Share News

Atma, Paramatma : ఆత్మ, పరమాత్మ

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:41 AM

మనిషిలో అంతర్గతంగా ఉన్న అత్యంత విలువైన ఆస్తి... ఆత్మ. అందుకనే ఆత్మను శాశ్వతమైనదనీ, అనంతమైనదనీ, విలువ కట్టలేనిదనీ అంటారు. భగవంతుణ్ణి ‘సచ్చిదానంద స్వరూపుడు’గా మనం

 Atma, Paramatma : ఆత్మ, పరమాత్మ

మనిషిలో అంతర్గతంగా ఉన్న అత్యంత విలువైన ఆస్తి... ఆత్మ. అందుకనే ఆత్మను శాశ్వతమైనదనీ, అనంతమైనదనీ, విలువ కట్టలేనిదనీ అంటారు. భగవంతుణ్ణి ‘సచ్చిదానంద స్వరూపుడు’గా మనం పేర్కొంటాం. ‘సత్‌’ అంటే సత్యం. అది పరిపూర్ణమైన సత్యం. ఈ భూమి మీద నదులు, సముద్రాలు, ఎన్నో జలాశయాలు ఉన్నాయి. వీటన్నిటినీ భూమి తనలో ఇముడ్చుకుంది. పర్వతాల నుంచి పరమాణువు వరకూ... ఈ మూలకాలన్నీ భూతత్వంలో అంతర్భాగాలే. భగవంతుడు కూడా అంతే. ఇది సత్యం. సృష్టి జరిగిన, సృష్టి కాబోయే అన్నిటికీ ఆయనే ఆధారం. ఆయన మొదటి గుణం సత్యమైతే... రెండో గుణం- చిత్తం. ఆ చిత్తం ద్వారానే ఆయన సృష్టికార్యాన్ని మొదలుపెట్టాడు. పరమాత్మ మూడో గుణం - ఆనందం. భగవంతుడు తన సంకల్పంలో, సృష్టి రచనలో పొందే భావనే ఆనందం. సత్యం, చిత్తం, ఆనందం... ఈ మూడూ ఒకచోట కలిసినప్పుడు... బ్రహ్మతత్త్వం అవుతాయి. ఈ మూడు ఏకమైనప్పుడు సృష్టి జరుగుతుంది. కేవలం నిశ్శబ్దమే ఉంటుంది. దానిలోని అనుభూతి ఆత్మసాక్షాత్కారం చెందినప్పుడు మాత్రమే అవగతం అవుతుంది. ఆత్మ మానవులలోనే కాదు, జంతువులలోనూ ఉంటుంది. అయితే మానవుల ఆత్మలో మాత్రమే కాంతి ప్రకాశిస్తుంది. ఆ కాంతి ద్వారానే ధర్మం గురించి, భగవంతుడి గురించి, శాశ్వతమైన సత్యం గురించి మనం తెలుసుకుంటాం.

మనిషి తన ఆత్మ గురించి తెలుసుకోకుండా పరమాత్మను చేరలేడు. కళ్ళు లేకపోతే రంగులను ఏ విధంగా గుర్తించలేమో... అదే విధంగా... మనల్ని మనం వ్యక్తీకరించుకోలేకపోతే పరమాత్మను చేరలేం. ఆత్మ అనేది మనలోఉన్న పరమాత్మ ప్రతిబింబం. ఆ ప్రతిబింబం... నిశ్చలంగా ఉన్న నీటిలో సూర్యుడి ప్రతిబింబంలా ఉంటుంది. నీటిలో మనం సూర్యుణ్ణి ప్రతిబింబం రూపంలో చూస్తూ ఉంటాం. కానీ ఆయన నీటిలో కాకుండా ఎక్కడో ఆకాశంలో ఉంటాడు. అదే విధంగా ఆత్మ కూడా చాలా చిన్నదైనప్పటికీ... దాని మూలం అతీతమైనది, అపరిమితమైనది. ప్రవహిస్తున్న నీటి అలలమీద రకరకాల ఆకారాల్లో సూర్యుడు కనిపిస్తున్నా... ఆయన తన స్థానంలో నిలకడగానే ఉంటాడు. ఆయన ప్రతిబింబం తాలూకు ఆకారంలో మాత్రమే మార్పు కనిపిస్తుంది. అద్దం పరిశుభ్రంగా లేకపోతే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. కాబట్టి మన శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం... ఇవన్నీ ఒక అద్దం (పరిశుభ్రమైన ఆత్మ)లా మారాలి. దానికోసం కుండలినీ శక్తిని ఆ పరమాత్మే మనలో ఏర్పాటు చేశాడు. ఆ శక్తి ఆత్మ తాలూకు ప్రతిబింబాన్ని మనం తెలుసుకొనేలా చేస్తుంది. విద్యుచ్ఛక్తిలా మనలోని చక్రాల్లోనుంచి ప్రవహిస్తూ... వాటిని చైతన్య పరుస్తుంది. దీన్ని సహజయోగంలో స్వయంగా అనుభూతి చెంది తెలుసుకోవచ్చు. అందుకోసం మనలోని దీపాలను (ఆత్మ జ్యోతిని) పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన పాపాలు, గత జన్మ కర్మలు, మన అహంకారంతో సహా అన్నీ తుడిచిపెట్టుకొని పోవాలి. మనం చేసే పాపకర్మలన్నీ అహంకారం వల్లే ఏర్పడతాయి. అహంకారం మనల్ని కమ్ముకొని ఉన్నంతకాలం మన ఆత్మదర్శనాన్ని మనం పొందలేం. మనం చేరుకున్న అహంకార శిఖరం దగ్గర ఆగి, వెనక్కు తిరిగి చూసుకొనే సమయం ఆసన్నమయింది. ఆత్మ గురించి తెలసుకొనే ప్రయత్నం చేయకుండా... పనికిరాని, నిర్జీవమైన విషయాల మీద దృష్టి ఉంచుతూ... మనకు మనమే సంకెళ్ళు వేసుకుంటున్నాం. తద్వారా అరిషడ్వర్గాలకు బానిసలవుతున్నాం. ఈ స్థితిలోనే ఆగి... అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నట్టు... ఆత్మావలోకనాన్ని చేసుకోవాలి. అప్పుడు మనలోనే నివసించే... మన ఆత్మకు మూలమైన పరమాత్మను కనుగొనగలుగుతాం.

(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

Updated Date - Dec 29 , 2023 | 06:41 AM