Manipur: 30 ఇళ్లు, దుకాణాల దహనం
ABN , First Publish Date - 2023-07-27T01:21:44+05:30 IST
మణిపూర్(Manipur)లో హింసాకాండ కొనసాగుతోంది. బుధవారం మోరె జిల్లాలో ఒక మూక 30ఇళ్లు, దుకాణాలను దహనం చేసింది. నివారించటానికి వచ్చిన సాయుధ దళాలపై తుపాకులతో కాల్పులకు తెగబడింది.
మణిపూర్‌లో కొనసాగుతున్న హింస
భద్రతాదళాలపై కాల్పులకు దిగిన మూక
న్యూఢిల్లీ, జూలై26: మణిపూర్(Manipur)లో హింసాకాండ కొనసాగుతోంది. బుధవారం మోరె జిల్లాలో ఒక మూక 30ఇళ్లు, దుకాణాలను దహనం చేసింది. నివారించటానికి వచ్చిన సాయుధ దళాలపై తుపాకులతో కాల్పులకు తెగబడింది. మయన్మార్(Myanmar) సరిహద్దుకు సమీపంలోని మోరె బజార్‌లో జరిగిన ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమైనా సంభ వించిందా అన్నది ఇంకా తెలియరాలేదు. మరోవైపు మంగళవారం కాంగ్‌పోక్పీ జిల్లాలో ప్రజలను రవాణా చేస్తున్న భద్రతాదళాలకు చెందిన రెండు బస్సులను దుండగులు తగలబెట్టారు. దింపూర్ నుంచి వస్తున్న ఆ బస్సులను దుండగులు సాపోర్మీనియా వద్ద ఆపి ప్రయాణికులను దించివేశారు. తర్వాత బస్సులను కాల్చివేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. మరోవైపు అల్లర్లలో నిరాశ్రయులైన వారికోసం నిర్మిస్తున్న తాత్కాలిక గృహాల నిర్మాణం పూర్తికావచ్చిందని సీఎం బీరేన్‌సింగ్ బుధవారం ట్విటర్‌లో వెల్లడించారు. కాగా మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై అమెరికా దిగ్ర్భాం తి వ్యక్తం చేసింది. ‘మణిపూర్‌లో మహిళలపై జరిగిన దారుణ దాడి వీడియో మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. వారికి న్యాయం జరగటానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నాం’అని అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత పటేల్ తెలిపారు.