ప్రయాణాన్నిఆస్వాదిస్తున్నా!

ABN , First Publish Date - 2023-04-19T00:28:43+05:30 IST

రాజమండ్రి. నాకో అన్నయ్య ఉన్నారు. మా కెరీర్‌ విషయంలో పేరెంట్స్‌ ఎప్పుడూ కలగచేసుకోలేదు.

ప్రయాణాన్నిఆస్వాదిస్తున్నా!

స్వతహాగా గాయని. మోడలింగ్‌, కమర్షియల్‌ యాడ్స్‌తో పాటు సీరియల్‌, సినిమాల్లో నటించారు కూడా. ఇంటర్‌లోనే టీవీ యాంకర్‌ అయ్యారు.. ఆమే.. ప్రత్యూష సాధు. మహిళా క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ప్రెజంటేటర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌కు తెలుగు ప్రెజెంటర్‌గా పని చేస్తోన్న ప్రత్యూష తన కెరీర్‌తో పాటు జీవిత

విశేషాల్ని ‘నవ్య’తో పంచుకున్నారిలా..

‘‘ప్రస్తుతం ఐపీఎల్‌కు ప్రెజంటర్‌గా పని చేయటం ఆనందం. ముంబైలో పన్నెండు భాషలకు చెందిన స్పోర్ట్స్‌ ప్రెజెంటేటర్లుతో కలసి పని చేయటం అద్భుతమైన అనుభూతి. తెలుగు ప్రెజంటేటర్‌గా క్రీడా విశ్లేషకులను, క్రీడాకారులను ప్రశ్నలు అడగటం, చర్చలు, లైవ్‌ ప్రోగ్రామ్స్‌ చేయటం.. లాంటివి ఛాలెంజింగ్‌. ఒకప్పుడు క్రికెట్‌ను వీక్షకురాలిగా చూసేదాన్ని. ఇపుడు పూర్తిగా విభిన్నమైన పని ఇది. ఆట గురించి లోతుగా అధ్యయనం చేయటంతో పాటు క్రికెటర్స్‌ ప్రతిభను దగ్గరగా చూసి తెలుసుకుంటున్నా. అసలు ఫలానా క్రికెటర్లు ఏ సామాజిక పరిస్థితుల నుంచి వచ్చారు? ఎలాంటి కష్టాలను అధిగమించి విజయాలు సాధించారు? లాంటి విషయాలు తెలుసుకుంటుంటే ఉద్విగ్నంగా ఉంటుంది. ఇకపోతే ఇటీవలే మహిళా ప్రీమియర్‌ లీగ్‌కు నేనే ప్రెజంటేటర్‌గా పని చేసే అవకాశమూ దక్కింది.

అందుకే సంతోషం...

వాస్తవానికి ఐపీఎల్‌లో స్పోర్ట్స్‌ ప్రెజంటేటర్‌ అవకాశం మూడేళ్ల కిందటే వచ్చింది. అయితే అప్పటికే కొన్ని పనుల్లో బిజీగా ఉండటంతో ఇటు రాలేకపోయా. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది అవకాశం దక్కడంతో హ్యాపీగా ఫీలయ్యా. అదే ఫీలింగ్‌ ప్రతి రోజూ కొనసాగుతోంది. క్రికెట్‌ ఆట చూడటం వేరు. ప్రెజంటేటర్‌గా పని చేయటం వేరు. మ్యాచ్‌లతో పాటు అనేక బ్యాక్‌గ్రౌండ్‌ విశేషాల్ని తెలుసుకోవాలి. సబ్జెక్టు చదవాలి. క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ డిష్కషన్స్‌లో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. యాంకరింగ్‌తో పోలిస్తే ఇదో కొత్త ఛాలెంజ్‌. అన్ని జట్ల క్రికెటర్లతో పాటు సబ్‌స్టిట్యూట్స్‌ గురించి కూడా తెలుసుకోవాలి. నాలెడ్జితో పాటు అప్‌డేట్‌ కావాలి. మొత్తానికి ఇదో బరువైన బాధ్యత. అందుకే హోమ్‌ వర్క్‌ చేయాలి. సబ్జెక్ట్‌ మీద ఆసక్తి పెంచుకుంటున్నా. పూర్తిగా ఈ కెరీర్‌ కొత్తగా ఉంది. ఎంతో నేర్చుకున్నా... హుషారుగా ఉండాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఏదేమైనా స్పోర్ట్స్‌ ప్రెజెంటేటర్‌గా సహనం వచ్చింది. చాలామందికి మనదేశంలో సినిమా, క్రికెట్‌ రెండు కళ్లు. ఈ రంగాల్లో పని చేయటం హ్యాపీ.

ఇంటర్‌లో యాంకరింగ్‌...

బాల్యం నుంచీ సంగీతమంటే ఇష్టం. పాటలు పాడటం, డ్యాన్స్‌ చేస్తూ.. నన్ను నేను మర్చిపోతా. కల్చరల్‌ యాక్టివిటీస్‌ తగ్గించి బాగా చదవమన్నారు పేరెంట్స్‌. దీంతో ఆర్ట్స్‌లో స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌ సాధించా. అన్నట్లు సరిగ్గా ఇంటర్‌లో ఉన్నప్పుడే జెమినీ టీవీలో ‘నీకోసం..’ అనే కార్యక్రమంలో యాంకర్‌గా కనిపించా. ఆ తర్వాత సి.ఏ. ఫౌండేషన్‌లో చేరా. అది కుదరక.. డిగ్రీ చేరా. ఆ సమయంలో ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌సలో చురుగ్గా ఉండేదాన్ని. దీంతో ఎన్‌సీసీలో జాతీయస్థాయిలో ఆల్‌రౌండర్‌ అవార్డులు సాధించా. ఆ తర్వాత ఎమ్‌.బీ.ఏ.లో జాయినయ్యా. క్యాంప్‌సలోనే బ్యాకింగ్‌ రంగానికి అనుసంధానమైన ఎమ్‌ఎన్‌సీ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఎందుకో.. ఉద్యోగం ఫార్మాట్‌ నచ్చలేదు. అప్పుడే దూరదర్శన్‌లో ‘వాయిస్‌ ఆఫ్‌ ఆంధ్ర’ కార్యక్రమంలో యాంకరింగ్‌ చేసే అవకాశం దక్కింది. సరిగ్గా ఆ సమయంలో కాన్సెప్ట్స్‌ రాసేదాన్ని. అలా వాణిజ్య ప్రకటనలకు స్ర్కిప్టు రాశా. దీంతో నేనే స్వయంగా ‘క్రియేటివ్‌ స్పీషియస్‌’ అనే సంస్థ నెలకొల్పి అడ్వర్టయిజింగ్‌, బ్రాండింగ్‌ చేసేదాన్ని. ఏడేళ్లపాటు ఈ వ్యాపారం కొనసాగింది. ఆ తర్వాత సీరియల్స్‌, సినిమాల్లో అవకాశం రావటం.. పెళ్లి కావటంతో.. పూర్తిగా ఇటొచ్చా. మొత్తానికి అలా నేనో రోలర్‌ కోస్టర్‌ రైడర్‌ను (నవ్వుతూ).

అదే నా స్ర్టెస్‌ బస్టర్‌..

2018లో ఎన్టీయార్‌ బయోపిక్‌ ‘కథానాయకుడు’లో కీరవాణి దర్శకత్వంలో ‘తెలుగోడా..’ పాటలో ఇతరులతో కలసి పాడాను. అందులో నటించా కూడా. దీంతో దర్శకుడు క్రిష్‌ ‘కాంచనమాల’ సీరియల్‌లో టైటిల్‌ రోల్‌లో నటించే అవకాశం ఇచ్చారు. కాంచనమాల పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత రామ్‌ హీరోగా నటించిన ‘రెడ్‌’, ‘శ్రీకారం’ చిత్రాల్లో నటించా. వీటితో పాటు వస్త్రదుకాణాలు, బిర్యానీ హోటల్స్‌.. లాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించా. మోడలింగ్‌ చేశా. ‘బోల్‌ బేబీ బోల్‌’, ‘సామజవరగమన’ పాటల కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పని చేశా. సినిమాలతో పాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ పాటలతో కలిపి ఆరువందల పాటలకు కోర్‌సలు పాడాను. కోరస్‌ పాడేప్పుడు.. కోఆర్డినేషన్‌ తెలుస్తుంది. అసలు సమయమే తెలిసేది కాదు. అదో అందమైన, అద్భుతమైన ప్రపంచం. ఇప్పటికీ మానసిక స్థితి ఎలా ఉన్నా.. ఓ సాంగ్‌ పాడుకుంటే అన్నీ మర్చిపోతా. ఒక్కమాటలో పాటలు పాడుకోవటమే నా స్ర్టెస్‌బస్టర్‌. ఒకప్పుడు మంచి గాయని కావాలనే కల ఉండేది. అయితే అందుకు అదృష్టం కూడా జత అవ్వాలి కదా! కరోనా అనంతరం చిన్న చిన్న లక్ష్యాలు అనుకుంటూ సాఫీగా, హ్యాపీగా అడుగులేస్తున్నా.

ఎక్కడ ఉంటే అక్కడ వందశాతం పని చేయటమే వచ్చు. ఇదే నా లైఫ్‌ ఫండా! ఏదేమైనా ఎక్కడ పని చేసినా ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తా. ఇప్పుడు స్పోర్ట్స్‌ ప్రజంటేటర్‌గా అదే చేస్తున్నా’’.

రాళ్లపల్లి రాజావలి

పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. మా కాకినాడ. రైల్వేలో పనిచేశారు. అమ్మది రాజమండ్రి. నాకో అన్నయ్య ఉన్నారు. మా కెరీర్‌ విషయంలో పేరెంట్స్‌ ఎప్పుడూ కలగచేసుకోలేదు. వ్యాపారంలో చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా మళ్లీ ప్రయత్నించమని చెప్పేవాళ్లు. ఇకపోతే మా ఆయన పేరు వరుణ్‌ సాధు. ‘ఇంగ్లీష్‌ థియేటర్‌ ప్లే’ ల్లో నటిస్తారు. స్పోర్ట్స్‌ ప్రెజంటేటర్‌ అయ్యాక క్రికెట్‌ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకా బాగా యాంకరింగ్‌ చేయాలంటూ ప్రోత్సహిస్తుంటారు.

Updated Date - 2023-04-19T00:30:07+05:30 IST