Share News

Uttarakhand: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అమెరికా డ్రిల్లింగ్ మిషన్

ABN , First Publish Date - 2023-11-16T19:35:02+05:30 IST

ఉత్తరాఖండ్(Uttarakhand)లో సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరంతో సహాయక చర్యలు చేపట్టారు.

Uttarakhand: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అమెరికా డ్రిల్లింగ్ మిషన్

డెహ్రడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరంతో సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా 55 మీటర్ల నుంచి 60 మీటర్ల శిథిలాలను తొలగించారు. అయితే ఆ ప్రాంతంలో మళ్లీ మట్టి కొట్టుకుపోయింది. దీంతో తవ్విన భాగాన్ని 14 మీటర్లకు తగ్గించారు.

రెస్క్యూ ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న కల్నల్ దీపక్ పాటిల్ గురువారం మాట్లాడుతూ.. ప్లాన్ బి విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రెస్క్యూ సిబ్బంది అత్యాధునికమైన, అమెరికన్ నిర్మిత క్షితిజ సమాంతర డ్రిల్లింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నారని పాటిల్ చెప్పారు. ఆపరేషన్ పూర్తి కావడానికి కేవలం గంటల వ్యవధి మాత్రమే పడుతుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. అనుకున్న సమయానికి ముందుగానే రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుందని అన్నారు. విదేశీ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ (Tunnel) ఆదివారం ఉదయం కుప్పకూలింది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్‌లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది. దీంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన అంతకంతకూ తీవ్రమవుతోంది.

సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడానికి సొరంగం లోపల 900 ఎంఎం పైపును అమర్చడం ద్వారా మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం మూడు రోజులుగా జరుగుతోంది. టన్నెల్‌‌ను బ్లాక్ చేసిన 21 మీటర్ల శ్లాబ్‌ను తొలగించినప్పటకీ, 19 మీటర్ల పాసేజ్‌ను ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన కొత్త డ్రిల్లింగ్ మిషన్, ఇతర సామగ్రిని ఢిల్లీ నుంచి ఎయిర్ లిఫ్ట్ ద్వారా రప్పించే చర్చలు చేపట్టారు. అమెరికాకు చెందిన అత్యాధునిక పరికరాలతో తాజాగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

Updated Date - 2023-11-16T19:35:03+05:30 IST