Baba Balaknath: రాజస్థాన్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న బాబా బాలక్‌నాథ్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి?
ABN , First Publish Date - 2023-12-04T20:32:42+05:30 IST
బాబా బాలక్‌నాథ్.. నిన్నటిదాకా ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ.. ఇప్పుడు ఉత్తర భారతంలో ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆయన ఉండటమే! యోగి ఆఫ్ రాజస్థాన్‌గా పేరొందిన ఆయన.. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
Baba Balaknath History: బాబా బాలక్‌నాథ్.. నిన్నటిదాకా ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ.. ఇప్పుడు ఉత్తర భారతంలో ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆయన ఉండటమే! యోగి ఆఫ్ రాజస్థాన్‌గా పేరొందిన ఆయన.. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందే అల్వార్ జిల్లా నుండి ఎంపీగా ఉన్న ఆయన.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరిలోకి దిగి గెలుపొందారు. ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే ఆయన్ను ఈ ఎన్నికల బరిలోకి బీజేపీ దింపినట్లు తెలుస్తోంది. ఆ లక్ష్యం.. ముఖ్యమంత్రి పదవి ఆయనకు కట్టాబెట్టాలన్నదే. ఇతర ఆశావహులు ఉన్నప్పటికీ.. బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం బాలక్‌నాథ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే.. ఆయన చరిత్ర ఏంటనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
బాబా బాలక్‌నాథ్ చరిత్ర
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలోనే బాబా బాలక్‌నాథ్ ‘నాథ్ శాఖ’ నుంచి వచ్చాడు. గోరఖ్‌పూర్‌లోని నాథ్ శాఖకు చెందిన గోరఖ్‌ధామ్‌కు యోగి ఆదిత్యనాథ్ ‘మహంత్’ అయితే.. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఉన్న మస్త్‌నాథ్ మఠానికి బాబా బాలక్‌నాథ్ ‘మహంత్’. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆయన 1984 ఏప్రిల్ 16వ తేదీన అల్వార్ జిల్లాలోని కొహ్రానా గ్రామంలో యాదవ్ కుటుంబంలో జన్మించాడు. వ్యవసాయ నేపథ్యానికి చెందిన బాలక్‌నాథ్ కుటుంబం.. సాధువుల సేవలో చాలా నిమగ్నమై ఉండేది. ఈ కారణంగానే.. ఆయన చాలా చిన్న వయస్సులోనే మహంత్ చంద్‌నాథ్‌తో కలిసి హనుమాన్‌గర్ మఠానికి వెళ్లి, అతని వద్ద ఆధ్యాత్మిక విద్యను పొందడం ప్రారంభించాడు. 2016లో బాలక్‌నాథ్ రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్ మఠానికి వారసుడు అయ్యాడు. మస్త్‌నాథ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు.
రాజస్థాన్ రాష్ట్రంలో బాబా బాలక్‌నాథ్ ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరొందాడు. తన ప్రసంగాలలో హిందుత్వం గురించి మాట్లాడతారు. తన ఎన్నికల నామినేషన్‌తో పాటు ప్రచారానికి వెళ్ళినప్పుడు.. బుల్డోజర్‌తో చాలా ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ కారణం చేతనే యోగి ఆదిత్యనాథ్‌తో బాబాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని నమ్ముతారు. అయితే వీరిద్దరూ నాథ్ శాఖకు చెందిన వారు కావడంతో ఒకరి పట్ల ఒకరికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాథ్ శాఖలో బాలక్‌నాథ్ 8వ సాధువుగా పరిగణించబడతారు. ఓబీసీ వర్గానికి చెందిన ఆయన ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎంపీగా తాను అందుకున్న డబ్బును ఢిల్లీ పార్లమెంట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో డిపాజిట్ చేసినట్లు చెప్పారు. తన ఖాతాలో ఉన్నది రూ.13 లక్షల 29 వేల 558 మాత్రమేనని స్పష్టం చేశారు.