Preethi Reddy Family Pub : పబ్‌కు పోదాం చలో చలో...
ABN , First Publish Date - 2023-03-27T04:03:46+05:30 IST
లాంజ్‌లు, పబ్‌లు... ఇవన్నీ కుర్రకారుకే పరిమితం! మరి కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో లాంజ్‌కి వెళ్లాలనుకునే వాళ్ల పరిస్థితేమిటి? ఈ ఆలోచనతో ఫ్యామిలీ లాంజ్ అనే వినూత్నమైన...
లాంజ్‌లు, పబ్‌లు... ఇవన్నీ కుర్రకారుకే పరిమితం! మరి కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో లాంజ్‌కి వెళ్లాలనుకునే వాళ్ల పరిస్థితేమిటి? ఈ ఆలోచనతో ఫ్యామిలీ లాంజ్ అనే వినూత్నమైన సంస్కృతికి తెర తీసింది హైదరాబాద్‌కు చెందిన ప్రీతి రెడ్డి. షెర్లాక్స్ లాంజ్ అనే ఫ్యామిలీ పబ్‌ను నడుపుతున్న తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి, నవ్యతో పంచుకున్న విశేషాలివి.
మేం తెలుగు వాళ్లమే అయినా నేను బెంగుళూరులోనే పుట్టి, పెరిగాను. గతంలో మా పూర్వీకులు బెంగుళూరు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. పెళ్లయ్యాక నేను హైదరాబాద్‌కు వచ్చేశాను. గత 12 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను.
మా లాంజ్‌లో పనిచేసే శిబ్బంది ఎంతో సుశిక్షితులు. కొవిడ్ సమయంలోనే నేను ఏ పనిలో అనుభవం లేని తెలంగాణాలో మారుమూల ప్రాంతాల్లోని వాళ్లను ఎంచుకుని, వాళ్లకు రెండేళ్ల పాటు శిక్షణ ఇప్పించాను. వాళ్లకు సర్టిఫికెట్లను కూడా అందించాం. కిచెన్, సర్వీస్, బార్.. ఇలా అన్ని నైపుణ్యాలనూ వాళ్లు కలిగి ఉంటారు. కొన్ని బ్యాచె్‌సకు ఉచిత శిక్షణ కూడా ఇప్పించాం. మేం కొన్ని కాలేజీలతో టైఅప్ అయి ఉన్నాం. పిల్లలకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరాన్ని మట్టి మా లాంజ్‌లోనే నియమించుకుంటాం. లేదంటే బెంగుళూరులోని ఇతర బ్రాంచె్‌సలో వాళ్లను నియమిస్తూ ఉంటాం.
2020లో షెర్లాక్స్ లాంజ్ స్థాపించడానికి ముందు నేను జర్మన్, యూరోపియన్ కంపెనీల్లో హెచ్‌ఆర్ హెడ్‌గా పని చేశాను. బాబు పుట్టిన తర్వాత ఇండియాలో స్థిరపడాలని బెంగుళూరుకు తిరిగి వచ్చేశాను. అయితే అంతకాలం బిజీగా గడిపేసిన నేను ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత ఖాళీగా ఉండలేకపోయాను. అయితే ఏదో ఒక వ్యాపారం కాకుండా, వినూత్నంగా ఉండే వ్యాపారాన్ని ఎంచుకోవాలని అనుకున్నాను. మేం బెంగుళూరులో ఉండేవాళ్లం కాబట్టి అక్కడ షెర్లాక్స్ బ్రాండ్ గురించి నాకు బాగా తెలుసు. అది బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల పాత బ్రాండ్. దాని యజమాని నాకు ఫ్రెండ్. అదే బ్రాండ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేయాలి అనే చర్చ వచ్చినప్పుడు, ఒక ఫ్యామిలీ పబ్‌గా షెర్లాక్స్ లాంజ్‌ను మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది.
ఇది ఫ్యామిలీ లాంజ్
పబ్ అనగానే ఇరవై ఏళ్ల కుర్రకారు, ఎంట్రీ ఫీజులు, బౌన్సర్లు, గోలలు.. ఇవన్నీ కళ్ల ముందు మెదులుతాయి. పైగా లాంజ్‌లకు డ్రస్ కోడ్స్ ఉంటూ ఉంటాయి. చీరలు కట్టుకుని రాకూడదు అంటారు. పైగా టీనేజర్లు, పిల్లలు తల్లితండ్రులతో కలిసి లాంజ్‌లకు వెళ్లే పరిస్థితి లేదు. అలాగే పెద్దలు కూడా పిల్లలను పబ్‌లకు తీసుకువెళ్లలేరు. హైదరాబాద్‌లో పబ్ సంస్కృతి అలాంటిది. అయితే పబ్‌లు, లాంజ్‌లన్నీ యువతకే పరిమితమైపోతే మన లాంటి కుటుంబాల పరిస్థితేంటి? పిల్లల పరిస్థితేంటి? వాళ్లు కూడా చక్కని సంగీతాన్నీ, రుచికరమైన భోజనాన్నీ ఆస్వాదించాలని కోరుకుంటారు కదా? అలాగని వాటి కోసం సాధారణ పబ్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా కుటుంబం కోసం షెర్లాక్స్ లాంజ్‌ను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ లాంజ్‌కు నేనే లైసెన్స్ హోల్డర్‌ను. పైగా ఒంటి చేత్తో ఈ ఫ్యామిలీ పబ్‌ను నడుపుతున్న ఏకైక మహిళను కూడా నేనే! లాంజ్‌కు సంబంధించిన ప్రతి పనిలో నా ప్రమేయం ఉంటుంది. నేను కౌంటర్‌లో కూడా కూర్చుంటూ ఉంటాను.
రెస్టారెంట్‌ను మరిపించేలా...
సాధారణ పబ్‌లకు కొన్ని నిబంధనలు, పరిమితులు ఉంటాయి. కానీ షెర్లాక్స్ లాంజ్ ఇందుకు పూర్తి భిన్నం. కుటుంబసమేతంగా పిల్లాపాపలతో నచ్చిన దుస్తుల్లో ఇక్కడకు రావచ్చు. ఒక రెస్టారెంట్‌కు ఎలా వెళ్తామో, అలాగే ఈ లాంజ్‌కు కూడా వచ్చి చక్కగా డ్రింక్స్‌నూ, ఆహారాన్నీ, సంగీతాన్నీ ఆస్వాదించవచ్చు. నిజానికి ఇప్పటి తరం పిల్లలకు పబ్‌లకు వెళ్లాలని ఉంటుంది. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్లకు ఆ వాతావరణాన్ని చూపించడం కోసం షెర్లాక్స్ లాంజ్‌ను ఎంచుకోవచ్చు. క్రికెట్ సీజన్‌లో లాంజ్‌లో కూర్చుని క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అయితే మరి పబ్స్‌లో డాన్స్‌లు చేస్తూ ఉంటారు కదా? ఇక్కడ అలాంటి సౌలభ్యం లేదా అని బాధపడవలసిన అవసరం లేదు. దీన్లో కూడా డాన్స్‌కు ఒక ప్రదేశాన్ని కేటాయించాం.
మహిళలు పబ్ ఎందుకు నడపకూడదు?
సాధారణంగా పెళ్లి తర్వాత మహిళలు కొన్ని పనులకే పరిమితమైపోతారు. ముందులా అన్ని పనులూ చేయలేరు అనే నమ్మకం మనలో నాటుకుపోయింది. దాంతో బ్యూటీ, విద్యా రంగాలకే మహిళలు ఎక్కువగా పరిమితమైపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్ లాంటి కొన్ని రంగాలు పురుషులకే పరిమితమైపోయి ఉంటాయి. కానీ దీన్లో మహిళలెందుకు అడుగు పెట్టకూడదు? ఆ పనికి మహిళలు సమర్థులు కారా? మహిళలు బార్‌కు వెళ్లొచ్చు కానీ బార్‌ను నడపకూడదా? ఎందుకిలా? నిజానికి వృత్తుల పరంగా స్త్రీపురుషుల మధ్య విబేధాలు పాటించడం సరి కాదు. నా మటుకు నేను షెర్లాక్స్ లాంజ్‌ను ఒక సవాలుగా తీసుకున్నాను. మహిళలు కూడా సమర్థంగా బార్‌లను నడపగలరనే ఒక సందేశాన్ని అందించడంతో పాటు కుటుంబసమేతంగా పబ్ కల్చర్‌ను ఎంజాయ్ చేసే వెసులుబాటు కల్పించడం కోసం నేనీ షెర్లాక్స్ లాంజ్‌ను మొదలుపెట్టాను. ఈ వృత్తిలో సవాళ్లూ ఉంటాయి. అన్ని పబ్స్‌లో లాగే ఇక్కడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఓ సందర్భంలో లాంజ్‌కి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో టీనేజీ అమ్మాయిలున్నారు. వాళ్లకు దగ్గర్లోనే కూర్చుని ఉన్న కొందరు కుర్రాళ్లు ఆ అమ్మాయిలను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టడంతో, గొడవ మొదలైంది. అప్పుడు నేను కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాను. అంతే కాకుండా పోలీస్ కేసు కూడా ఫైల్ అయ్యేలా చూశాను.
బిల్లు కట్టమని మొండికేస్తే...
సినిమాల్లో మాదిరిగా ఎక్కువగా తాగేసి, బిల్లు కట్టడానికి డబ్బుల్లేవనీ, రేపొచ్చి కడతామనీ కొందరు మొండికేస్తూ ఉంటారు. ‘ఇవ్వాళ కాకపోతే రేపు బిల్లు కట్టించుకోవడానికి, ఇదేమీ మార్వాడీ షాపు కాదు కదా?’ అని నచ్చజెప్పి, నయానో, భాయనో వాళ్ల చేత బిల్లు కట్టించేసుకుంటూ ఉంటాను. కొందరు మొబైల్ ఉంచుకోండి, బిల్లు రేపొచ్చి కడతా అంటూ ఉంటారు. కానీ ఎన్ని సాకులు చెప్పినా, బిల్లు కట్టకుండా నేను వాళ్లను వెళ్లనివ్వను. మెయిన్ డోర్ లాక్ చేసేసి, బిల్లు కట్టిన తర్వాతే పంపిస్తామని చెప్పేస్తాం. ఒకట్రెండు సందర్భాల్లో కస్టమర్లు ఎక్కువ తాగేసి, ఒళ్లు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ల ఆధార్ కార్డు తీసుకుని లేదా వాళ్ల సన్నిహితులను ఫోన్ ద్వారా సంప్రతించి, పిలిపించి, వాళ్లను ఇళ్లకు క్షేమంగా పంపించడం చేశాం. ఒళ్లు తెలియకుండా తాగిన స్థితిలో కస్టమర్లను బయటకు పంపించడం సరి కాదు. తర్వాత వాళ్లకేదైనా ప్రమాదం జరిగితే మేం బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం.
‘ఒక మహిళే లాంజ్ నడుపుతున్నప్పుడు, మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి?’ అనే ఆలోచన రావాలనే ఉద్దేశంతో, లాంజ్‌లో పురుషుల సహాయం లేకుండా అన్ని పనులూ నేనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. మరీ ముఖ్యంగా ఒంటరి మహిళలు బార్‌కు వెళ్లడానికి సంకోచిస్తారు. కానీ ఇక్కడ అలా భయపడవలసిన అవసరమే ఉండదు. హైదరాబాద్‌లో మాదిరిగానే త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి లాంజ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.
గోగుమళ్ల కవిత