Counselling : ఈ నొప్పులు తప్పించుకోలేనా?

ABN , First Publish Date - 2023-01-29T23:47:37+05:30 IST

డాక్టర్‌! నా వయసు 18 ఏళ్లు! 14 ఏళ్ల వయసులో తొలి నెలసరి కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి నెలా నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పి,

 Counselling : ఈ నొప్పులు తప్పించుకోలేనా?

డాక్టర్‌! నా వయసు 18 ఏళ్లు! 14 ఏళ్ల వయసులో తొలి నెలసరి కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి నెలా నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. ఎన్ని మందులు వాడినా ఫలితంలేదు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందే సులువైన చికిత్స సూచించగలరు!

- ఓ సోదరి, కర్నూలు

స్త్రీల జీవితంలో కీలకమైన దశ ఇది. మహిళగా మారే క్రమంలో ఈ దశలోనే పునరుత్పత్తి వ్యవస్థ పూర్తి ఎదుగుదలకు చేరుకుంటుంది. అయితే కొందరు టీనేజీ అమ్మాయిలకు నెలసరి సమయంలో శారీరక అసౌకర్యం కలగడం సహజం. అయితే భావోద్వేగాలు అదుపు తప్పడం, నడుము, కాళ్లలో నొప్పులు, తలనొప్పి, అలసట మొదలైన అసౌకర్యాలు శరీర తత్వాలనుబట్టి మారుతూ ఉంటాయి.

త్రిదోష నెలసరి లక్షణాలు

వాత తత్వం కలిగినవారికి నెలసరి ముందు నుంచి, లేదా నెలసరి మొదలైన వెంటనే విపరీతమైన నొప్పులు మొదలవుతాయి. పొత్తికడుపు, నడుములో తెరలు తెరలుగా నొప్పులు మొదలై కదలలేనంతగా పెరిగిపోతాయి. పిత్త దోషం కలిగిన వారిలో నెలసరి ముందు కాకుండా రక్తస్రావం పెరిగిన వెంటనే నొప్పులు కూడా మొదలవుతాయి. పెద్ద రక్తపు గడ్డలు కనిపిస్తాయి. రాత్రివేళ విపరీతమైన రక్తస్రావంతో మెలకువ వస్తుంది. రక్తస్రావం సమయంలో తలతిరుగుడు, అయోమయం ఉంటుంది. కఫ దోషం ఉన్న వారిలో నొప్పి తక్కువగానే ఉన్నా, తల భారంగా ఉంటుంది. మానసిక అయోమయం, గందరగోళం ఉంటుంది. అలసట కనిపిస్తుంది. ఈ లక్షణాలు నెలసరి మొదలైన క్షణం నుంచీ ఉండి, క్రమేపీ తగ్గుతాయి.

నెలసరి నొప్పులు తగ్గాలంటే?

మానసిక, శారీరక అసౌకర్యాలు భరించలేనంతగా ఉంటే, ఉపశమనం కోసం ఆయుర్వేద చిట్కాలను పాటించవచ్చు. అవేంటంటే.....

నువ్వుల నూనె మర్దన: ఆయుర్వేద అభ్యంగన స్నానం కోసం ఈ నూనె వాడతారు. దీన్లోని లినోలిక్‌ యాసిడ్‌కు, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. విషాలను హరించే తత్వం కూడా ఈ నూనెకు ఉంటుంది. కాబట్టి నెలసరి సమయంలో ఈ నూనెతో పొత్తికడుపు మీద సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది.

మెంతుల మహిమ: కాలేయం, మూత్రపిండాలు, మెటబాలిజంకు మెరుగైన ఔషధం మెంతులు. వీటితో నెలసరి నొప్పులు కూడా తగ్గుతాయి. కాబట్టి 2 టీస్పూన్ల మెంతులను 12 గంటలపాటు నీళ్లలో నానబెట్టి తాగాలి.

వేడి కాపడం: పొత్తికడుపు మీద వేడి కాపడం పెడితే గర్భాశయ కండరాలు ఉపశమనం పొంది నొప్పులు తగ్గుతాయి. కాబట్టి వేడి నీళ్లు నింపిన బాటిల్‌ను పొత్తికడుపు మీద ఉంచి కాపడం పెట్టాలి. వేడి జావ తాగినా, వేడి నీళ్ల స్నానం చేసినా కూడా ఫలితం దక్కుతుంది.

వ్యాయామంతో ఉపశమనం: నొప్పితో మంచానికే అతుక్కుపోయే బదులు, వ్యాయామంతో ఒళ్లు కదిలిస్తే కటి ప్రదేశానికి రక్తప్రసరణ పెరిగి నొప్పులు తగ్గుతాయి. నెలసరి సమయంలో మూత్రాశయ కండరాలు కుంచించుకుపోయేలా చేసే హార్మోన్లను నెమ్మదించేలా చేసే ఎండార్ఫిన్లు వ్యాయామం చేస్తే విడుదలవుతాయి. కాబట్టి ఈ సమయంలో తేలికపాటి వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఆ మూడు రోజులే కాకుండా దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పిస్తే క్రమేపీ నెలసరి నొప్పులు అదుపులోకి వస్తాయి.

శొంఠి, మిరియాల టీ: శొంఠి, మిరియాల పొడి కలిపిన నీళ్లను వేడి చేస్తే హెర్బల్‌ టీ తయారవుతుంది. దీన్లో పాలు కలపకుండా తాగితే, నొప్పులకు కారణమయ్యే హార్మోన్ల పరిమాణం తగ్గి నొప్పులు తగ్గుతాయి. ఈ టీ వల్ల నెలసరి సమస్యలు కూడా సరి అవుతాయి. అలసట కూడా వదులుతుంది.

జీలకర్ర వైద్యం: జీలకర్ర వేసి మరిగించిన నీళ్లు తాగినా ఫలితం ఉంటుంది.

ఛామొమైల్‌ టీ: ఈ పువ్వులు వేసి కాచిన నీళ్లు తాగితే పొత్తికడుపు, నడుము నొప్పులు తగ్గుతాయి. ఈ పూలలోని ఔషధ గుణాలు కూడా గర్భాశయాన్ని కుంచించుకుపోయేలా చేసే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి.

కప్పు పాలలో, దంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు, పసుపు, తేనె, మిరియాల పొడి వేసి వెల్లుల్లి రెబ్బలు ఉడికేవరకూ కాచాలి. ఈ పాలను తాగి, వెల్లుల్లి రెబ్బలను నమిలేయాలి. ఇలా క్రమంతప్పకుండా 3 రోజలు చేసినా నెలసరి నొప్పులు తగ్గుతాయి.

ఈ జాగ్రత్తలు పాటించాలి

భోజనంలో చక్కెర, మైదా, శుద్ధి చేసిన పదార్థాలు, కృత్రిమ రంగులు, రుచులు మానేయాలి.

బియ్యం, పాస్టా, బ్రెడ్‌ వాడకం మానేయాలి.

ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. ఉప్పు శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. దాంతో నెలసరి సమయంలో ఒళ్లు మరింత బరువై బద్ధకం ఆవరిస్తుంది.

కాఫీ కూడా బాగా తగ్గించాలి. కెఫీన్‌ వల్ల నెలసరి నొప్పులు ఎక్కువవుతాయి.

ప్రతి రోజూ పరగడుపున నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి.

నెలసరి ద్వారా పోయే రక్తం ద్వారా క్యాల్షియం శరీరం నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి పాలు, పెరుగు, నువ్వులు, ఆకుకూరలు తప్పక తీసుకోవాలి.

రోజుకి కనీసం 8 గంటల నిద్ర తప్పనసరి. నిద్రతో శరీరం ఉపశమనం పొందుతుంది. ఫలితంగా నొప్పులూ అదుపులోకి వస్తాయి.

నట్స్‌, సీడ్స్‌ తిని, ఏరోబిక్‌ వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై నొప్పులు తగ్గుతాయి.

డాక్టర్‌ రాంప్రకాశ్‌

సంహిత ఆయుర్వేద చికిత్సా కేంద్రం,

హైదరాబాద్‌

Updated Date - 2023-01-29T23:47:39+05:30 IST