Chandrayaan-3: చంద్రయాన్-3 సాధించిన గొప్ప విజయాలు ఇవే.. జాబితా బయటపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త

ABN , First Publish Date - 2023-09-12T14:57:06+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది...

Chandrayaan-3: చంద్రయాన్-3 సాధించిన గొప్ప విజయాలు ఇవే.. జాబితా బయటపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన తర్వాత.. అక్కడ పరిశోధనలు జరిపి, భూమికి ఎంతో సమాచారాన్ని అందించాయి. అక్కడి వాతావరణ పరిస్థితులు (ఉష్ణోగ్రత).. సల్ఫర్, ఆక్సిజన్‌తో పాటు ఇతర మూలకాలతో పాటు మరెంతో డేటాను పంపించాయి. ప్రస్తుతం అక్కడ (చంద్రుడు) రాత్రివేళ కావడంతో.. ల్యాండర్, రోవర్‌లు స్లీపింగ్ మోడ్‌లో ఉన్నాయి.


ఇప్పుడు తాజాగా చంద్రయాన్-3 మిషన్ సాధించిన గొప్ప విజయాలకు సంబంధించి ప్రముఖ శాస్త్రవేత్త దేబిప్రసాద్ దువారీ ఒక జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకూ ఇస్రో చేపట్టిన మూడు చంద్రయాన్ మిషన్లు.. అంతర్జాతీయ శాస్త్రీయ సమాజానికి ఊహించిన దాని కంటే ఎక్కువ సమాచారాన్ని అందజేశాయన్నారు. భవిష్యత్తులో చంద్రునిపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేసే అవకాశంతో పాటు వివిధ కోణాల నుండి చంద్రుని అన్వేషణకు మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఈ మూడు మిషన్లు నీటి మంచు, గతంలో కనుగొనబడని ఖనిజాలు & మూలకాల ఉనికితో పాటు చంద్రునిపై ఉష్ణోగ్రత మార్పులను కనుగొన్నాయన్నారు. 2019లో చంద్రయాన్-1 మూన్ మినరాలజీ మ్యాపర్‌ను ఉపయోగించి.. ధ్రువ ప్రాంతంలో 60,000 కోట్ల లీటర్ల నీటి మంచు ఉన్నట్టు మొదటిసారిగా గుర్తించిందన్నారు. ఈ సమాచారం ఆధారంగా.. మానవులు ఉండగలిగే సింథటిక్ బయోస్పియర్‌ను సృష్టించవచ్చని అన్నారు.


చంద్రయాన్-2 మిషన్‌లో ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైనప్పటికీ.. దాని ఆర్బిటర్ నాలుగు సంవత్సరాల పాటు చంద్రుని చుట్టూ తిరుగుతూ.. కావాల్సినంత విజ్ఞానం, సమాచారం, డేటా, చిత్రాలను భూమికి పంపిందని దేబిప్రసాద్ పేర్కొన్నారు. ఇక చంద్రయాన్-3 దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన కొన్ని రోజుల్లోనే అక్కడ సల్ఫర్ ఉనికిని గుర్తించిందన్నారు. అంతేకాదు.. ఇది ఇంతవరకూ కనుగొనబడని ఖనిజాలు, మూలకాల గురించి అనేక అవకాశాల్ని సూచించిందన్నారు. చంద్రుని మీద ఉష్ణోగ్రతపై ఆసక్తికరమైన డేటాను కూడా అందించిందన్నారు. ఈ డేటా మొత్తం.. చంద్రుని ఉపరితలంపై మానవ నిసాసానికి అనుకూలంగా చూపిస్తోందన్నారు. ఇదే సమయంలో ఇస్రో చేపడుతున్న ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఇది సాంకేతిక రంగంలో భారతదేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్తుందని, ఇదో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు.

Updated Date - 2023-09-12T14:57:06+05:30 IST