ప్రొటీన్ పౌడర్లతో ప్రమాదమా?
ABN , First Publish Date - 2023-02-15T23:26:53+05:30 IST
నేను జిమ్‌కి వెళ్తూ ఉంటాను. వ్యాయామాలు చేసే ప్రతి ఒక్కరూ ప్రొటీన్ పౌడర్లు వాడక తప్పదా? అలాగే హార్మోన్ల హెచ్చుతగ్గులను సరిచేయడం...
డాక్టర్! నేను జిమ్‌కి వెళ్తూ ఉంటాను. వ్యాయామాలు చేసే ప్రతి ఒక్కరూ ప్రొటీన్ పౌడర్లు వాడక తప్పదా? అలాగే హార్మోన్ల హెచ్చుతగ్గులను సరిచేయడం కోసం మా జిమ్ ఇన్‌స్ట్రక్టర్ రీసైక్లింగ్ ఇంజెక్షన్లు సూచిస్తున్నారు. వీటితో ఏదైనా ప్రమాదం ఉంటుందా?
- ఒక సోదరి, హైదరాబాద్
వ్యాయామాలు చేసే ప్రతి ఒక్కరూ ప్రొటీన్ పౌడర్లు తప్పనిసరిగా వాడాలనే నియమమేమీ లేదు. సాధారణ కార్డియో వ్యాయామాలు చేసేవారు, తక్కువ బరువులతో కూడిన వ్యాయామాలు చేసేవారు ప్రొటీన్ ఫుడ్‌తో సరిపెట్టుకోవచ్చు. అయితే అధిక బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేవారికి శరీరంలో టెస్టోస్టెరాన్ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి అదనపు ప్రొటీన్ అవసరం. ఆహారం ద్వారా అంతటి ప్రొటీన్‌ను భర్తీ చేయడం కష్టం కాబట్టి పౌడర్ రూపంలోని ప్రొటీన్ తీసుకోవలసి ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ ప్రొటీన్ పౌడర్లలో స్టెరాయిడ్ల కల్తీ జరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రొటీన్ పౌడర్లలో కూడా స్టెరాయిడ్ అవశేషాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని తీసుకునేవాళ్లు తప్పనిసరిగా ప్రతి నెలా హార్మోన్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. పరీక్షలో హార్మోన్ల హెచ్చుతగ్గులు కనిపిస్తే ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం ఆపేయాలి. వీటికి బదులుగా ఆహారం ద్వారా అధిక ప్రొటీన్ అందేలా చూసుకోవాలి.
అలాగే క్రమం తప్పకుండా వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేసేవారికి కొన్ని రోజులు ప్రొటీన్ పౌడర్లు వాడుతూ, కొన్ని రోజులు రీసైక్లింగ్ ఇంజెక్షన్లు ఇచ్చే సంప్రదాయాన్ని కొందరు జిమ్ ఇన్‌స్ట్రక్టర్లు అనుసరిస్తూ ఉంటారు. హార్మోన్లలో హెచ్చుతగ్గులను సమంగా ఉంచడం కోసం ఆచరించే ఇలాంటి స్వీయ పద్ధతులు ప్రమాదకరం. కొందరికి ఎటువంటి సమస్యలూ ఎదురుకాకపోవచ్చు కూడా! అయితే ఈ ఇంజెక్షన్లు తీసుకునేవాళ్లు ప్రతి నెలా హార్మోన్ పరీక్షలు చేయించుకుంటూ ఫలితాన్ని గమనించుకుంటూ ఉండాలి. హార్మోన్లలో ఏమాత్రం తేడాలు కనిపించినా ప్రొటీన్ పౌడర్లు, రీసైక్లింగ్ ఇంజెక్షన్లు తీసుకోవడం ఆపేసి, విషయాన్ని వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. హార్మోన్ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి కావు కాబట్టి ఈ పరీక్షలను అలక్ష్యం చేయకూడదు.
డాక్టర్ రాహుల్ రెడ్డి
ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్