Chandrayaan-3: ల్యాండర్, రోవర్‌ల 14 రోజుల కథ.. ఆ కాలపరిమితి వెనుక స్టోరీ ఏంటి? ఆ తర్వాత ఏమవుతుంది?

ABN , First Publish Date - 2023-08-24T21:53:08+05:30 IST

ఇస్రో సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వడం.. ల్యాండర్ నుంచి రోవర్ బయటకొచ్చి తన పని మొదలుపెట్టడం అందరికీ తెలిసిందే. అయితే..

Chandrayaan-3: ల్యాండర్, రోవర్‌ల 14 రోజుల కథ.. ఆ కాలపరిమితి వెనుక స్టోరీ ఏంటి? ఆ తర్వాత ఏమవుతుంది?

ఇస్రో సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వడం.. ల్యాండర్ నుంచి రోవర్ బయటకొచ్చి తన పని మొదలుపెట్టడం అందరికీ తెలిసిందే. అయితే.. వీటి కాలపరిమితి కేవలం 14 రోజులేనని ఇస్రో శాస్త్రవేత్తలు ఆల్రెడీ వెల్లడించారు. ముఖ్యంగా.. ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల్లోనే తన అన్వేషణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది నిర్వీర్యం అవుతుంది. ఇందుకు గల కారణాలేంటో ఇస్రో శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు.

మీరు ఇంటర్‌స్టెల్లార్ సినిమా చూశారా? అందులో మిల్లర్ గ్రహం, భూమి టైమ్‌లైన్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మిల్లర్ గ్రహంలో ఒక గంట గడిపితే.. భూమిలో ఏడు సంవత్సరాలు గడిచిపోతాయి. అలాగే.. భూమి, చంద్రుని టైమ్‌లైన్‌కి తేడా ఉంటుంది. చంద్రుని మీద ఒక్కరోజు (24 గంటలు), 28 భూమి రోజులకి సమానం. ఈ లెక్కన.. చంద్రునిపై ఒక పగటి కాలం, భూమిపై 14 రోజులకి సమానం అవుతుంది. అంటే.. ల్యాండర్, రోవర్ చంద్రునిపై గడిపేది ఒక్క పగటి కాలం మాత్రమే. ఇప్పుడు చంద్రుని మీద ఉన్న ల్యాండర్, రోవర్‌లు సౌరశక్తితో నడుస్తున్నాయి. ఈ పగటి కాలంలో అవి సూర్యుడి నుంచి శక్తి గ్రహించి.. వాటిని విద్యుత్ శక్తిగా మార్చుకొని తమ అధ్యయనాన్ని కొనసాగిస్తాయి.


ఇక 14 రోజులు గడిచిన తర్వాత అంటే చంద్రునిపై పగటి కాలం ముగిశాక అక్కడ పూర్తి చీకటి కమ్ముకుంటుంది. దాంతో అత్యధిక శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రిపోర్ట్స్ ప్రకారం.. అక్కడ రాత్రివేళ ఉష్ణోగ్రత ‘-180’ సెల్సియస్ డిగ్రీలు నమోదవుతుంది. అంతటి చల్లటి వాతావరణంలో రోవర్, ల్యాండర్, పేలోడ్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. అవి పూర్తిగా మంచుతో కప్పబడుతాయి. తద్వారా సోలార్ ప్యానల్స్, బ్యాటరీలు నిర్వీర్యం అవుతాయి. ఒకవేళ 14 రోజుల చంద్రుడిపై సూర్యరశ్మి పడినప్పుడు.. రోవర్ తిరిగి పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. కానీ.. రోవర్ పునరుజ్జీవం పొంది, ల్యాండర్ పని చేయకపోతే మాత్రం ఫలితం ఉండదన్నారు.

కాగా.. గురువారం తెల్లవారుజామున ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకొచ్చింది. ప్రస్తుతం అది చంద్రుని ఉపరితలంపై సంచరిస్తూ.. తన అధ్యయనం మొదలుపెట్టింది. చంద్రునిపై 14 రోజుల పాటు అధ్యయనం చేసి.. ఆ మొత్తం సమాచారాన్ని ఇస్రోకి పంపుతాయి. మొత్తం 14 రోజుల్లో ఈ ప్రాసెస్ ముగుస్తుంది. అక్కడ నీటి వనరులు ఉన్నాయా? లేవా? భవిష్యత్తులో అక్కడ మానవుడు అడుగుపెట్టడానికి అనుకూల వాతావరణం ఉందా? లేదా? అనే అంచనా వేయనుంది.

Updated Date - 2023-08-24T21:53:08+05:30 IST