Share News

Gutka Ad Case: గుట్కా యాడ్ కేసు.. షారుఖ్‌తో పాటు ఆ ఇద్దరు స్టార్లకు కోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2023-12-10T22:33:54+05:30 IST

సాధారణంగా స్టార్ నటీనటులు ప్రజలకు హాని తలపెట్టే ప్రోడక్టులను (గుట్కా, మద్యపానం, ఇతరత్రాలు) ఏమాత్రం ప్రమోట్ చేయరు. అటు తిరిగి, ఇటు తిరిగి అది తమ మెడకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి.. వాటి జోలికి వెళ్లరు. కానీ..

Gutka Ad Case: గుట్కా యాడ్ కేసు.. షారుఖ్‌తో పాటు ఆ ఇద్దరు స్టార్లకు కోర్టు నోటీసులు

Gutka Ad Case: సాధారణంగా స్టార్ నటీనటులు ప్రజలకు హాని తలపెట్టే ప్రోడక్టులను (గుట్కా, మద్యపానం, ఇతరత్రాలు) ఏమాత్రం ప్రమోట్ చేయరు. అటు తిరిగి, ఇటు తిరిగి అది తమ మెడకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి.. వాటి జోలికి వెళ్లరు. కానీ.. కొందరు పారితోషికం మాయలో పడి ఆయా ప్రకటనల్లో నటిస్తారు. ఆ ప్రోడక్ట్ మంచిదేనంటూ ప్రమోట్ చేస్తారు. అలాంటి పని చేసినందుకే బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ ఖాన్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. ఈ ముగ్గురికి కోర్టు నుంచి తాజాగా నోటీసులు అందాయి.


ఈ వివరాల్లోకి వెళ్తే.. షారుఖ్, అజయ్, అక్షయ్‌లు కలిసి గుట్కా (విమల్) సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో నటించారని కొన్నాళ్ల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలైంది. మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న ఈ స్టార్ హీరోలు.. హానికారక ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసే ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గతంలోనే ఆదేశించింది. అయితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే కోర్టు.. దీనిపై స్పందన ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే స్పందిస్తూ.. షారుఖ్, అక్షయ్, అజయ్‌లకు అక్టోబర్‌ 22వ తేదీనే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని శుక్రవారం కోర్టుకు తెలియజేశారు. ఇలా కోర్టు రంగంలోకి దిగేదాకా.. ఈ నోటీసుల వ్యవహారం వెలుగులోకి రాలేదు. ఇదే సమయంలో.. ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, కాబట్టి తాజా పిటిషన్‌ని కొట్టివేయాలని కోర్టుని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను 2024 మే 9వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2023-12-10T22:33:58+05:30 IST