Leader Uppala Malsur : ఎమ్మెల్యే అయ్యాక కూడా..చెప్పులు కుట్టేవారు
ABN , First Publish Date - 2023-11-23T05:22:03+05:30 IST
మట్టిగోడల మీద టార్పాలిన్ పైకప్పుతో... రేపోమాపో నేలకొరిగేట్టున్న ఈ ఇల్లు ఓ మాజీ శాసనసభ సభ్యుడి కుటుంబానిది. ఆయన ఒకటి, రెండు కాదు...
మట్టిగోడల మీద టార్పాలిన్ పైకప్పుతో... రేపోమాపో నేలకొరిగేట్టున్న ఈ ఇల్లు ఓ మాజీ శాసనసభ సభ్యుడి కుటుంబానిది. ఆయన ఒకటి, రెండు కాదు... వరుసగా నాలుగు సార్లు సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఒక్క రూపాయి కూడబెట్టలేదు. పైగా తనకు వారసత్వంగా వచ్చిన మూడు కుంటల భూమిని ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చారు. సామ్యవాద సిద్ధాంతానికి నిబద్ధుడై, వ్యక్తిగత ఆస్తిని సైతం త్యజించిన ఆయన ఆదర్శమూర్తి మాత్రమే కాదు, అంతకుమించి ఆచరణవాది. అరవై ఏళ్ల కిందటే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిన గొప్ప నాయకుడు. ‘ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి’ అని బతికి చూపించిన ఆయన పేరు ఉప్పల మల్సూర్. ఆయన కన్నుమూసి పాతికేళ్లు అయినా, ‘నిస్వార్థ నేత’గా స్థానికుల స్మృతుల్లో సజీవంగానే ఉన్నారు. నిజాయితీతోకూడిన రాజకీయాలకు నమూనాగా చరిత్రలో నిలిచిన తొలి తరం ప్రజానాయకుడైన మల్సూర్ చిన్న కోడలు పుష్పలతను ‘నవ్య’ పలకరించింది.
‘‘ఈనాటి నాయకుల మాదిరిగా మా మామయ్య కూడా రాజకీయం చేసి ఉంటే, మేము కూడా పెద్ద పెద్ద మేడల్లో బతికేటోళ్లం. మా పిల్లలు ఏసీ కారుల్లో తిరిగేటోళ్లేమో! కానీ డబ్బు, బంగ్లా లాంటివేవీ లేకపోయినా... రెక్కల కష్టంతో బతికే మేము అంతకు మించిన ఆనందంతో బతుకుతున్నాం. సొమ్ముతో కొనలేనిది మంచి పేరు. అది మల్సూర్ మామ మాకు తరతరాలకూ తరగనంత ఇచ్చాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కోసం కాదు. ‘నీతి నిజాయితీలతో బతికిన ఆదర్శ ప్రజా ప్రతినిధి కుటుంబం వీరిది’ అని మమ్మల్ని చూసి పదిమంది గొప్పగా చెప్పుకొనేలా పేరు ప్రఖ్యాతులు మిగిల్చాడు. అది చాలు! ఇప్పటి రాజకీయ నాయకుల గురించి జనం మాట్లాడటమే ‘వాడు ఎంత వెనకేసుంటాడు రా!’ అంటూ మొదలుపెడతారు. మరి ఆ ఖర్మ మాకు పట్టనందుకు సంతోషమే కదా! ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా సూర్యాపేట నియోజకవర్గానికి సేవ చేసిన మల్సూర్‌కు సొంతిల్లు కూడా లేనిమాట వాస్తవమే! ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా ఆయన అక్క నర్సమ్మ ఇచ్చినది. అదీ సగం కూలిపోతే, మిగిలిన వసారా మీద టార్పాలిన్ కవరు కప్పి... ఆ కొద్ది జాగాలోనే మాతో పాటు మా తోటికోడలి కుటుంబం తలదాచుకుంటున్నాం. వానాకాలం మా అగచాట్లు మాటల్లో చెప్పలేను. అలా అని మమ్మల్ని చూసి ‘అయ్యో’ అనకండి. జలగల్లా జనం నెత్తురు పీల్చి మరీ ఇళ్ల మీద ఇళ్లు కట్టిన అవినీతి నేతలను చూసి జాలిపడండి.
కన్న కొడుక్కి సాయం చేయనన్నాడు...
మా మామయ్యకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. వీళ్లలో నా భర్త అజయ్‌కుమార్ చిన్నోడు. కమ్యూనిస్టు పార్టీ యోధుడు అజయ్‌కుమార్ ఘోష్ జ్ఞాపకంగా చిన్న కొడుక్కి మామయ్య ఆ పేరు ఇష్టంగా పెట్టుకొన్నాడు. మా పెద్దబావ సూర్యనారాయణ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసులో చిన్న ఉద్యోగి. రెండోబావ నర్సింహానిది వ్యవసాయం. మా ఆయన డిగ్రీ వరకు చదివినా కూలీ పనులకెళ్లేవాడు. ‘‘చిన్నోనికి కొలువు ఇప్పించకూడదా మల్సూర్’’ అని తెలిసినోళ్లు అడిగేవాళ్లు. ‘‘నా వాళ్లకు సాయం చేయండని ఒకరి దగ్గరకు వెళ్ళి, చేతులు కట్టుకొని అడగలేను. అయినా, జనం నాకు కట్టబెట్టిన ఈ పరపతి, పలుకుబడంతా సమాజం కోసమే కానీ, నా స్వార్థానికి కాదు’’ అని మామయ్య తెగేసి చెప్పిన సందర్భాలెన్నో! మా పెద్దబావ కూడా మొదట ఇంటర్వ్యూ వరకు వెళ్లినా, రికమండేషన్ లేకపోవడంతో ఉద్యోగం రాలేదట. తర్వాత ఆరుట్ల కమలాదేవి మాట సహాయంతో ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ సంగతి మామయ్యకు చివరి వరకు
తెలియదు. మాకు ఆస్తులు లేవనే వెలితి కన్నా, నీతికి నిలబడి బతికిన మల్సూర్ ముగ్గురు కొడుకులు అర్ధాయుష్షుతో పోవడమే భరించలేకపోతున్నాం. లివర్ క్యాన్సర్‌తో మా రెండోబావ, గుండె పోటుతో నా భర్త నాలుగేళ్ల కిందట చనిపోయారు. ‘‘వైద్యం చేయించే స్థోమత లేకే.. మనోళ్లను
పోగొట్టుకున్నాం’’ అని ఒకసారి బంధువుల ముందు బాధపడ్డాను. ‘‘మంది నోళ్లు కొట్టి పోగేసిన సొమ్ముతో నూరేళ్లు
బతికేకన్నా, నిజాయితీకి మారుపేరైన మల్సూర్ కొడుకులుగా... బతికినన్నాళ్లు ఒకరి దగ్గర చేయి చాచకుండా
బతికారు. అది చాలు’’ అని వారంతా ధైర్యం చెప్పారు.
పింఛను తిరస్కరించాడు...
మల్సూర్ మామను స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తిస్తూ అప్పటి ప్రభుత్వం సూర్యాపేటలో స్థలం కేటాయించింది. దాన్ని ఆయన తిరస్కరించాడు. ‘వ్యక్తిగత ఆస్తి ఉండటం కమ్యూనిస్టు పార్టీ ఆదర్శాలకు విరుద్ధం’ అని నమ్మాడు. తనకు వారసత్వంగా వచ్చిన మూడు కుంటల భూమిని సిరికొండ ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చాడు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనకు వచ్చే 500 రూపాయల గౌరవ వేతనంలోనూ మూడువంతులు కమ్యూనిస్టు పార్టీకి, మరొక వంద పార్టీ జిల్లా కార్యాలయ ఖర్చులకు ఇచ్చేవాడు. మిగిలిన వంద రూపాయల్లో ఇల్లు గడవడంతో పాటు తన ఖర్చులు వెళ్లేవి. తర్వాత మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే పింఛను కూడా తిరస్కరించాడు. ‘‘నువ్వు ఏమీ సంపాదించలేదు. రేపు నువ్వుపోయిన నాడు నీ కొడుకులు, కోడళ్లు ఎట్ల ఏడుస్తారు?’’ అని వాళ్లు వీళ్లు అంటుంటే, ‘‘నా కోసం నా జనం ఏడుస్తారు. అది చాలు’’ అని బదులిచ్చేవాడు. ఆయన అన్నట్టుగానే మామయ్య చనిపోయినప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకోవడం నా కళ్లారా చూశాను. మామయ్య బతికినన్నాళ్లు ‘జనం జనం...’ ఇదే మాట. ఆయన జనం కోసమే బతికాడు. జనం మనిషిగానే మిగిలాడు.
కాలినడకనే పాలన...
ఎమ్మెల్యే అంటే ఇప్పటిలా గన్‌మెన్‌లు గెస్ట్‌హౌ్‌సలు, కార్లు లాంటి సౌకర్యాలేవీ ఆనాడు మా మామయ్యకు ఉండేవి కావు. ఆయన 1952 నుంచి 1972 వరకు ఇరవై ఏళ్లు శాసనసభ సభ్యుడిగా కొనసాగాడు ఆ సమయంలో ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి... సొంతూరు సిరికొండ నుంచి కాలినడకన సూర్యాపేట వెళ్లి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వెళ్లేవాడట. అసెంబ్లీ అయిపోగానే తిరిగి సొంతూరికి వచ్చేవాడు. కాలినడకనే నియోజకవర్గంలోని ఊర్లన్నీ తిరిగి జనం సమస్యలు తెలుసుకొనేవాడు. వాటి పరిష్కారం కోసం... అక్కడికక్కడే స్వదస్తూరీతో అర్జీలు రాసి, దాని మీద ‘ఎమ్మెల్యే స్టాంప్’ వేసి దరఖాస్తుదారులకు ఇచ్చేవాడు. మామయ్య ఎమ్మెల్యేగా కొనసాగినన్నాళ్లు, వెంట ఒక సంచీలో దరఖాస్తు కాగితాలు, స్టాంపు, ఇంక్‌ప్యాడ్ లాంటివన్నీ తీసికెళ్లేవాడు. ‘ప్రజల వద్దకే పాలన’ అంటారు కదా... అది ఆయన అరవై ఏళ్ల కిందటే ఆచరించాడు. ప్రజాప్రతినిధిగా ఎంతోమందికి ఇళ్ల పట్టాలు, భూమి ఇప్పించాడు. రైతు కూలీ రేట్లు పెంచి పిచ్చాడు. కొలతల్లో మోసాలు కాకుండా మానికలు, కుండలు చేయించి... రైతు కూలీలకు పెద్దన్నలా అండగా బతికాడు. సూర్యాపేట పాత నియోజకవర్గంలోని ఊర్లలో ‘‘ఉప్పల మల్సూర్ లాంటి నాయకుడిని మళ్లా చూడం’’ అని ఇప్పటికీ తలచుకొంటారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజా సమస్యల మీద మల్సూర్ గారి ప్రశ్నలు తప్పకుండా ఉండేవని కొందరు చెప్పగా విన్నాను. తాను ఒక ఎమ్మెల్యేననే అహంకారం, గర్వం ఇసుమంత కూడా ఆయనలో కనిపించేవి కాదు. అలా మా మామయ్య జనం తలలో నాలుకలా మెలిగారు. అదే ఇప్పటి ఎమ్మెల్యేలను మనం ఎన్నికలప్పుడు తప్ప మిగతా రోజుల్లో కలవను కూడా కలవలేం కదా!
గ్రామ సర్పంచ్‌గా సేవలు
మామయ్య చదివింది ఐదో తరగతే. అయినా, కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలు చదవకుండా ఆయన రోజు గడిచేది కాదు. ఆయన కమ్యూనిస్టు నాయకుడు అయినా, కాంగ్రెస్ వాళ్లు కూడా అభిమానించేవాళ్లు. మామయ్య మాటను సిరికొండ జనమంతా జవదాటేది కాదు. ఊరి జాతరైనా, ముత్యాలమ్మకు బోనమైనా ‘‘మన్సూర్ ఉంటేనే చేద్దాం’’ అనేవాళ్లు. ఆయన ముందుంటే గొడవలు లేకుండా అంతా సాఫీగా జరిగిపోతుందని సిరికొండ గ్రామస్తుల నమ్మకం. ఆయనకు ఇష్టం లేకున్నా... ఊరోళ్లంతా కలిసి ఒప్పించి మరీ 1995లో మామయ్యను సర్పంచ్‌గా ఎన్నుకొన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత, గ్రామ సర్పంచ్‌గానూ సేవలందించిన వ్యక్తి బహుశా చరిత్రలో ఆయన ఒక్కరేనేమో.
అంతిమ సంస్కారాలకు అప్పు తెచ్చాం...
ఎమ్మెల్యే అయ్యాక కూడా మామయ్య ఇంట్లో చెప్పులు కుట్టేవాడు. ఎడ్లకు తోలుతో మెడ గంటలు తయారుచేసేవాడు. నాగలి దున్నడం లాంటి వ్యవసాయ పనులు కూడా చేసేవాడు. మిగతా వాళ్లందరం కూలికి వెళ్తే వచ్చిన దాంతో ఇల్లు గడిచేది. మామయ్య సూర్యాపేట ఆస్పత్రిలో చనిపోతే, భౌతికకాయాన్ని ఇంటికి తీసుకురావడానికి కూడా మా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. చివరికి అంతిమ సంస్కారాలు కూడా అప్పు చేసి జరిపాం. అయినా, ఆయన ఏమీ సంపాదించలేదని మేమెవ్వరం ఎన్నడూ అనుకోలేదు. అలాంటి మహనీయుడి కోడలిగా గర్వపడుతుంటా. మామయ్య స్మారక స్తూపాన్ని, విగ్రహాన్ని కట్టించి, ఈ రోజుకీ తగిన విధంగా సిరికొండ గ్రామస్తులు ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకొంటున్నారు. కాకపోతే, సూర్యాపేటలో విగ్రహం ఏర్పాటు కోసం కొందరు కమ్యూనిస్టు నాయకులు ప్రయత్నించారు. చందాలు వసూలు చేసినట్లు విన్నాను. కానీ ఇంతవరకు విగ్రహం పెట్టలేదు. కనీసం సూర్యాపేట జిల్లాకైనా నిస్వార్థంగా బతికిన మామయ్య పేరు పెట్టాలి. కనీసం ఆయన విగ్రహాన్ని అయినా జిల్లా కేంద్రంలో నెలకొల్పాలి. ఆ పని కమ్యూనిస్టు పార్టీలే చెయ్యాలి.
మమల్ని చూసి అయ్యో! అనద్దు
స్వాతంత్య్ర సమరయోధుడి కోటా కింద మామయ్యకు రావాల్సిన పింఛను కోసం ఆయన తదనంతరం మా అత్తమ్మ లచ్చమ్మ దరఖాస్తు చేసుకొంది. అయితే, ఆ తర్వాత పదేళ్లకు అప్రూవల్ వచ్చింది. అదీ ఆమె చనిపోయిన పదిరోజులకు. నేను ప్రస్తుతం సిరికొండ ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్నాను. నా రోజువారీ వేతనం వంద లేదా నూట యాభై రూపాయలకు మించదు. అదే నా జీవనాధారం. నా రెండవ తోటికోడలు యశోద కూలీ పనులకు వెళుతుంది. నాకు పిల్లలు లేకుంటే రెండో బావ కొడుకును పెంచుకొన్నాను. అతను పెయింటింగ్ పనికెళుతుంటాడు. ఇలా అందరం రెక్కల కష్టం చేసుకొని బతికేటోళ్లమే. కానీ, ఇంతవరకు మేమెక్కడా మా మామయ్య పేరుకు మచ్చ తెచ్చేలా నడుచుకోలేదు, నడుచుకోము కూడా. ఆయన పేరు చెప్పి ఇంతవరకు ఎలాంటి లబ్ది పొందలేదు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లాంటి అదనపు గుర్తింపు కూడా మాకు వద్దు. అయితే, సాధారణ నిరుపేద దళితులకు ప్రభుత్వం అందించే దళిత బంధు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం లాంటి పథకాలను పూర్తి అర్హత కలిగిన మాకు అందిస్తే చాలు! కూలీనాలి చేసుకొంటూ మా తోటి కోడళ్లం మామయ్యను చివరి దశలో కంటికిరెప్పలా చూసుకున్నాం. ఆయనకు కూతుళ్లలాగే మెలిగాం. మాజీ ఎమ్మెల్యేగా లేదా స్వాతంత్య్ర సమరయోధుడిగా మామయ్య పింఛనులో ‘డిపెండెంట్ల’కు (ఆధారపడ్డ వ్యక్తులకు) ఇచ్చే భాగాన్ని... ఒంటరి మహిళలమైన నాకుగానీ, మా తోటికోడలు యశోదమ్మకు కానీ ఇస్తే సంతోషం. అదీ నిబంధనల ప్రకారం... అందుకు మేము పూర్తి అర్హులం కూడా. ఉప్పల్ మల్సూర్ కుటుంబ సభ్యులుగా మేము ఈ సమాజం నుంచి కానీ, ప్రభుత్వాల నుంచి కానీ జాలి, దయ కోరుకోవడం లేదు. న్యాయబద్ధంగా మాకు దక్కాల్సిన హక్కును కల్పించాల్సిందిగా కోరుతున్నాం.’’
ఏడాదికి పైగా జైల్లో...
సూర్యాపేట నియోజకవర్గం రిజర్వ్‌డ్ స్థానం నుంచి 1952, 57లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరం అభ్యర్థిగా పోటీ చేసి మామయ్య గెలిచారు. తర్వాత 1962లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, 1967లో సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారత్-చైనా యుద్ధ సమయంలో.... ‘పీడీ’ చట్టం కింద అరెస్టై... జైలు శిక్ష అనుభవించిన కమ్యూనిస్టు నాయకుల్లో మామయ్య కూడా ఒకరు. ఆయన శాసనసభ్యుడిగా కొనసాగున్న సమయంలోనే ఏడాదికిపైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆ సంగతులన్నీ నాకు చెబుతుండేవారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎన్నడూ ఒక్క రూపాయి పంచలేదు. ఒకరిని విమర్శించలేదు.
మా నాన్నలాంటి నాయకుడు అరుదు - కొమురమ్మ, ఉప్పల్ మల్సూర్ కుమార్తె
మా నాన్న పదహారో ఏట నిజాం వ్యతిరేక పోరాటంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి దళంలో చేరాడు. బొమ్మగాని ధర్మభిక్షం, మద్దికాయల ఓంకార్ లాంటి నాయకులతో కలిసి పోరాడాడు. ఒకసారి చందుపట్ల దగ్గర మా నాన్నను రజాకార్లు పట్టుకొని చంపబోయారట. ‘‘చెప్పులు కుట్టుకొని బతికేటోడిని. నాకేమీ తెలియదు’’ అని చెప్పి తప్పించుకున్నాడట. ఈ సంగతులు ఆయనే మాకు చెబుతుండేవాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అరెస్టైయ్యి, ఆరు నెలలు జైల్లో ఉన్నాడు. విడుదల అయిన కొద్దిరోజులకే మొదటి ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. ప్రజల్లో మా నాన్నకు ఉన్న పేరు, పరపతిని చూసి ఓర్వలేని ఒక ప్రత్యర్థి పార్టీ అతను ఒక సారి ఆయన్ను చెంపదెబ్బ కొట్టాడట. మా నాన్న వెంటనే మరొక చెంప చూపించాడట. దాంతో అతడు నోరు మూసుకొని వెళ్లాడని విన్నాను. ‘దెబ్బకు దెబ్బకొట్టాలి, ఒకరిని తిట్టాలి’ లాంటి కక్షసాధింపు ధోరణి మా నాన్నలో నేనెన్నడూ చూడలేదు. ఆయన చాలా నెమ్మదస్తుడు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా అలానే మెలిగారు. వాళ్లను చూసి మనం చాలా నేర్చుకోవాలి.
ఇంటర్వ్యూ: సాంత్వన్
ఫొటోలు: శీలం హనుమంతరావు