Shukrayaan-1: శుక్రయాన్-1 మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి.. ఈ ఆలోచన ఎప్పుడు పుట్టింది.. వెలుగులోకి కీలక విషయాలు!

ABN , First Publish Date - 2023-09-29T22:26:41+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ని సైతం ప్రారంభించింది. ఈ ఉత్సాహంలోనే ఇస్రో ఇప్పుడు మన సౌర కుటుంబంలోనే...

Shukrayaan-1: శుక్రయాన్-1 మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి.. ఈ ఆలోచన ఎప్పుడు పుట్టింది.. వెలుగులోకి కీలక విషయాలు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ని సైతం ప్రారంభించింది. ఈ ఉత్సాహంలోనే ఇస్రో ఇప్పుడు మన సౌర కుటుంబంలోనే అత్యంత ప్రకాశవంతమైన ‘శుక్రుడు’ (వీనస్) గ్రహంపై దృష్టి సారించింది. ఇప్పటికే వీనస్ మిషన్ కాన్ఫిగర్ చేయబడిందని, కొన్ని పేలోడ్స్‌ని అభివృద్ధి చేశామని మంగళవారం ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఈ మిషన్‌కి సంబంధించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..


* ఈ మిషన్‌కి అధికారికంగా ఇంకా పేరు ఖరారు చేయలేదు. కానీ.. అనధికారికంగా ‘శుక్రయాన్-1’ అని పిలుస్తున్నారు. ఇది సంస్కృత పదాలైన శుక్ర (వీనస్ గ్రహం), యానా (క్రాఫ్ట్)ల సమ్మేళనం.

* ఓ రిపోర్ట్ ప్రకారం.. ఈ శుక్రయాన్-1 మిషన్ ఆలోచన 2012లో పుట్టింది. 2017లో అంతరిక్ష శాఖ కోసం 2017-2018 బడ్జెట్‌లో 23% పెంచిన తర్వాత ఈ మిషన్‌కి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలను ఇస్రో ప్రారంభించింది. అదే ఏడాదిలో పరిశోధన సంస్థల నుండి పేలోడ్ ప్రతిపాదనలను కోరింది.

* శుక్రుడి ఉపరితలం, అక్కడి వాతావరణాన్ని అంచనా వేయడం, భౌగోళిక కూర్పును విశ్లేషించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. నాసా రిపోర్ట్ ప్రకారం.. శుక్రుడి ఉపరితలం మందంగా ఉంటుందని, ఇది విషపూరిత మేఘాలతో నిండి ఉందని తేలింది. ఈ శుక్రయాన్-1 మిషన్ సౌర వికిరణం, శుక్రుడిపై ఉపరితల కణాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడొచ్చు.

* బిలియన్ల సంవత్సరాల క్రితం భూ గ్రహం నివాసయోగ్యంగా ఉండేది కాదు. ఇప్పుడు శుక్రడు ఎలా ఉన్నాడో, భూమి కూడా అలాగే ఉండేది. కాబట్టి.. శుక్రుడు గ్రహం భవిష్యత్తు ఏంటి? అనేది లోతుగా పరిశీలించడం కోసం ఈ వీనస్ మిషన్ శాస్త్రవేత్తలకు, స్పేస్ కమ్యూనిటీకి సహాయపడుతుంది.

* నాసా రిపోర్ట్ ప్రకారం.. శుక్రుడిపై ప్రస్తుతానికైతే జీవం లేదు. అయినప్పటికీ.. భూమి ఉపరితలం తరహాలోనే అక్కడ పీడనం ఉండటం, మేఘాలు చల్లగా ఉన్న నేపథ్యంలో అక్కడ సూక్ష్మజీవులు ఉండే అవకాశం లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు.. మేఘాల్లో సంభావ్య సూక్ష్మజీవుల జీవితానికి సూచిక అయిన ఫాస్పైన్‌ని సైతం గమనించారు. ఇప్పుడు చేపట్టబోయే వీనస్ మిషన్‌తో అక్కడ జీవం ఉందా? లేదా? అనే విషయాన్ని తేల్చే ఛాన్స్ ఉండొచ్చు.


ఇదిలావుండగా.. ఈ శుక్రయాన్-1 మిషన్ గురించి మంగళవారం సోమనాథ్ ప్రకటన చేసినప్పుడు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. శుక్రుడు గ్రహం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని, దీనిని అన్వేషించడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అన్నారు. వీనస్‌కి వాతావరణం ఉంటుందని, అది ఎంతో దట్టమైనదని, అక్కడి వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ గ్రహం మొత్తం యాసిడ్‌తో నిండి ఉంటుందని, దాని ఉపరితలంపై ఎవరూ ప్రవేశించలేరని వెల్లడించారు.

అంతేకాదు.. తాము ఈ వీనస్ మిషన్‌తో పాటు అంతరిక్ష వాతావరణం, భూమిపై దాని ప్రభావాన్ని విశ్లేషించేందుకు కూడా రెండు ఉపగ్రహాలను సిద్ధం చేస్తున్నారన్నారు. అలాగే అంగాకర గ్రహంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసే ప్రాజెక్ట్‌ని సైతం ఇస్రో ప్లాన్ చేస్తోందన్నారు. అయితే.. శుక్రయాన్-1 మిషన్‌ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పనులైతే సాగుతున్నాయి. బహుశా అన్ని కలిసి వస్తే.. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2023-09-29T22:26:41+05:30 IST