Chandrayaan-3: చంద్రయాన్-3 విజయంలో కీలకపాత్ర పోషించిన మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. ఎలాగో తెలుసా?
ABN , First Publish Date - 2023-09-01T22:20:45+05:30 IST
చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీలు కీలక పాత్ర పోషించాయన్న విషయం తెలుసా? నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఇది మాత్రం నిజం. ద వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..
చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీలు కీలక పాత్ర పోషించాయన్న విషయం తెలుసా? నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఇది మాత్రం నిజం. ద వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ బర్ఖా దత్ ఆ సీక్రెట్‌ని రివీల్ చేశారు. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తల పనితీరు ఎలా సాగిందన్న విషయంపై తాము సమాచారం సేకరించామని.. ఈ క్రమంలోనే మసాలా దోశ, ఫిల్టర్ కాఫీల పాత్ర బయటపడినట్లు ఆమె తెలిపారు.
ఈ విషయంపై చంద్రయాన్-3 మిషన్‌లో పని చేసిన ఇస్రో శాస్త్రవేత్త వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ.. ‘‘ఒకవైపు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. మరోవైపు ఆర్థిక ప్రోత్సాహకాలు లేవు. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా టాస్కులు పూర్తి చేయడం దాదాపు అసాధ్యమని అనుకుంటున్న తరుణంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీలు ఊరటనిచ్చాయి. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు దోశతో పాటు కాఫీ అందించడంతో.. అలసట అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. ప్రతి ఒక్కరు ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పని చేశారు. ఎక్కువసేపు విధులు నిర్వహించేలా సంతోషంగా ముందుకు వచ్చారు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ మసాలా దోశ, ఫిల్టర్ కాఫీలు లేకపోయి ఉంటే.. అందరూ ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేవారని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
కాగా.. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ఆగస్టు 23వ తేదీన చారిత్రాత్మక దినంగా భారత్ పరిగణించింది. ఆ రోజుని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు.. దక్షిణ ధ్రవంలో కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలకు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. మనకన్నా ముందు రష్యా లూనా-25 మూన్ మిషన్‌తో ఈ ఘనత సాధించాలని అనుకుంది కానీ.. ఆ ప్రయోగం విఫలమైంది.