Bhagavad Gita : కాలానికి అతీతులు
ABN , First Publish Date - 2023-07-20T23:23:25+05:30 IST
భగవద్గీత రెండు స్థాయిల పొందికైన సమ్మేళనం. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఆ స్థాయిల గురించి మనం అవగాహన చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో శ్రీకృష్ణుడు మానవులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను వివరిస్తూ... అర్జునుడికి స్నేహితునిగా లేదా మార్గదర్శిగా వ్యవహరిస్తాడు.
భగవద్గీత రెండు స్థాయిల పొందికైన సమ్మేళనం. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఆ స్థాయిల గురించి మనం అవగాహన చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో శ్రీకృష్ణుడు మానవులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను వివరిస్తూ... అర్జునుడికి స్నేహితునిగా లేదా మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో పరమాత్మలా ఉపదేశిస్తాడు. ‘‘ఒకసారి నేను వివశ్వతుడికి నాశనం లేని యోగాన్ని ఇచ్చాను. అది రాజ-ఋషులకు వారసత్వంగా అందుతూ వచ్చింది. కానీ కాలక్రమేణా అది తన (దృష్టి) దృక్పథాన్ని కోల్పోయింది ’’అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ‘వివస్వతుడు’ అంటే సూర్యభగవానుడు. ఆయన కాంతికి ప్రతీక. ఆ కాంతి కన్నా ముందే తాను ఉన్నానని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు.‘రాజ-ఋషులు’ అంటే ‘వివిధ సమయాలలో జ్ఞానోదయం పొందినవారు’ అని అర్థం చేసుకోవాలి. జ్ఞానం తాలూకు దృష్టి ఇప్పుడు మారింది. మతాలు, సంప్రదాయాల రూపాన్ని సంతరించుకుంది.
‘కృష్ణుడి జన్మ ఇటీవలిది (మహా భారత కాలానిది) కదా! సూర్యుడికి దీన్ని ఎలా బోధించాడు?... ఇదే ప్రశ్న అర్జునుడు వేశాడు. ‘‘మనకు చాలా జన్మలు ఉన్నాయి. వాటి గురించి నీకు తెలీదు. నాకు తెలుసు’’ అని కృష్ణుడు బదులిచ్చాడు. అర్జునుడి ప్రశ్న మానవ స్థాయిలో చాలా సహజమైనదిగా, తార్కికమైనదిగా కనిపిస్తుంది. పుట్టుకకు ముందు, మరణానికి తరువాత ఏమిటనే విషయంలో మనకు ఎలాంటి అవగాహన లేదు. శ్రీకృష్ణుడి సమాధానం... కాలాన్ని అధిగమించిన పరమాత్మ స్థాయిలో ఉంది. అంతకుముందు ఆత్మ గురించి ఆయన వివరిస్తూ... అది శాశ్వతమైనదనీ, మనం చిరిగిన దుస్తులను మార్చుకుంటున్నట్టు అది భౌతిక శరీరాలను మారుస్తుందనీ చెప్పాడు. ఎవరైతే ఆత్మను అవగతం చేసుకొని, శాశ్వతమైన స్థితికి చేరుకుంటారో... వారే కాలానికి అతీతులు.
ఫ కె. శివప్రసాద్, ఐఎఎస్