Rajnath Singh: దేశం కోసం ఎందాకైనా వెళతాం

ABN , First Publish Date - 2023-07-27T01:19:24+05:30 IST

దేశ గౌరవ, మర్యాదలను కాపాడే విషయంలో ఎందాకైనా వెళ్తామని, అవసరమైతే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను కూడా దాటుతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) పేర్కొన్నారు.

Rajnath Singh: దేశం కోసం ఎందాకైనా వెళతాం

అవసరమైతే నియంత్రణ రేఖనూ దాటుతాం..

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ద్రాస్‌(లద్ధాఖ్‌), జూలై 26: దేశ గౌరవ, మర్యాదలను కాపాడే విషయంలో ఎందాకైనా వెళ్తామని, అవసరమైతే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను కూడా దాటుతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) పేర్కొన్నారు. ఎల్‌ఓసీ దాటాల్సిన పరిస్థితి ఎదురైతే సైన్యానికి సహకరించేందుకు పౌరులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ద్రాస్‌లోని కార్గిల్‌ అమర వీరుల స్థూపం(Kargil Stupa of Immortal Heroes) వద్ద కార్గిల్‌ అమరవీరులకు బుధవారం ఆయన నివాళులర్పించారు. 1999 కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్‌ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్‌ విజయ్‌ దివ్‌స(Kargil Vijay Divas)ను ప్రతీ ఏటా జూలై 26న నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు కార్గిల్‌ అమరవీరులకు బుధవారం నివాళులర్పించారు. పార్లమెంట్‌లోనూ సభ్యులు అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసి కార్గిల్‌లో విజయానికి బాటలు వేసిన అమరవీరులకు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము ట్వీట్‌ చేశారు.


అలాగే కటక్‌లో జరిగిన ఒడిసా హైకోర్టు 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో స్వయంగా పాల్గొన్న రాష్ట్రపతి.. కార్గిల్‌ అమరుల వీరోచిత కథలు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచే భారత అసమాన పోరాట యోధుల సాహసానికి కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిదర్శనమని ప్రధాని మోదీ(Prime Minister Modi) అన్నారు. ఇక ద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. దేశ గౌరవ మర్యాదలను కాపాడేందుకు అవసరమైతే నియంత్రణ రేఖ దాటడానికి కూడా సిద్ధమన్నారు. యుద్ధ పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ సైన్యానికి పరోక్షంగా సహకరిస్తున్న ప్రజ లు యుద్ధభూమిలో సైనికులకు నేరుగా మద్దతుగా నిలిచేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్న వేళ పాకిస్థాన్‌ వెన్నుపోటుకు పాల్పడటంతో కార్గిల్‌ యుద్ధం వచ్చిందన్నారు. నాటి యుద్ధంలో భాగంగా నిర్వహించిన ఆపరేషన్‌ విజయ్‌తో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ ప్రయోజనాలను కాపాడే అంశంలో వెనకడుగు వేసేదేలేదనే సందేశాన్ని సైన్యం పాక్‌తోపాటు ప్రపంచానికి చాటి చెప్పిందని గుర్తు చేశారు. కుటుంబంకంటే దేశమే గొప్పని ప్రాణ త్యాగం చేసిన వీరులందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని తెలిపారు. అమరుల త్యాగాలు వృథా కాలేదని భావితరాల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే మరింత కఠినమైన సవాళ్లు, ప్రమాదాలను ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధం అవుతుందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే విలేకరులతో అన్నారు. ద్రాస్‌లో అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన పాండే కార్గిల్‌ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదన్నారు.

కార్గిల్‌లో మహిళా పోలీసుస్టేషన్‌

కేంద్రపాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో తొలిసారిగా ఓ మహిళా పోలీసు స్టేషన్‌ ప్రారంభమైంది. కార్గిల్‌లో ఏర్పాటు చేసిన ఈ పోలీసు స్టేషన్‌ను లద్ధాఖ్‌ అడిషనల్‌ డీజీపీ ఎస్‌డీ సింగ్‌ జామ్వాల్‌(Singh Jamwal) బుధవారం ప్రారంభించారు. మహిళలపై జరిగే నేరాల కోసం ఈ పోలీసు స్టేషన్‌ ప్రత్యేకంగా పని చేస్తుందని ఏడీజీపీ తెలిపారు. మహిళల భద్రత, హక్కుల రక్షణ అంశా ల్లో సుశిక్షితులైన సుశిక్షితులైన మహిళా సిబ్బంది ఈ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తారు.

Updated Date - 2023-07-27T01:19:24+05:30 IST