Jammu & Kashmir: ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు విడుదల..
ABN , First Publish Date - 2023-04-21T11:29:46+05:30 IST
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu& Kashmir)లోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack)లో అమరులైన వీర జవాన్ల పేర్లను ఆర్మీ అధికారులు ప్రకటించారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir)లోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack)లో అమరులైన వీర జవాన్ల పేర్లను ఆర్మీ అధికారులు ప్రకటించారు. హవల్దార్ మందీప్ సింగ్, లాన్స్ నాయక్, దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవత్ సింగ్‌లు అమర సైనికులని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా, ఒకరు ఒడిస్సాకు చెందినవారని అధికారులు తెలిపారు. అటు ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నిన్న భీంబేర్‌గలీ నుంచి షాంగీ రోడ్‌కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వాహనం ఇంజన్‌ను టార్గెట్ చేస్తూ గ్రేనేడ్స్ విసిరారు. దీంతో ఆర్మీ వాహనం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. జవాన్లు ఎదురుదాడి చేసే వీలు లేకుండా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతోపాటు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తోటి జవాన్లకు ఆహారం తీసుకువెళుతున్న ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఉగ్రదాడి ఘటనతో జమ్మూ కశ్మీర్లో పూంచ్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు ఎలాంటి కదలికలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కోరింది.
కాగా జవాన్లపై దాడికి తమదే బాధ్యత అని పీఏఎఫ్ఎఫ్ ప్రకటించింది. సరిగ్గా.. 2021లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే పీఏఎఫ్ఎఫ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2019లో అల్ ఖాయిదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్థ.. జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీఏఎఫ్ఎఫ్ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది.