School Video Controversy: ఇది ఒక చిన్న సమస్య.. స్టూడెంట్‌పై దాడి వీడియోపై టీచర్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-26T19:24:04+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక టీచర్ తోటి విద్యార్థులతో ఓ స్టూడెంట్‌పై దాడి చేయించిన వీడియో వైరల్ అవ్వడం, దానిపై సర్వత్రా విమర్శలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోపై టీచర్ తృప్తి త్యాగి...
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక టీచర్ తోటి విద్యార్థులతో ఓ స్టూడెంట్‌పై దాడి చేయించిన వీడియో వైరల్ అవ్వడం, దానిపై సర్వత్రా విమర్శలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోపై టీచర్ తృప్తి త్యాగి స్పందించారు. తాను చేయించిన ఆ దాడిని సమర్థించుకున్నారు. ఆ స్టూడెంట్‌కి 5వ గుణితం నేర్చుకోవాలని తాను చెప్పానని.. సెలవులు వచ్చినా అతడు నేర్చుకోలేదని తెలిపింది. తాను దివ్యాంగురాలు కావడం వల్ల విద్యార్థులతో కొట్టించానన్నారు. ఈ ఘటనలో మతపరమైన కోణం ఏమాత్రం లేదన్నారు. బాలుడు హోంవర్క్ చేయకపోవడం వల్లే ఇలా కొట్టించానన్నారు. ఆ బాలుడి పట్ల కొంచెం కఠినంగా ఉండమని అతని తల్లిదండ్రుల నుంచే ఒత్తిడి వచ్చిందన్నారు.
ఆ సమయంలో విద్యార్థి బంధువు ఒకరు క్లాస్‌లో కూర్చొని ఉన్నారని, అతనే ఈ వీడియోని రికార్డ్ చేశాడని తృప్తి త్యాగి వివరణ ఇచ్చారు. అతను ఈ వీడియోని ఎడిట్ చేసి.. మతపరమైన కోణం వచ్చేలా బయడకు విడుదల చేశాడని ఆరోపించారు. తోటి విద్యార్థులతో ఒక స్టూడెంట్‌పై ఇలా దాడి చేయించడం తప్పేనని.. కానీ తాను ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని ఆమె తెలిపారు. దీనిని అనవసరంగా పెద్ద సమస్యగా మార్చొద్దని కోరారు. దీనిపై రాహుల్ గాంధీతో పాటు ఇతర రాజకీయ నేతలు ట్వీట్ చేశారని.. అయితే ఇది ఒక చిన్న సమస్య మాత్రమేనని వాళ్లకి చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు. ఇలాంటి చిన్న విషయాలను కూడా వైరల్ చేస్తే.. టీచర్లు ఎలా పని చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
మరోవైపు.. తాను గణిత పట్టికలు నేర్చుకోలేదన్న కోపంతో టీచర్ తన తోటి విద్యార్థులతో కొట్టించిందని బాధిత బాలుడు పేర్కొన్నాడు. తనపై గట్టిగా దాడి చేయాల్సిందిగా టీచర్ వాళ్లకు చెప్పిందని.. వాళ్లందరూ తనని గంటపాటు కొట్టారని వాపోయాడు. అటు.. తండ్రి కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు ఏడేళ్లేనని, అతడ్ని గంటపాటు చిత్రహింసలకు గురి చేశారని బాధపడ్డాడు. ఇకపై తన బిడ్డను ఆ పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇదిలావుండగా.. ఈ ఘటనపై కేసు నమోదైనట్లు ముజాఫర్‌నగర్ కలెక్టర్ అరవింద్ మల్లప్ప తెలిపారు. కాగా.. రైతులు చెంపదెబ్బ కొట్టిన విద్యార్థులతో బాధుతుడ్ని కౌగిలించుకునేలా చేసి, సోదర భావాన్ని కాపాడుకోవాలని సూచించారు.