Hema Kanthamaneni, Neelima Guntu : రేపటి పౌరుల భవితకు వారధి

ABN , First Publish Date - 2023-04-12T00:35:34+05:30 IST

ప్రపంచ దేశాల్లోని పిల్లల అత్యవసరాలను తీర్చడం కోసం వ్యక్తులు, బృందాలు, సంస్థలకు మధ్య ఏర్పడిన వారధి

Hema Kanthamaneni, Neelima Guntu : రేపటి పౌరుల భవితకు వారధి

అభాగ్యులు, నిరుపేదలైన పిల్లలకు బడుల్లో సౌకర్యాల కొరతను తీరుస్తూ, మరీ ముఖ్యంగా వారి విద్యావసరాలకు ఆసరాగా నిలుస్తూ ‘ప్యూపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌’ (ప్యూర్‌) ఎన్‌జీవో వేదికగా కృషి చేస్తున్నారు హేమ కంఠమనేని, నీలిమ గుంటు. అమెరికా నుంచి ‘నవ్య’తో మాట్లాడిన ఈ స్ఫూర్తివంతమైన మహిళలు సంస్థ కార్యకలాపాల గురించి ఇలా వివరించారు.

ప్రపంచ దేశాల్లోని పిల్లల అత్యవసరాలను తీర్చడం కోసం వ్యక్తులు, బృందాలు, సంస్థలకు మధ్య ఏర్పడిన వారధి ‘ప్యూర్‌’. ప్యూర్‌ మిషన్‌లో భాగంగా కొరతలూ, ప్రతికూలతలను కలిగిన స్కూళ్లలో నాణ్యమైన విద్య పిల్లలకు లభించేలా కృషి చేయడంతో పాటు, పిల్లలు పూర్తి పారదర్శకతతో వ్యవహరించేలా, మెరుగైన రేపటి కోసం వైవిద్యమైన సామాజిక ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక మూలాలకు చెందిన పిల్లలను ఎంపిక చేసుకోవడం, అలాగే పేదరికం, జెండర్‌, సెక్సువల్‌ ఓరియెంటేషన్‌, మతం ఆధారంగా పిల్లలు విద్యకు దూరంగా కాకుండా నిర్థారించుకోవడం లాంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటాం. 2016లో మొదలైన ప్యూర్‌ ఇంతింతై వటుడింతై చందంగా కాలక్రమేణా ఎదిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే...

ప్యూర్‌’ మూలాలు ఇలా...

తెలుగువాళ్లైన శైలజా తాళ్లూరి, వాళ్ల అమ్మగారు సంధ్య గొల్లమూడి, అర్చన, దీప.. ఈ నలుగురూ కలిసి ఈ సంస్థను స్థాపించారు. శైలజ, అర్చన, దీప అమెరికాలో ఉంటున్నారు. అయితే ప్యూర్‌ను స్థాపించాలనే ఆలోచన రావడానికి కొన్ని అంశాలు దోహదపడ్డాయని చెప్పాలి. సంధ్య గొల్లమూడి రిటైర్డ్‌ టీచర్‌. ఆవిడ రిటైర్‌ అయిన తర్వాత కూడా స్కూళ్లను సందరిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో పిల్లలు భోజనం చేయడానికి సరైన ప్రదేశాలు లేకపోవడం, పిల్లలు పుస్తకాలు, మంచినీటి కొరతలను ఎదుర్కోవడం ఆవిడ గమనించారు. దాంతో వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ వివరాలన్నిటినీ ఉంచి, నలుగురి సహాయంతో చేతనైనంతగా పేద పిల్లలకు సహాయపడుతూ ఉండేవారు. అయితే భారీగా సహాయసహకారాలు అందించడం ఒక స్వచ్ఛంద సంస్థ వల్లే సాధ్యపడుతుందనే ఆలోచనతో, 2016, మార్చిలో ప్యూర్‌ను స్థాపించారు. అలా ఈ సంస్థ కార్యక్రమాలను భారతదేశంలో సంధ్య గొల్లమూడి, విజయ్‌ భాస్కర్‌, అమెరికాలో అర్చనా కురిమి, దీపా కమలాకర్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంస్థలో నేను 2017లో అడుగు పెట్టాను. అందుకు బలీయమైన కారణం ఉంది.

స్కూళ్లలో పరిస్థితుల మెరుగు కోసం...

నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలు ఎలా పని చేస్తాయో నాకు తెలుసు. 2015లో ఇండియా వచ్చినప్పుడు, నా పిల్లలను వెంట బెట్టుకుని నేను చదివిన స్కూలుకు వెళ్లాను. 30 ఏళ్ల క్రితం స్కూలు పరిస్థితులు ఎలా ఉండేవో అప్పటికీ అలాగే ఉండడం చూసి నా మనసు చలించిపోయింది. బెంచీలు లేకుండా నేల మీద కూర్చుని చదువుకోవడం, తాగునీటి సౌకర్యాలు లేకపోవడం లాంటివి చూసి చాలా బాధ కలిగింది. అమెరికాలో స్వతహాగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉండే నాకు నేను చదువుకున్న స్కూల్లో పరిస్థితుల మార్పు కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకు తగిన వేదిక కోసం భారతదేశంలో వెతకడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో శైలజ ఫేస్‌బుక్‌ ద్వారా ప్యూర్‌ గురించి తెలుసుకున్నాను. ఆవిడకు మెసేజ్‌ పంపినప్పుడు, ప్యూర్‌ యూత్‌ గ్రూపు గురించి వివరించి, దాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను నాకు అప్పగించడం జరిగింది. మొదట్లో సెయంట్‌ జాన్స్‌, ఫ్లోరిడాలో, ఒహాయోలో ప్రారంభించాం. అలా మూడు చాప్టర్లతో మొదలుపెట్టిన ప్యూర్‌ యూత్‌ 40 చాప్టర్లకు చేరుకుంది. అలాగే 400 మంది ఎంబాసిడర్లు ప్యూర్‌ కోసం పని చేస్తున్నారు.

తొమ్మిది దేశాలకు సహాయ పడుతూ...

మేం మా ప్యూర్‌ ద్వారా భారతదేశంతో పాటు ఇథియోపియా, సియర్రా లియోన్‌లోని సిమియన్‌ పర్వత ప్రాంతం, కారీబియన్‌లోని బార్బడోస్‌, ట్రినిడాడ్‌, టొబాగో, అమెరికా.. ఇలా తొమ్మిది దేశాలకు సహాయపడుతూ ఉంటాం. ఈ తొమ్మిది దేశాల్లో చేసే ఫండ్‌ రైజింగ్‌లో ప్రధాన భాగం భారతదేశానికే ఉపయోగిస్తూ ఉంటాం. ఇక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు సహాయపడుతున్నాం. అమెరికాలో స్ర్పింగ్‌, సమ్మర్‌, ఫాల్‌.. ఈ మూడు ప్రాజెక్టుల్లో భాగంగా కృత్రిమ అవయవాల అవసరతలను తీర్చడం, చక్రాల కుర్చీలను సమకూర్చడం కోసం నిధులను సేకరిస్తూ ఉంటాం. అలాగే నిరుపేద పిల్లలు విద్యను అభ్యసించడంలో ఎదుర్కొనే సవాళ్లను తెలుసుకుని, దూరాలు నడిచి స్కూళ్లకు చేరుకునే పిల్లలకు బస్సు సౌకర్యాలు కల్పించడం, వీల్‌ చైర్‌లను సమకూర్చి పెట్టడం, మంచి నీరు లేకపోతే రివర్స్‌ ఆస్మోసిస్‌ ఏర్పాటు చేయడం, ఆడపిల్లలకు శానిటరీ న్యాప్కిన్ల పట్ల అవగాహన కల్పించి స్కూలు మానకుండా చూడడం లాంటివి చేస్తూ ఉంటాం. అలాగే నెలసరి పట్ల పిల్లల్లో నెలకొన్న దురభిప్రాయాన్ని తొలగించి, నిర్భయంగా దాని గురించి మాట్లాడగలిగే ధైర్యాన్ని కల్పించడం, బడి పిల్లల్లో నెలసరి చుట్టూ నెలకొని ఉండే అపోహలు, అవగాహనా లోపాలను తొలగించడం, చదువుకునే స్థోమత లేని పిల్లలకు స్పాన్సర్‌షిప్‌ సదుపాయాలు కల్పించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాం. ఇలా ఒక్క భారతదేశంలోనే 500 స్కూళ్లకు సహాయపడుతూ ఉన్నాం.

ప్యూర్‌ అభ్యాస

ప్యూర్‌ అభ్యాసలో భాగంగా, కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో ప్రజల పూరిళ్లనే స్కూళ్లుగా మార్చి, టీచర్లను పెట్టి తెగలకు సంబంధించిన పిల్లలకు విద్య నేర్పిస్తున్నాం. ట్రైబల్‌ భాషతో పాటు, తెలుగు, ఇంగ్లీషు తెలిసిన టీచర్లు వాళ్లు. అలా సాధారణ స్కూళ్లకు దూరంగా నివసించే పిల్లలకు ప్యూర్‌ అభ్యాస ద్వారా విద్యను అందిస్తున్నాం. అలాంటి 10 నుంచి 15 అభ్యాస సెంటర్లను తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యాణాలో కూడా ఏర్పాటు చేశాం. అలాగే ప్యూర్‌ యూత్‌లో భాగంగా సేకరించే మూడు నిధుల్లో ఒకదాన్ని భారతదేశానికి, రెండవదాన్ని అంతర్జాతీయ దేశాలకు, మూడవదాన్ని స్థానికంగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే నిధులను సేకరించే వాళ్లందరూ పిల్లలే కావడం చెప్పుకోదగిన విశేషం. అభాగ్యులైన పిల్లల కోసం పిల్లలే నిధులను సేకరించడం ప్యూర్‌ ప్రత్యేకత. ఇక నా వివరాలకొస్తే... మాది విజయవాడ దగ్గర జగ్గయ్య పేట. నేను 1999లో పెళ్లి చేసుకుని అమెరికా వచ్చేశాను. ప్రస్తుతం ఐటిలో పని చేస్తున్నాను. మా వారు కూడా ఐటిలోనే ఉన్నారు. ప్రతి పుట్టుకకూ ఒక కారణం ఉంటుంది. నా పుట్టుకకు కారణం అవసరంలో ఉన్నవాళ్లకు సహాయపడడమే అనే విషయాన్ని నేను గ్రహించాను. స్వతహాగా సేవాగుణం కలిగి ఉన్న నాకు ప్యూర్‌ గొప్ప వేదికగా తోడ్పడింది. దీన్లో ఎండాసిడర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తూ, విరాళాలను సేకరిస్తూ ఉంటాను.

-హేమ కంఠమనేని

,

చీఫ్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌, ప్యూర్‌.

మాది గుంటూరు దగ్గరున్న చిలకలూరిపేట. 2010లో నేనూ, మా వారూ హెచ్‌1 వీసా మీద అమెరికాకు చేరుకున్నాం. ప్రస్తుతం నేనొక సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. తర్వాత 2021లో నేను ప్యూర్‌లో రీజనల్‌ కొఆర్డినేటర్‌గా చేరాను. ప్రస్తుతం నాలుగైదు చాప్టర్లకు మెంటర్‌గా పని చేస్తున్నాను. నేనిలా సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితురాలిని అవడానికి కారణం ఉంది. నా 16వ ఏటనే నేను మా నాన్నగారిని కోల్పోయాను. అమ్మ నన్ను ఒంటి చేత్తో పెంచింది. పిల్లలను పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి నేను కూడా పిల్లలకు చేతనైనంత సహాయపడాలనే ఉద్దేశంతో ప్యూర్‌లో చేరిపోయాను. దీపావళి, హాలోవీన్‌ సందర్భాల్లో భారీగా నిధులను సేకరించాం. మేం సేకరించే నిధులన్నీ కచ్చితంగా భారతదేశంలోని పిల్లలకే చేరుతూ ఉంటాయి. ఈ విషయంలో ప్యూర్‌ పరిపూర్ణమైన పారదర్శకతను ప్రదర్శిస్తుంది.

- నీలిమ గుంటు,రీజనల్‌ కొఆర్డినేటర్‌, ప్యూర్‌.

Updated Date - 2023-04-12T02:37:08+05:30 IST