Mahathir Mohamad: గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న పనినే కశ్మీర్‌లో భారత్ చేస్తోంది.. మలేషియా మాజీ ప్రధాని సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2023-10-28T16:14:10+05:30 IST
భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్ మరోసారి కశ్మీర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక దళాలు చేపట్టిన ప్రతీకార చర్యను...
భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్ మరోసారి కశ్మీర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక దళాలు చేపట్టిన ప్రతీకార చర్యను కశ్మీర్‌లో భారతదేశ కార్యకలాపాలతో పోల్చారు. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ ఎలా అణచివేస్తోందో, అదే విధంగా భారతదేశం కూడా కశ్మీర్‌లో చేస్తోందని ఆయన ఆరోపించారు. భారత్‌లో కశ్మీర్ విలైనమైన రోజుని (అక్టోబర్ 27) పాకిస్తాన్‌లో బ్లాక్ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులోనే పై విధంగా భారత్‌పై ఆరోపణలు గుప్పించారు.
పాకిస్తాన్ ‘బ్లాక్ డే’ జరుపుకున్న శుక్రవారం నాడు పాకిస్తానీ హైకమిషన్ మహతీర్ మొహమ్మద్ వీడియోను ట్విటర్‌లో (X ప్లాట్‌ఫామ్)లో పోస్ట్ చేసింది. ఇందులో ఆయన భారత్‌పై విషం చిమ్మడంతో పాటు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘దశాబ్దాలుగా క్రూరమైన ప్రభుత్వాలు వివక్ష, కులనిర్మూలన విధానాలను అనుసరిస్తున్నాయి. మాజీ వలసవాద శక్తులు ఇప్పుడు కొత్త ఆక్రమిత దేశాలకు మద్దతు ఇస్తున్నాయి. ఇది మారణహోమానికి కారణమవుతోంది’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాశ్చాత్య దేశాలను విమర్శిస్తూ.. ఇలాంటి క్రూరమైన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇంకా మహతీర్ మాట్లాడుతూ.. పాలస్తీనా ప్రజల అస్తిత్వాన్ని నాశనం చేయడమే ఇజ్రాయెల్ ఉద్దేశమని, అందుకే గాజాలో ప్రాథమిక అవసరాలన్నింటిని నిలిపివేసిందని ఇజ్రాయెల్‌పై నిప్పులు చెరిగారు. భారత్ కూడా ఇజ్రాయెల్ వ్యూహాలను కశ్మీర్‌లో అనుసరిస్తోందని పేర్కొన్నారు. కాగా.. తీవ్రవాద ఇస్లామిక్ గ్రూపులకు మహతీర్ మహ్మద్ మద్దతు తెలుపుతుంటారు. ఆయన పాకిస్తాన్‌కు బలమైన మద్దతుదారుగా కూడా ఉన్నాడు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో టర్కీని చేర్చుకోవడం ద్వారా కొత్త ఇస్లామిక్ కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ.. సౌదీ అరేబియా ఒత్తిడితో పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. పరారీలో ఉన్న జకీర్ నాయక్‌కి కూడా ఆయన రక్షణ కల్పించారు.