Sri Ramanuja Jayanti : సమతాస్ఫూర్తి
ABN , First Publish Date - 2023-04-21T00:13:18+05:30 IST
భగవాన్ శ్రీ రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ముఖ్యుడు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త, తత్త్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. ఆలయ గోపురం ఎక్కి, నారాయణ మంత్రాల రహస్యాలు
భగవాన్ శ్రీ రామానుజాచార్యుడు
త్రిమతాచార్యులలో ముఖ్యుడు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త, తత్త్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. ఆలయ గోపురం ఎక్కి, నారాయణ మంత్రాల రహస్యాలు
వెల్లడించిన ఆయన జీవులను దివ్యజ్ఞాన జ్యోతుల వైపు నడిపించిన జగదాచార్యుడు. లింగం, కులం, మతం అనే అడ్డుగోడలను కూర్చి, అందరూ పరమాత్మను పొందాలని తపించిన సమతామూర్తి. మంత్ర రహస్యాలను ఛేదించిన అధ్యాపకుడు, ప్రబోధకుడు, మోక్ష మార్గదర్శి.
ఆదిశంకరులు ప్రబోధించిన అద్వైత విధానం, రామానుజులు ప్రవచించిన
విశిష్టాద్వైతం, మాధ్వాచార్య బోధించిన ద్వైత విధానం... మన ఆధ్యాత్మిక జీవనానికి మూడు వెలుగు మార్గాలు. వాటిలో శ్రీరామానుజుని మతం విశిష్టమైనది.
25న శ్రీరామానుజ జయంతి
పూర్వం భూతపురిగా వ్యవహారంలో ఉన్న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో... కాంతిమతి, కేశవాచార్యులు దంపతులకు... తమిళ పింగళ నామ సంవత్సరంలో శ్రీరామానుజాచార్యులు జన్మించారు. మరో పింగళ నామ సంవత్సరంలో పరమపదించారు. రాముణ్ణి సంతానంగా పొందడానికి దశరథుడు పుత్రకామేష్ఠి యజ్ఞం చేసినట్టు శ్రీమద్రామాయణం వివరిస్తోంది. ఆ తరువాత పుత్రకామేష్ఠి యజ్ఞం చేసిన వారు కేశవాచార్య- కాంతిమతీ దంపతులే. ఆయుర్వేదం ప్రకారం మానవుని సంపూర్ణ జీవన ఆయుర్దాయం 120 ఏళ్ళు. తమిళ, తెలుగు, కాలమానం ప్రకారం... ఒకే పేరు గల సంవత్సరం మళ్ళీ రావడానికి అరవై సంవత్సరాలు పడుతుంది. నూట ఇరవై ఏళ్ళంటే రెండు సార్లు. క్రీస్తుశకం 1017లో జన్మించి, 1137 వరకూ పూర్ణాయుష్షుతో జీవించిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యుడు. ఆయన ‘విజ్ఞానం అందరిదీ’ అనే సిద్ధాంతాన్ని నమ్మి, ఆచరించి, ప్రబోధించిన విశిష్టాద్వైత ప్రవక్త. భక్తి, జ్ఞాన మార్గాలను సులభతరం చేసిన ఆచార్యుడు. ఇతర మతాల శత్రు రాజులు భారతదేశంపై దాడులు చేసి, ఆలయాలను ధ్వంసం చేసి, మూలమూర్తులను అపవిత్రం చేసి, ఉత్సవమూర్తులను ఎత్తుకుపోయారు. ఆ ఆలయాలను పునరుద్ధరించడంలో ఆదిశంకరులు, రామానుజులు తమ వాగ్ధాటిని, వాదనా పటిమను ఉపయోగించారు. పరాయి మతరాజులు ఎత్తుకుపోయిన అనేక విగ్రహాలను తిరిగి సాధించారు. ఎనిమిది అక్షరాల (అష్టాక్షరీ మంత్రం) పరమార్థాన్ని తెలుసుకోవడానికి... ఆచార్యుని పరీక్షలను సహిస్తూ, ఉపవాసాలు చేస్తూ, కాలినడకన వందల మైళ్లు పదేపదే ప్రయాణిస్తూ... పద్దెనిమిది సార్లు శ్రీరంగం నుంచి తిరుగోష్టియూర్‌కు వెళ్ళి, గురువుగారి దయను అత్యంత సహనంతో సాధించిన రామానుజుడు పట్టుదలకు, దీక్షకు సరైన ఉదాహరణ.
వైష్ణవ కులంలో పుట్టిన వాడే వైష్ణవుడని శ్రీరామానుజులు నమ్మలేదు. చిత్తాన్ని విష్ణువు మీద ఉంచి, సర్వసమానతను పాటించేవాడే వైష్ణవుడని నమ్మి, ప్రబోధించారు. ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి... వాద ప్రతివాదాలతో, తత్త్వ విజ్ఞాన చర్చలతో, శాస్త్ర ప్రమాణాల ప్రసంగాలతో విజయఢంకా మోగించారు. తిరుమలలో వెలసిన మూర్తి నారాయణుడు కాడు, శివుడంటూ శైవులు స్వాధీనం చేసుకున్న తిరుమలను ‘హరి సన్నిధే’నని అని నిరూపించడానికి రామానుజులు సాగించిన వాదం ఆయన సంవాదన సంగ్రామాలు అన్నిటిలోనూ గొప్పది.
రామానుజులు గొప్ప రచయిత. సంస్కృతం, తమిళం, మణిప్రవాళం (సంస్కృత, తమిళ భాషల మిశ్రమం) మూడు భాషలలో నిష్ణాతుడు. బ్రహ్మసూత్రాల మీద శ్రీ భాష్యం, భగవద్గీతపై విశిష్టాద్వైత పరమైన వ్యాఖ్యానం, వేదార్థ సంగ్రహ పేరుతో ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం (భాష్యం) రచించారు. తరువాత మూడు ప్రఖ్యాత గద్యాలను- శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం పేర్లతో రచించారు. ‘వేదాంత, వేదాంత సార, వేదాంత దీప, నిత్యగ్రంథ’ అనేవి మరిన్ని రచనలు. ఈ తొమ్మిది గ్రంథాలకు ‘రామానుజుని నవరత్నాలు’ అని ప్రసిద్ధి. వీటిద్వారా రామానుజులు ‘శ్రీభాష్యకారుల’ని పేరు పొందారు. పన్నెండుగురు శ్రీవైష్ణవ ఆళ్వార్ల రచనలను సమష్టిగా ‘నాలాయిర ప్రబంధం’ అంటారు. వారి రచనలను ప్రజలలోకి తెచ్చిన ఘనత రామానుజలదే. అలాగే గోదాదేవి ‘తిరుప్పావై’ పాశురాల గురించి కూడా రామానుజులు ప్రబోధించేవారు. శ్రీ వైష్ణవాచార్యులైన పన్నెండుగురిలో ఎనిమిది మంది బ్రాహ్మణేతరులు, ఒక స్త్రీ ఉన్నారు. కులాతీతంగా వైష్ణవం సాగిందనడానికి ఇది సాక్ష్యం. కులం, మతం అని చూడకుండా అందరికీ ప్రతి ఆలయంలో భోజనం పెట్టే సంప్రదాయం శ్రీరామానుజులు ప్రారంభించిందే. ఈ సహపంక్తి భోజనాలను ‘తదీయారాధన’ అనీ, ‘సమారాధన’ అనీ అనేవారు. ‘రామానుజ కూటమి’ పేరుతో అన్నదానాలను, మధ్యాహ్న భోజనాలను నిర్వహించేవారు. ఇప్పటికీ వైష్ణవ క్షేత్రాలలో రామానుజ కూటములు కొనసాగుతున్నాయి. దక్షిణాన తిరువనంతపురం నుంచి పశ్చిమాన ద్వారక దాకా, ఉత్తరాన కాశ్మీరం, నేపాల్ నుంచి ముక్తినాథ్ దాకా, తూర్పున పూరీ జగన్నాథ్ దాకా పర్యటించి, శాస్త్ర చర్చలలో విజయాలు సాధించి, వైష్ణవ పరంపరను నెలకొల్పిన జగదాచార్యుడు శ్రీ రామానుజాచార్యుడు.
అలాగే తొండనూరులో 2200 ఎకరాల గుడి చెరువును ఆయన నిర్మించారు. దాన్ని ‘తొన్నూరు కేరె’ అంటారు. మేల్కోటేకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు డెబ్భై గ్రామాలకు వేయి సంవత్సరాలుగా తాగునీటి సమస్య తీర్చుతోంది. తిరునారాయణపురంలో దొరికిన ఒక కిరీటానికి తగిన విగ్రహం ఎక్కడ ఉందా? అని అన్వేషిస్తున్న రామానుజుడికి... నారాయణుడు స్వప్నంలో కనిపించాడు. తాను ఢిల్లీ సుల్తాన్ చెరసాలలో ఉన్నానని తెలియజేశాడు. శ్రీరామానుజులు అక్కడికి వెళ్ళి, సుల్తాన్‌ను సంప్రతించి, ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకువచ్చారు. విగ్రహరూపుడైన సుందరమూర్తితో ప్రేమలో పడిన ఢిల్లీ సుల్తాన్ కూతురు కూడా వెంట వచ్చిందనీ, ఆమెను ‘బీబీ నాంచార్’గా రామానుజులు గౌరవించారనీ అంటారు. చిదంబరంలోని గోవిందరాజ విగ్రహాన్ని హరిద్వేషంతో చోళరాజు తొలగిస్తే... అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలను రప్పించి, తిరుపతిలో గోవిందరాజ ఆలయాన్ని శ్రీరామానుజులు నిర్మించారని చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి.
యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహిత స్తదితరాణి తృణాయమేనే
అస్మద్గురోర్భగవతోస్య దయైుక సింధో రామానుజస్య చరణౌ శరణౌ ప్రపద్యే
‘నిత్యం అచ్యుతుని పాదాలను సేవిస్తూ ఇతరములన్నీ గడ్డితో సమానమని తృణీకరించే మా గురువు రామానుజుని పాదములే నాకు శరణు’ అని ప్రార్థించారు ఆయన శిష్యుడు కూరేశులు. శ్రీరామానుజులది సర్వులకూ, సర్వదా అనుసరణీయమైన మార్గం.
మాడభూషి శ్రీధర్