Tamilnadu: రవిశంకర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , First Publish Date - 2023-01-25T18:25:36+05:30 IST
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారంనాడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణ ప్రతికూలత కారణంగా ఆయన వెళ్తున్న...
చెన్నై: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravishankar) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారంనాడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణ ప్రతికూలత కారణంగా ఆయన వెళ్తున్న హెలికాప్టర్‌ను తమిళనాడు ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో అత్యవసరంగా దించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రవిశంకర్ ప్రైవేటు హెలికాప్టర్‌లో నలుగురితో కలిసి తిరుపుపూరు నుంచి బెంగళూరు బయలుదేరారు. దట్టమైన పొగమంచు, దారిసరిగా కనిపించకపోవడం, వాతావరణ ప్రతికూలత కారణంగా ఉదయం 10.40 గంటల ప్రాంతంలో సత్యమంగళవం వద్ద ఓపెన్ ఫీల్డ్‌లో హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందకు దించారు. సమాచారం తెలియగనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సుమారు 50 నిమిషాల తర్వాత ఆకాశం నిర్మలం కావడంతో 11.30 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ తిరిగి బయలు దేరింది.
కాగా, హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండిగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమల్లో కనిపిస్తోంది. విషయం తెలియగానే సమీప గ్రామస్థులు అక్కడకు చేరుకోవడం, వారితో రవిశంకర్ సంభాషించడం ఇందులో కనిపిస్తోంది.
అందరూ సురక్షితం...
రవిశంకర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్వీట్ చేసింది. ''గురుదేవులు శ్రీశ్రీ రవిశంకర్ తిరుప్పూరు జిల్లాలోని శ్రీ బ్రిహన్నాయకి అంబికా సమేత శ్రీ ఆంధ్ర కపాలేశ్వరర్ కుంభాభిషేకం కోసం బయలుదేరారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఉగినియం వద్ద హెలికాప్టర్‌ను నిలిపివేయాలని పైలట్ నిర్ణయం తీసుకున్నారు. గురుదేవులు సహా హెలికాప్టర్‌లోని అందరూ క్షేమంగా ఉన్నారు. పరిస్థితి చక్కబడగానే గురుదేవులు హెలికాప్టర్‌లో తిరిగి బయలుదేరి కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు'' అని ఆ ట్వీట్‌లో తెలిపింది.