భారత్-సౌదీలది వ్యూహాత్మక భాగస్వామ్యం
ABN , First Publish Date - 2023-09-12T02:44:15+05:30 IST
భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు...
8కాలానుగుణంగా కొత్త అంశాలతో మరింత బలోపేతం: మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ స్థిరత్వానికి ఈ భాగస్వామ్యం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సౌదీ యువరాజు మహమ్మద్-బిన్-సల్మాన్‌తో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో దైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. మహ్మద్-బిన్-సల్మాన్ మాట్లాడుతూ.. భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. జీ-20 సదస్సు వల్ల యావత్ ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. మోదీ-సల్మాన్‌ల ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, సాంస్కృతిక సహకారం, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు, రాజకీయం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రూ.4.37 లక్షల కోట్లు(52.75 బిలియన్ డాలర్లు)గా ఉన్నట్లు.. గతంతో పోలిస్తే.. ఇది ఆల్-టైమ్ రికార్డు అని కేంద్ర గణాంకాలు స్పష్టం చేశాయి. 2019లో ప్రధాని మోదీ రియాధ్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ సహకారంపై సంయుక్త కమిటీ(జేసీడీసీ), భారత్-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటైన విషయం తెలిసిందే. సల్మాన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి.