 : మరో ఆసక్తికర ఫొటోను పంపిన ప్రజ్ఞాన్ రోవర్
ABN , First Publish Date - 2023-08-30T14:56:12+05:30 IST
చంద్రయాన్-3 నుంచి మరో ఫొటో వచ్చింది. ఇది చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ తీసిన విక్రమ్ ల్యాండర్ తొలి ఫొటో. దీనిని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తీసింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) విడుదల చేసింది.
న్యూఢిల్లీ : చంద్రయాన్-3 నుంచి మరో ఫొటో వచ్చింది. ఇది చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ తీసిన విక్రమ్ ల్యాండర్ తొలి ఫొటో. దీనిని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తీసింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) విడుదల చేసింది. చంద్రయాన్-3 విజయవంతమవడంతో మన దేశ కీర్తి, ప్రతిష్ఠలు అంతరిక్ష స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.
ఇస్రో ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై నిలిచి ఉండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7.35 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్ ఫొటో తీసింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన పేలోడ్స్ ఛేస్ట్ (ChaSTE), ఐఎల్ఎస్ఏ (ILSA)లను ఈ ఫొటోలో చూడవచ్చునని ఇస్రో తెలిపింది. వీటిని ఫొటోలో గుర్తులు పెట్టి చూపించింది.
ఇస్రో ఇచ్చిన ట్వీట్‌లో,
‘‘చంద్రయాన్-3 మిషన్ :
స్మైల్, ప్లీజ్!
ప్రజ్ఞాన్ రోవర్ ఈ రోజు ఉదయం విక్రమ్ ల్యాండర్ ఫొటోను క్లిక్ చేసింది.
ఈ ఫొటోను రోవర్‌కు అమర్చిన నేవిగేషన్ కెమెరా తీసింది.
చంద్రయాన్-3 మిషన్ కోసం నేవిగేషన్ కెమెరాలను ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ (LEOS) అభివృద్ధిపరచింది’’ అని తెలిపింది.
ఇస్రో ఇటీవల విక్రమ్ ల్యాండర్ ఫొటోను షేర్ చేసింది, ఆ తర్వాత డిలీట్ చేసింది. ఇది చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుంచి తీసిన ఫొటో. ఇది చంద్రుని దక్షిణ ధ్రువంపైన విక్రమ్ ల్యాండర్ తొలి ఫొటో. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తున్నపుడు, చంద్రుని ఉపరితలంపై వాహ్యాళి చేస్తున్నపుడు తీసిన ఫొటోలను ఇస్రో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అయితే విక్రమ్ ల్యాండర్ సున్నితంగా చంద్రునిపై దిగిన శివశక్తి పాయింట్ వద్ద అది నిలకడగా నిల్చుని ఉండగా తీసిన తొలి ఫొటోను బుధవారం ఇస్రో విడుదల చేసింది.
చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సున్నితంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన సంగతి తెలిసిందే. ఈ ల్యాండర్‌లోనే ప్రజ్ఞాన్ రోవర్ ఉంది. చంద్రుని ఉపరితలంపై దుమ్ము, ధూళి తగ్గిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా బయటకు వచ్చి, తనకు అప్పగించిన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్, ప్రాణవాయువు, అల్యూమినియం, కాల్షియం వంటివి ఉన్నాయని గుర్తించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపైకి అడుగు పెట్టినది మనమే కాబట్టి అక్కడి విషయాలను తెలుసుకున్నది కూడా మనమే.
విక్రమ్ ల్యాండర్‌కు నాలుగు పేలోడ్స్ (ప్రధాన లక్ష్యాన్ని సాధించడం కోసం అమర్చిన పరికరం)ను అమర్చారు. వీటిలో ఛేస్ట్ (ChaSTE)ను చంద్రుని నేల ఉష్ణ లక్షణాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేశారు. ఘన లేదా ద్రవ లేదా వాయు స్థితిలోని వస్తువుకు వేడి తగిలినపుడు అది ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ పరికరాన్ని అమర్చారు. వేడి తగిలినపుడు ఆ వస్తువు పొడవు పెరుగుతోందా? పరిమాణంలో మార్పులు వస్తున్నాయా? రసాయనిక చర్య జరుగుతోందా? వంటి అంశాలను దీనివల్ల తెలుసుకోవచ్చు. శివశక్తి పాయింట్ వద్ద చంద్రుని ఉపరితలం, లోపలి భాగం కంపించే పరిస్థితులను అంచనా వేయడం కోసం ఐఎల్ఎస్ఏ పేలోడ్‌ను అమర్చారు.
ఇవి కూడా చదవండి :
BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు