Share News

చిరుధాన్యాల రుచుల పంట

ABN , First Publish Date - 2023-12-02T02:01:38+05:30 IST

ఆరోగ్యకరమైన జీవనానికి తృణధాన్యాలు ముఖ్యమని చాలామంది భావిస్తున్నారు.

చిరుధాన్యాల రుచుల పంట

ఆరోగ్యకరమైన జీవనానికి తృణధాన్యాలు ముఖ్యమని చాలామంది భావిస్తున్నారు. ఇవి మనకు ఆరోగ్యకరమైన జీవనాన్ని ఇవ్వటంతో పాటుగా తినటానికి రుచికరంగా కూడా ఉంటాయి. అందుకే రాగి, సజ్జ, అవిస... ఇలా రకరకాల తృణధాన్యాల ద్వారా వంటలు చేసుకోవటం కూడా బాగా పెరిగింది. అలాంటి కొన్ని వంటలు తయారీ ఎలాగో చూద్దాం.

రాగి, అరిటిపండు

స్మూతీ

కావాల్సిన పదార్థాలు

రెండు స్పూన్ల రాగి పొడి, ఒకటిన్నర కప్పుల నీళ్లు, బాగా ముగ్గిన ఒక అరటి పండు, గింజలు తీసేసిన మూడు ఖర్జూరాలు, తగినన్ని బాదం పప్పులు, ఒక టేబుల్‌ స్పూను అవిస గింజలు, అరకప్పు మామూలు పాలు లేదా బాదం పాలు.

తయారీ విధానం

ఒక కప్పులో రాగి పొడిని నీళ్లతో కలపాలి. ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. ఈ వేడి నీళ్లలో రాగి మిశ్రమాన్ని కలపాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కిందకు దింపి చల్లార్చాలి.

ఒక మిక్సీలో అరటిపండు, ఖర్జూరాలు, అవిస గింజలు, పాలు వేసి బాగా తిప్పాలి. దీనిలో రాగి మిశ్రమాన్ని కలిపి తిప్పాలి.

ఇలా తయారైన స్మూతీపైన బాదం పప్పులు వేయాలి.

రాగి ఉప్మా

కావాల్సిన పదార్థాలు

ఒక కప్పు రాగి రవ్వ, రెండున్నర కప్పుల నీళ్లు, నాలుగు టీ స్పూన్ల నూనె లేదా నెయ్యి, తగినంత కరివేపాకు, రెండు పచ్చి మిరపకాయలు, అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర, ఒకటిన్నర టేబుల్‌ స్పూను శనగపప్పు, ఒకటిన్నర టేబుల్‌ స్పూను మినపప్పు, తగినంత అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయ (ఒకటి), తగినన్ని వేరుశనగ గుళ్లు.

తయారీ విధానం

రాగి రవ్వను బాగా కడగాలి. 30 నిమిషాలు నీళ్లలో నానపెట్టాలి. ఆ తర్వాత నీళ్లు అన్నీ పారబోయాలి.

ఫ ఒక మూకుడులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. దానిలో ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్లు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలను వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారపు రంగు వచ్చే దాకా వేగించాలి. ఆ తర్వాత ముందుగా వేగించుకున్న రాగి రవ్వను కలపాలి.

రాగి రవ్వను కలిపిన తర్వాత రెండున్నర కప్పుల నీళ్లను పోసి.. మూకుడుపై మూత పెట్టి ఉడకనివ్వాలి. నీళ్లు అన్నీ ఆవిరి అయ్యేదాకా ఉడకనిచ్చి పొయ్యిపై నుంచి దింపేయాలి. దింపిన తర్వాత అవసరమైతే కొద్దిగా నెయ్యి కలుపుకోవచ్చు.

జొన్న పేలాలు

కావాల్సిన పదార్థాలు

ఒక కప్పు జొన్నలు, తగినంత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నూన.

తయారీ విధానం

జొన్నలను నీళ్లలో కడగాలి. కడిగిన తర్వాత వెంటనే ఒక పొడి గుడ్డలో ఆరబెట్టాలి. నీళ్లు పూర్తిగా పోయేవరకు ఆరబెట్టాలి.

చిన్న ప్రెషర్‌ కుక్కర్‌ను తీసుకొని వాటిలో ఈ జొన్నలను వేసి ఒక విజిల్‌ వచ్చేదాకా వదిలేయాలి. ఈ లోపులోనే మనకు జొన్నలు పేలుతున్న శబ్దాలు వినిపిస్తాయి. జొన్నలు

పేలాలుగా మారతాయి.

పేలాలుగా మారిన జొన్నలను ఒక ప్లేటులో చల్లబరచాలి.

ఒక మూకుడులో కొద్దిగా నూనె వేసి దానిలో పసుపు వేసి, జొన్న పేలాలను వేగించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు కలపాలి.

కొర్రల సలాడ్‌

కావాల్సిన పదార్థాలు

అర కప్పు ఉడకపెట్టిన కొర్రలు, పావు కప్పు ఉడకపెట్టిన శనగలు, సగం కీరా దోసకాయ ముక్కలు, సగం క్యారెట్‌ ముక్కలు, చిన్న క్యాప్సికం ముక్కలు, తగినంత కొత్తిమీర, ఒక టేబుల్‌ స్పూను ఆలివ్‌ నూనె లేదా వేరుశనగ నూనె, వెల్లుల్లి (రెండు రెబ్బలు), ఒక టేబుల్‌ స్పూను నిమ్మ రసం, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, నచ్చిన డ్రైఫ్రూట్స్‌ తగినన్ని.

తయారీ విధానం

ఒక గిన్నెలో నూనె వేయాలి. దానిలో వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, నిమ్మ రసం, ఉప్పు వేసి బాగా కలపాలి.

దానిలో ఉడకపెట్టిన కొర్రలు, ఉడకపెట్టిన శనగలు, కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర వేసి కలపాలి.

ఆ తర్వాత నచ్చిన డ్రైఫ్రూట్స్‌ను వేయాలి.

Updated Date - 2023-12-02T02:01:46+05:30 IST