Share News

Bicycle Grandma : సైకిల్‌ బామ్మ

ABN , First Publish Date - 2023-10-15T23:12:53+05:30 IST

వయసు శరీరానికే కానీ మనసు కాదు అంటూ ఉంటారు. కానీ రెండింటికీ వయసు అడ్డు కాదు అని నిరూపిస్తోంది కర్నాటకు చెందిన 74 ఏళ్ల జ్యోత్స్న కగల్‌. కలలను నిజం

Bicycle Grandma : సైకిల్‌ బామ్మ

వయసు శరీరానికే కానీ మనసు కాదు అంటూ ఉంటారు. కానీ రెండింటికీ వయసు అడ్డు కాదు అని నిరూపిస్తోంది కర్నాటకు చెందిన 74 ఏళ్ల జ్యోత్స్న కగల్‌. కలలను నిజం చేసుకోడానికి వయసు అడ్డు కాదంటున్న జ్యోత్స, ఇప్పటికీ హుషారుగా సైకిల్‌ మీద షికార్లు చేస్తూ కుర్రకారుకు సవాలు విసురుతోంది.

ఉత్తర కర్నాటకకు చెందిన గోకర్ణ దగ్గరున్న బంకికొడ్ల గ్రామంలో నివసించే జ్యోత్స్నకు చిన్నప్పటి నుంచే సైకిల్‌ తొక్కాలనే కోరిక ఉండేది. మగ పిల్లలు, పురుషులు తన ముందే రయ్యిమంటూ సైకిళ్ల మీద దూసుకువెళ్తుంటే, 14 ఏళ్ల జ్యోత్స్న అలాగే ఆశ్యర్యంగా చూస్తూ ఉండిపోయింది. వాళ్లలా సైకిల్‌ తొక్కేద్దామంటే ఆవిడ దగ్గరేమో సైకిల్‌ ఉండేది కాదు. దాంతో పొరుగింటి వాళ్ల నుంచి అరువు తెచ్చుకుని, సొంతంగానే సైకిల్‌ తొక్కడం నేర్చేసుకుంది. సైకిల్‌ తొక్కాలనే ఆవిడ కోరిక వయసుతో పాటు పెరిగిందే తప్ప తరగలేదు. తన అభిరుచిని ఆనందిస్తూనే ఇతరులకు స్ఫూర్తివంతంగా మారిన జ్యోత్స్న, 1968లో అంగన్‌వాడీ వర్కర్‌గా ఉనప్పుడు ఆడపిల్లల సైకల్‌ కొనుక్కోగలిగింది. అప్పటివరకూ ఆవిడ మందు మగపిల్లల కోసమే డిజైన్‌ అయిన, ముందు వైపు హ్యాండిల్‌ బార్‌ను కలిగి ఉండే మగపిల్లల సైకిల్‌నే తొక్కుతూ ఉండేది. ఆ తర్వాత 1988లో మరో కొత్త సైకిల్‌కు అప్‌గ్రేడ్‌ అయింది. అప్పుడు కొన్న ఆ సైకిల్‌నే ఆవిడ ఇప్పటికీ తొక్కుతూ ఉండడం విశేషం. 1976లో జ్యోత్స్న సైకిల్‌ తొక్కుతూనే ఒక దొంగను కూడా పట్టుకోగలిగింది.

Untitled-1-copy.jpg

చీరకట్టులోనే....

సైకిల్‌ తొక్కడానికి చీర అడ్డుకాదని కూడా నిరూపించగలిగింది జ్యోత్స్న. ఒక సైనికుడిని వివాహం చేసుకున్నప్పటికీ, పెళ్లయ్యాక కూడా సైకిల్‌ తొక్కడం మీదున్న తన ఇష్టాన్ని ఆవిడ వదులుకోలేదు. ఆవిడ కొడుకు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అంగన్‌వాడి వర్కర్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత, ఆవిడ పోస్టల్‌ ఆర్‌డి డిపాజిట్‌ కలెక్టర్‌గా పని చేయడం మొదలు పెట్టింది. వృత్తిలో భాగంగా ఆవిడ ప్రభుత్వ అందించే నెలసరి ఆదాయాన్ని ఎలా పొదుపు చేయాలో సాటి మహిళలకు నేర్పిస్తూ ఉంటుంది. ఉదయాన్నే యోగా, ధ్యానం ముగించి, తన సొంత పొలం పనులు మొదలు పెడుతుంది. పనులు పూర్తయ్యాక తిరిగి సైకిల్‌ మీద ఇంటింటికీ తిరుగుతూ డిపాజిట్లను సేకరిస్తుంది. గోకర్ణలోని మహాబలేశ్వర కో ఆపరేటివ్‌ సొసైటీకి ఈవిడ తొమ్మిదేళ్ల పాటు తొలి మహిళా ప్రెసిడెంట్‌గా సేవలు కూడా అందించడం మరో విశేషం.

సైకిల్‌ పట్ల తనకున్న మక్కువ గురించి వివరిస్తూ.... ‘‘వ్యాధులు దరి చేరకుండా సైకిల్‌ నన్ను కాపాడింది. ఈ సైకిలే లేకుండా నా జీవితం ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా సాగి ఉండేది కాదు’’ అంటూ వివరించిన జ్యోత్స్న ప్రాణమున్నంతవరకూ తాను తన పనులన్నిటినీ సైకిల్‌ తొక్కుతూనే చక్కబెడతానని అంటోంది.

Updated Date - 2023-10-15T23:12:53+05:30 IST