Turekey earthquake: 90 గంటల తర్వాత శిథిలాల నుంచి బయపడిన 10 రోజుల శిశువు
ABN , First Publish Date - 2023-02-11T16:33:10+05:30 IST
హతాయ్: టర్కీ, సిరియా భూకంపం సృష్టించిన భారీ విలయంతో ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు, ఆక్రందనలే...
హతాయ్: టర్కీ, సిరియా భూకంపం (Turkey, Syria Earthquake) సృష్టించిన భారీ విలయంతో ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు, ఆక్రందనలే కనిపిస్తున్నాయి. ప్రకృతి విలయంలో 22,000 మందికి పైగా మృతి చెందగా, శిథిలాల కింద నుంచి చిన్నారులు మృత్యుంజయులుగా బయటపుడుతున్నారు. భారీ ఉత్పాతం తర్వాత ఒక మహిళ పండంటి బిడ్డను ప్రసవించి శిథిలాల కిందే చనిపోగా, ఆ పసిగుడ్డు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలోనే హతాయ్ ప్రావిన్సులో ఓ భవంతి కింద నుంచి శుక్రవారంనాడు పది రోజుల పసిగుడ్డు అనూహ్యంగా బయటపడ్డాడు. పసిగుడ్డు ఏడుపే తల్లీబిడ్నలను కాపాడేలా చేయడం విశేషం.
భూకంప శిథిలాల్లో 90 గంటల పాటు తల్లీ, పసిగుడ్డు చిక్కుకుపోయారని, పసిబిడ్డ ఏడుపుతో రెస్క్యూ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన వారిని బయటకు తీసుకువచ్చిందని సహాయక బృందాలు తెలిపాయి. భవంతి శిథిలాల నుంచి శిశువును బయటకు తీయగానే థర్మల్ బ్లాంకెట్‌లో చుట్టి అంబులెన్స్‌లోకి చేర్చినట్టు చెప్పారు. తల్లి మాత్రం తిండి, నీరు లేక నీరసించిపోయిందని, వెంటనే తల్లీబిడ్డలను ఆసుపత్రిలో చేర్చామని రెస్క్యూ టీమ్ తెలిపింది. పిల్లవాడు తల్లిపాలు తాగుతూ చురుగ్గానే ఉన్నట్టు చెప్పారు. తల్లి పాలే శిశివును కాపాడిందని తెలిపారు.
కాగా, హతాయ్ ప్రావిన్స్‌లోని శిథిలాల కింత నుంచి జెనెప్ ఎలా పర్లాక్ అనే మూడేళ్ల బాలుడిని కూడా సహాయక సిబ్బంది రక్షించారు. దాదాపు 100 గంటల సేపు బాలుడు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్టు టర్కీ వార్తా సంస్థ తెలిపింది. కాగా, ఒక్క శుక్రవారంనాడే కనీసం తొమ్మిది మంది చిన్నారులను సహాయక బృందాలు కాపాడినట్టు ఏబీసీ న్యూస్ తెలిపింది. టర్కీ, సిరియాల్లో భూకంపంతో మృతుల సంఖ్య 22,000కు చేరినట్టు పేర్కొంది. టర్కీలోని హతాయ్ ప్రావిన్సును ఫిబ్రవరి 6న 7.7-7.6 తీవ్రతతో రెండు భూకంపాలు బలంగా తాకాయి. కాగా, ఇండియాతో సహా డజనుకు పైగా దేశాలకు చెందిన ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కుప్పకూలిన వేలాది భవనాల శిథిలాలను తొలగిస్తూ, సహాయక చర్యలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. మానవతా సాయం కూడా పలు దేశాల నుంచి టర్కీ, సిరియాకు అందుతోంది.