Share News

Organic farming : సేంద్రియంగా ‘ఉన్నతి’...

ABN , Publish Date - Dec 18 , 2023 | 04:17 AM

అరకొర వానలు, ఏఏటికాయేడు పెరిగిపోతున్న వ్యవసాయ పెట్టుబడులు... ఆరుగాలం శ్రమించినా పంట చేతికి వస్తుందో రాదో తెలియని అనిశ్చితి... వీటికి తోడు ఎరువులు, పురుగుల మందుల వల్ల క్షీణిస్తున్న భూసారం...

 Organic farming : సేంద్రియంగా ‘ఉన్నతి’...

అరకొర వానలు, ఏఏటికాయేడు పెరిగిపోతున్న వ్యవసాయ పెట్టుబడులు...

ఆరుగాలం శ్రమించినా పంట చేతికి వస్తుందో రాదో తెలియని అనిశ్చితి...

వీటికి తోడు ఎరువులు, పురుగుల మందుల వల్ల క్షీణిస్తున్న భూసారం...

దీనికి సేంద్రియ పద్ధతులే పరిష్కారంగా గుర్తించిన నిబియా బేగంపూర్‌ గ్రామ మహిళలు దాన్ని ఆదాయ మార్గంగానూ మార్చుకున్నారు.

దేశంలోని అనేక కుగ్రామాల్లో ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లా నిబియా బేగంపూర్‌ ఒకటి. ఇప్పుడు ఆ పల్లెకు చెందిన మహిళల విజయగాథను ఎన్నో ప్రాంతాలు ఆసక్తిగా అధ్యయనం చేస్తున్నాయి. సాధారణంగా మొదలైన ఒక చిన్న ప్రయత్నం అక్కడి మహిళలకు సాధికారతను, ఆర్థిక స్వావలంబనను కల్పించింది. దీనికి రెండేళ్ళ క్రితం బీజం పడింది. ఆ గ్రామానికి చెందిన రామ్‌ ప్యారీ అనే మహిళ ఒక స్వయం సహాయక బృందం సభ్యురాలు. సేంద్రియ వ్యవసాయంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించే ఒక కార్యక్రమంలో భాగంగా... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘అభినవ్‌ - ఎహెచ్‌ఆర్‌డిఓ’ సంస్థను సందర్శించారు. ‘అభినవ్‌’ ఒక సేంద్రియ వ్యవసాయ కన్సల్టెన్సీ. అయిదువందలకు పైగా గ్రామాల్లో సుమారు లక్షమంది రైతులతో కలిసి పని చేస్తోంది. అక్కడే బయో-ఫెర్టిలైజర్లు తయారీ గురించి రామ్‌ ప్యారీ తెలుసుకున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వల్ల రైతుల మీద అపారమైన ఆర్థికభారం పడడంతో పాటు... భూసారం క్షీణిస్తుందనీ, వాతావరణానికి కూడా అవి చేటు చేస్తాయనీ గ్రహించారు. తమ గ్రామానికి వచ్చిన తరువాత... స్థానిక మహిళలతో ఈ విషయాలను పంచుకున్నారు. ‘అంతంత డబ్బు పోసి... హాని చేసే వాటిని కొనడం కన్నా మనమే తయారు చేసుకుంటే మంచిది కదా!’ అని వారందరూ నిర్ణయించుకున్నారు. వాటి తయారీలో సాంకేతిక అంశాలు తెలుసుకోవడానికి ‘అభినవ్‌’ సంస్థ సభ్యుల సాయం తీసుకున్నారు. ఆవు పేడతో బయో ఫెర్టిలైజర్‌, బయో పెస్టిసైడ్‌ ఎలా తయారు చెయ్యాలో నేర్చుకున్నారు. మొదట 22 మంది మహిళలు ‘ఉన్నతి ఆర్గానిక్‌ యూనిట్‌’ పేరుతో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఖర్చులేని ఉత్పాదన...

‘‘ఈ ఉత్పత్తులతయారీ కోసం ముడి పదార్థాలను కొనక్కర్లేదు. వెతకాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉత్పాదనకు ఖర్చు ఉండదు. అన్నీ గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ దొరికేవే. ముందుగా మా గ్రూప్‌లో ఉన్న ప్రతి మహిళ ఇంటి దగ్గరా ఒక చతురస్రాకారపు గోతిని తవ్వించాం. అది దాదాపు 60 కిలోల ఆవు పేడను సేకరించడానికి సరిపోయేలా ఉంటుంది. ఆ పేడలో 200 గ్రాముల కోడి గుడ్డు పెంకులు లేదా సున్నం, 200 గ్రాముల మట్టి, రెండు మోతాదుల ఇతర సేంద్రియ పదార్థాలను కలుపుతాం. వాటివల్ల మట్టి సారం పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని మూడు నెలలపాటు అలాగే వదిలేస్తాం. అది ఎండిపోతుంది. ఆ ఎరువు మట్టిలో కలిసిపోవడానికి సిద్ధమవుతుంది. అరవై కిలోల ఆవు పేడతో పాతిక కిలోల ఎరువు సిద్ధమవుతుంది’’ అని వివరించారు బృందం సభ్యులు. ఈ ఎరువుల ప్రయోజనం గురించి గ్రామంలోని రైతులకు చెప్పినా వారి నుంచి పెద్దగా స్పందన లేదు. ఎట్టకేలకు నరేంద్రకుమార్‌ అనే రైతు వాటిని కొని... తన రెండెకరాల భూమిలో ఉపయోగించాడు. అప్పటివరకూ రెండున్నర క్వింటాళ్ళుగా ఉండే వరి దిగుబడి ఈ సేంద్రియ ఎరువుల వల్ల అయిదు క్వింటాళ్ళకి పెరిగింది. దాంతో మిగిలిన రైతులు కూడా వీటిని కొనడం ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ డిమాండ్‌ పెరగడంతో... మరికొందరు మహిళలు కూడా ముందుకువచ్చి శిక్షణ తీసుకున్నారు. నిబియా బేగంపూర్‌ గ్రామంతో పాటు, అక్కడికి పద్ధెనిమిది కిలోమీటర్ల దూరంలోని బిచ్చాలా గ్రామంలో మరో యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్లను ‘బయో-ఇన్‌పుట్‌ రిసోర్స్‌ సెంటర్స్‌’ (బిఆర్‌సి)గా వ్యవహరిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎరువులతోపాటు అల్లం, వెల్లుల్లి, నీరుల్లి, మిరప ముద్దతో క్రిమి సంహారకాన్ని తయారు చేస్తున్నారు. అలాగే మొక్కల సంరక్షణ కోసం రెండు రకాల పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో ఒకటి వేప తదితర విత్తనాల పొడిని గోమూత్రం నీటితో కలిపి చేసేది కాగా, మరొకటి ఆకుల సారంతో రూపొందుతుంది.

ఆదాతో పాటు ఆరోగ్యం కూడా...

ఈ మహిళల నిబద్ధతను గమనించిన ‘అగాఖాన్‌ ఫౌండేషన్‌’... బిఆర్‌సి యునిట్ల నిర్మాణం, అభివృద్ధి కోసం 14 లక్షల రూపాయల సాయం అందించింది. ‘‘ఈ రెండు కేంద్రాల ద్వారా ఆరు వేలమందికి పైగా రైతులు సేంద్రియ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారు. వాటి ధరలు కిలో అరవై నుంచి వంద రూపాయల లోపే ఉంటాయి. వీటి తయారీలో భాగస్వాములైన మహిళలకు మంచి ఆదాయం వస్తోంది. దీనితోపాటు కొన్ని ఇళ్ళలో బయోగ్యాస్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. వంటకు బయోగ్యా్‌సనే ఉపయోగిస్తున్నాం, దీనివల్ల డబ్బు ఆదా అవుతోంది. ఆరోగ్యానికి కూడా ఇది మంచిది’’ అని చెప్పారు రామ్‌ ప్యారీ. ఇప్పుడు పలు గ్రామాలవారు నిబియా బేగంపూర్‌ను సందర్శించి, వాటి తయారీలో మెళకువలు తెలుసుకుంటున్నారు. తమ ప్రాంతాల్లోనూ అమలు చేస్తున్నారు. ‘‘వ్యవసాయ ఖర్చులు తడిసిమోపడవుతున్న ప్రస్తుత కాలంలో... రైతుకు భారం తగ్గించి, నేల సారాన్ని పెంచే సేంద్రియ ఎరువులు, పురుగులమందుల తయారీని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. దానివల్ల మహిళలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు’’ అని చెబుతున్నారీ సేంద్రియ సారథులు.

Updated Date - Dec 18 , 2023 | 04:17 AM