Share News

Parvinder Chawla : వైకల్యం ఆపలేకపోయింది...

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:05 AM

కొందరు అపజయాన్నే విజయంగా మలుచుకుంటారు. ఏమీలేకున్నా.. గుండె ధైర్యంతో ఓటమినే ఓడిస్తారు. అలాంటి వ్యక్తే.. పర్విందర్‌ చావ్లా. రుమటాయిడ్‌ ఆర్థరైటి్‌సతో కుర్చీకే పరిమితం అయినా.. ఆమె రూట్‌ మ్యాప్‌ మాత్రం

Parvinder Chawla : వైకల్యం ఆపలేకపోయింది...

కొందరు అపజయాన్నే విజయంగా మలుచుకుంటారు. ఏమీలేకున్నా.. గుండె ధైర్యంతో ఓటమినే ఓడిస్తారు. అలాంటి వ్యక్తే.. పర్విందర్‌ చావ్లా. రుమటాయిడ్‌ ఆర్థరైటి్‌సతో కుర్చీకే పరిమితం అయినా.. ఆమె రూట్‌ మ్యాప్‌ మాత్రం మార్చుకోలేదు. సోలోగానే ఏకంగా 59 దేశాలను తిరిగేసింది. ఈ సాహసి గురించి కొన్ని సంగతులు..

పర్విందర్‌ చావ్లా ఇన్‌స్టా చూస్తే.. ‘ఆన్‌ మై వీల్స్‌.. జస్ట్‌ టు సీ’ అని ఉంటుంది. వీల్‌ చైర్‌ అండ్‌ ఐ హ్యాష్‌ట్యాగ్‌ను తన ఇన్‌స్టా పరిచయంలో రాసుకున్న ఆమె ఫొటోలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. సాధువుల దగ్గరనుంచి స్టార్స్‌ వరకూ దిగిన ఫొటోలు కనపడతాయి. వివిధ దేశాల్లో తన ఫొటోలు, జంతువులు, పిల్లలతో తీసుకున్న ఫొటోలు కనిపిస్తాయి. ఈ ఫొటోలను చూస్తే ‘ఆన్‌ మై వీల్స్‌ జస్ట్‌ టు సీ’ వాక్యం.. ఆమె పర్ఫెక్ట్‌గా రాసుకుందనిపిస్తుంది.

అప్పుడే నిర్ణయం తీసుకున్నా..

ముంబైకి చెందిన పర్విందర్‌ చావ్లాను తన ఇంట్లో ముద్దుగా పమ్ము అని పిలుచుకునేవారు. చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది. బాగా ఆడుకునేది. ఇంట్లో కంటే ఆటస్థలంలో ఎక్కువగా ఉండేది. అలాంటి అమ్మాయికి టీనేజ్‌లోకి వచ్చాక సమస్య మొదలైంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్లినా ఉపయోగం లేకపోయింది. ఇరవై ఒకటో సంవత్సరంలో తనకు రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌ ఉందని తేల్చిచెప్పారు వైద్యులు. కీళ్లు, ఎముకలు పనిచేయకపోవటం.. కండరాలు కదలకపోవటం వల్ల ఎంతో బాధ అనుభవించింది. ఆసుపత్రి బెడ్‌పై చాలా రోజులు ఉంది. ఆ తర్వాత ఇంట్లో. అప్పటి నుంచి వీల్‌చైర్‌ మాత్రమే శరణ్యం. ఖాళీగా బెడ్‌మీద పడుకున్నప్పుడు తన జీవితమేంటో అర్థమైంది. అర్ధాంతరంగా నిలిచిపోకూడదు.. అనుకుంది. అప్పుడే ఇతర దేశాలకు వెళ్లాలనే కలలు కనింది. ఎలాగైనా వీల్‌చైర్‌తోనే దేశాలను తిరగాలనుకుంది.

అలా సరికొత్త ప్రపంచంలోకి..

‘నేను ఇక నడవలేను అనుకున్నప్పుడే నా రూట్‌మ్యాప్‌ క్లారిటీగా అర్థమైంది’ అంటుంది పర్విందర్‌ చావ్లా. బెడ్‌మీద ఉన్నప్పుడు తన తల్లి ‘నువ్వు ఏదో గొప్ప పని చేస్తావు. దేవుడి మీద నమ్మకం ఉంది. ఇంతటితో నీ జీవితం ఆగదు’ అంటూ మోడివేట్‌ చేసింది. ‘తొలిసారి మిత్రులతో వైష్ణోదేవి ఆలయం చూడటానికి వీల్‌చైర్‌లో వెళ్లా. అప్పుడే జీవితం కొత్తగా అనిపించింది. సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. శారీరక సమస్య కానీ, వీల్‌చైర్‌ జీవితం కానీ నన్ను ఆపలేదు అని ఆరోజే అనుకున్నా’ అంటుంది పర్వీందర్‌.

ప్రయాణాలతో ధైర్యం...

దుబాయ్‌కు తన తోడబుట్టుతో కలసి పర్వీందర్‌ వెళ్లింది. అక్కడే తన కజిన్‌ ఆటోమేటిక్‌ వీల్‌చైర్‌ను బహుమతిగా ఇచ్చింది. అదే ఆమెకు టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఆ తర్వాత సోలోగా తిరగటం ప్రారంభించింది. ఆమె మెడిసిన్స్‌తో పాటు బోలెడంత కాన్ఫిడెన్స్‌ను తీసుకెళ్లేది. అదే ఆమెకు సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేలా చేసింది. సాధారణంగా ఒంటరిగా వెళ్లటం అంటే గగనమే. అయితే ఆమె అవేమీ పట్టించుకోలేదు. ‘నీవు సొంతంగా పనిచేసుకో. ఇండిపెండెంట్‌గా ఎలా బ్రతకాలో నేర్చుకో’ అని చెప్పే తన తండ్రి మాటలే ఆమెకు వేదవాక్యాలు. మనదేశంలో పలు పట్టణాల్లో ట్రావెల్‌ ఎక్స్‌ప్లోర్‌ చేసింది. భూటాన్‌, దుబాయ్‌, ఒమన్‌, వియత్నాం.. ఇలా 59 దేశాలు తిరిగింది పర్వీందర్‌. వీల్‌చైర్‌ ఫ్రెండ్లీ ఉందా? లేదా అని పలుసార్లు చెక్‌ చేసుకున్నాకే ఆ దేశానికి వెళ్లేది. ‘ఎప్పటిలానే కొత్త దేశం అనే ఉత్సాహంతో ఇటలీకి వెళ్లాను. అక్కడ ఆ హోటల్‌లో వీల్‌చైర్‌ ఫ్రీ అన్నారు. అక్కడికి వెళ్లాక చూస్తే.. స్టెప్స్‌ ఎక్కి వెళ్లమన్నారు. ఎవరూ సాయం చేయలేదు. కిందనే ఉంటే మా అతిథులకు ఇబ్బంది’ అన్నారు. ‘అయితే ఆ రోజు కష్టపడినా.. అదో సవాల్‌. నాకు మరికొంత శక్తిని ఇచ్చింది. పరిస్థితులు అన్నీ మనకు నచ్చినట్లు ఉండవు కదా’ అంటుంది ఈ యాభై నాలుగేళ్ల పర్విందర్‌. ‘జనాలు చాలా చోట్ల మంచిగా ఉంటారు. ఎవరినైనా సరే సాయం అడిగితే.. తప్పకుండా చేస్తారు. అడగటానికి సిగ్గుగా ఫీలవ్వద్దు. అందుకే నాలా కుర్చీకి పరిమితమైన వాళ్లు.. ఏ దేశానికైనా వెళ్లవచ్చు. ఇపుడు పరిస్థితులు మారాయి. మనదేశంలో కూడా వీల్‌చైర్‌ ఫ్రెండ్లీ హోటల్స్‌ చాలా ఉన్నాయి. మీ ధైర్యమే. మీ ప్రపంచం’ అంటారు పర్వీందర్‌.

Updated Date - Dec 28 , 2023 | 03:05 AM